Cancer Cases
-
World Health Organization: భారత్‌లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
క్యాన్సర్.. ఇలా గుర్తిస్తే త్వరగా కోలుకోవచ్చు
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరూ హడలిపోతారు. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి. ఈమధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సమస్య వచ్చాక ఏం చేయాలి అని ఆలోచించే కంటే ముందు నుంచే జాగ్రత్తలు పాటిస్తే ఒకటిలో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్యాన్సర్ నివారణకు మన చేతుల్లో ఉన్నది, మనం చేయగలిగింది, మన జీవన శైలిని ఆరోగ్యంగా మార్చుకోవటం మాత్రమే! క్యాన్సన్ నివారణలో అత్యంత కీలక పాత్ర పోషించే ఐదు అలవాట్లు ఏంటంటే.. 1.మొదటిది ఆహార అలవాట్లు, మన ఆహారంలో పండ్లూ, కూరగాయలు భాగం అయ్యేలా సరైన పోషకాలు అందేలా తీసుకోవాలి. 2 ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకూడదు, మానసిక ఒత్తిడి పరోక్షంగా క్యాన్సర్‌కు కారణం అవ్వొచ్చు. 3.రోజూ శారీరక శ్రమ తప్పనిసరి. క్రమం తప్పకుండా కనీసం ముప్పై నిముషాలు వ్యాయామం చేయాలి. 4.అప్రమత్తంగా ఉండి ఏదైనా క్యాన్సర్ సంకేతం కనిపిస్తే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. 5. ధూమపానం ,మద్యపానం వంటి అలవాట్లకువీలైనంత దూరంగా ఉండాలి. క్యాన్సర్.. ఎలా గుర్తించాలి? క్యాన్సర్ శరీరంలో ఏ భాగానికైనా ఏ వయసులోనైనా రావచ్చు . చాలా క్యాన్సర్లకు లోతుగా పరీక్షలు జరిపితే గానీ గుర్తించలేము . మన శరీరం గురించి మనకంటే బాగా ఎవరికీ తెలియదు. అందుకే డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఎలాంటి సంకోచాలు లేకుండా మన ఇబ్బందులను పూర్తిగా చెప్పేయాలి. ఏదైనా సమస్యగా అనిపించినపుడు నిర్లక్ష్యం చేయకూడదు . మన పెద్దలకు , పూర్వీకులకు క్యాన్సర్ ఉన్నట్లైతే మనకు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి సంబంధిత వైద్యుల సలహాలను పాటించి కుటుంబంలో అందరు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అంతే త్వరగా కోలుకోవచ్చు.. ►క్యాన్సర్ అని పలకడానికి,చెప్పడానికి చాలామంది భయపడతారు, ఇష్టపడరు. క్యాన్సర్ అనగానే ఇక ఆ మనిషి బతకడమే కష్టమన్నట్లు ఆలోచిస్తారు. క్యాన్సర్ వచ్చినవారిని జాలిగా,చులకనగా , అంటరానివారుగా చూడడం , ఏదో పాపం చేయడం వల్లనే వారికి క్యాన్సర్ వచ్చిందని దెప్పిపొడవడం చేయకూడదు .క్యాన్సర్ అని చెప్పడానికి భయపడడం, బాగా దిగులుపడడం , నిరాసక్తంగా నిస్పృహలో ఉంటూ వైద్యులకు సహకరించకపోవడం చేయకూడదు. ► సగానికి పైగా క్యాన్సర్లు మామూలు వ్యాధుల్లానే సరైన వైద్యంతో నివారించబడతాయి. ముఖ్యంగా వ్యాధి నిర్థారణ ఎంత త్వరగా జరుగుతుందో అంత త్వరగా కోలుకోవచ్చు. ► వైద్యుల దగ్గర దాపరికం ఉండకూడదు. అలానే అనుమానం కూడా ఉండకూడదు . వారి సలహాల పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు.నమ్మకంతో ధైర్యంగా వైద్యం తీసుకోవాలి . ► 6 నెలలకు,సంవత్సరానికి ఒకసారి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా శారీరక ఇబ్బంది, సమస్య వచ్చినపుడు వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. ► మనం తీసుకునే ఆహారమే ఆరోగ్యానికి ముఖ్య కారణం. సరైన నిద్ర , ఆహారం , జీవనశైలి , ఆలోచనా విధానం వల్ల సగానికి పైగా వ్యాధులు తగ్గుతాయి. ► ఎంతటి ప్రమాదకర సమస్య అయినా సరైన అవగాహనతో , సానుకూల దృక్పథంతో , ఆరోగ్యకర జీవనశైలితో ప్రయత్నస్తే తప్పకుండా బయటపడగలం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
కోవిడ్ తర్వాత దేశంలో క్యాన్సర్ విజృంభిస్తోంది: రాందేవ్
పనాజి: భారత్‌లో కరోనా విజృంభణ తర్వాత క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. గోవా మిరామర్ బీచ్‌లో శనివారం పతాంజలి యోగా సమితి నిర్వహించిన యోగా క్యాంప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొవిడ్-19 మహమ్మారి విజృంభణ తర్వాతే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు కంటిచూపును, వినికిడి శక్తిని కోల్పోతున్నారు అని ఆయన ప్రసంగించారు. అయితే బాబా రాందేవ్ అభిప్రాయాన్ని.. వైద్య నిపుణులు తోసిపుచ్చుతున్నారు. గోవాలోని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ విభాగం మాజీ అధికారి, ప్రముఖ ఆంకాలజిస్ట్ శేఖర్ సాల్కర్ స్పందిస్తూ.. ప్రపంచ జనాభాతో పాటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతీ రెండేళ్లకొకసారి క్యాన్సర్ కేసుల్లో ఐదు శాతం పెరుగుదల చోటుచేసుకోవడం సాధారణమే అని డాక్టర్ శేఖర్ స్పష్టం చేశారు. 2018లో భారత్‌లో లక్షకు 85 క్యాన్సర్ కేసులు వెలుగు చూసేవి. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష జనాభాకు 104 క్యాన్సర్ కేసులకు చేరింది. క్యాన్సర్ కేసులు తగ్గడం అనేది ఉండదు. అలాగే కరోనా లాంటి మహమ్మారితో దానిని ముడిపెట్టడం సరికాదని, అందుకు సంబంధించిన ఆధారాలేవీ లేవని అన్నారాయన. డాక్టర్ శేఖర్ గోవా బీజేపీ మెడికల్ సెల్‌కు చీఫ్ కూడా. సెలబ్రిటీలపై ప్రజల్లో కొంత నమ్మకం ఉంటుందని, వాళ్లు బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలంటూ పరోక్షంగా రాందేవ్‌కు చురకలంటించారాయన. అమెరికాలో ప్రతీ లక్ష జనాభాకు 500 క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయని, ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా.. సరైన జీవనశైలిని అవలంభించకపోతే క్యాన్సర్ రేటులో అమెరికాను భారత్ మించి పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు..
వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి... ► క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. ► క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. ► క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్–బి వ్యాక్సిన్ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు. ► క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ► క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. ► క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. ► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.. వ్యాధి నిర్ధారణ పరీక్ష గురించి తెలుసా?
రక్తకణాల ఉత్పత్తి కొన్ని దుష్ప్రభావాలకు లోనై, కొన్ని రకాల రక్తకణాలు అపరిమితంగా పెరగడాన్ని స్థూలంగా ‘బ్లడ్ క్యాన్సర్’గా చెప్పవచ్చు. ఈ సమస్యకు మూలం ప్రధానంగా బోన్ మ్యారో (ఎముక మజ్జ /మూలగ)లో ఉండి, అక్కడే అది ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎముక మజ్జ (మ్యారో)లో తొలుత మూలకణాలు అభివృద్ధిచెంది... క్రమంగా అవి ఎర్రరక్తకణాలు (ఆర్బీసీ), తెల్లరక్తకణాలు (డబ్ల్యూబీసీ), ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతాయి. బ్లడ్ క్యాన్సర్ వచ్చినవారిలో సాధారణంగా తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా నియంత్రణ లేకుండా పెరిగిన తెల్లరక్తకణాలు మిగతా వాటిని పనిచేయనివ్వవు. ఫలితంగా వ్యక్తులు తమ స్వాభావికమైన రోగనిరోధక శక్తిని కోల్పోతారు. బ్లడ్ క్యాన్సర్స్‌లో ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. అవి... 1) లుకేమియా 2) లింఫోమా 3) మైలోమా. లక్షణాలు: బ్లడ్‌క్యాన్సర్‌లో పూర్తిగా పరిపక్వం కాని తెల్లరక్తకణాలు అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంటాయి. ఫలితంగా గాయాలైనప్పుడు రక్తాన్ని గడ్డకట్టించడానికి ఉపయోగపడే ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా దద్దుర్లు కనిపిస్తుంటాయి. వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవులతో తెల్లరక్తకణాలు పోరాడుతుండటం వల్ల మనకు వ్యాధినిరోధకత చేకూరుతుందన్న విషయం తెలిసిందే. అయితే అపరిపక్వమైన తెల్లరక్తకణాల వల్ల వాటి పనితీరు దెబ్బతినడం... ఫలితంగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. పైగా అవి విపరీతంగా పెరగడం వల్ల ఎర్ర రక్తణాలు తగ్గిపోవడంతో రోగికి రక్తహీనత రావచ్చు. దాంతో వాళ్లలో తగినంత ఆక్సిజన్ అందక ఆయాసం కూడా రావచ్చు. అంతేకాదు... జ్వరం, వణుకు, రాత్రుళ్లు చెమటలు పట్టడం, ఇన్ఫ్లుయెంజా, అలసట, ఆకలి లేకపోవడం, కాలేయం, స్పీ›్లన్ పెరగడం, ఎముకల నొప్పి లాంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బోన్‌మ్యారో పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారికి ప్రధానంగా మందుల (కీమోథెరపీ)తోనే ఎక్కువగా చికిత్స అందిస్తుంటారు. -
పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు ఇవే.. వాటి లక్షణాలు, రకాలు తెలుసుకోండి!
పిల్లలది అభం, శుభం తెలియని అమాయకత్వం. వాళ్లది ఆటలాడుకునే పసిప్రాయం. వాళ్లకసలు క్యాన్సర్ అనే పదానికి అర్థమే తెలియదు. కానీ క్యాన్సర్‌కు అవేమీ పట్టవు. పెద్దవారిలో వచ్చే అన్ని క్యాన్సర్లూ పిల్లల్లోనూ వచ్చినప్పటికీ... కొన్ని రకాలు పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. లుకేమియా (రక్త సంబంధిత క్యాన్సర్లూ), మెదడులో వచ్చే కణుతులు (బ్రెయిన్ ట్యూమర్స్), లింఫోమా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా వంటివి పిల్లల్లో ఎలాంటి లక్షణాలూ చూపకుండానే అకస్మాత్తుగా వచ్చే జ్వరం వంటి లక్షణాలతో బయట పడవచ్చు. ఒకరినో ఇద్దరినో కని, ఆ సంతానాన్ని అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులు తమ చిన్నారికి క్యాన్సర్ అనగానే తల్లడిల్లిపోతారు. అయితే అదృష్టవశాత్తూ పిల్లల్లో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు పూర్తిగా నయం చేయదగినవే. వాళ్లలో వచ్చే చాలా రకాల క్యాన్సర్లు ఇప్పుడు చికిత్సకు లొంగిపోతుండటం విశేషం. చాలామంది సెలబ్రిటీస్, సినీతారలు, ఇతరత్రా రంగాల్లో నిపుణులు చిన్నప్పుడు క్యాన్సర్‌కు గురైనప్పటికీ, చికిత్స తీసుకుని, ఇప్పుడు అందరిలాగే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ల రంగాల్లో ముందుకెళ్తున్నవారు చాలామందే ఉన్నారు. మనదేశంలో ప్రతీ ఏడాదీ దాదాపు 45,000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీళ్లలో 70 శాతం మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే 30 శాతం మందిలో వారి జీవితకాలంలో అది ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంది. చిన్నప్పుడు 20 ‘గ్రే’ల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ‘గ్రే’అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్థం. మామోగ్రామ్ వంటి పరీక్షలు మరీ చిన్నవయసులో చేయించడమూ అంత మంచిది కాదు. 30 ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటేనే మంచిది. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలావరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ తీసుకునేటప్పడు ఒంటరిగా ఉండటానికి భయపడి చికిత్సకు సహకరించకపోతే కొన్ని సందర్భాల్లో వారికి మత్తు ఇస్తారు. 12 ఏళ్లు పైబడ్డాక అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ క్యాన్సర్ చికిత్స వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుందనుకుంటే... అలాంటిప్పడు ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరుస్తుంటారు. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లుకేమియా. ఇలా అధికంగా పెరిగిన తెల్లరక్తకణాలు ఎర్రరక్తకణాలను అడ్డుకుని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలా ఒక్కసారిగా జరగడం కానీ లేదా దీర్ఘకాలికంగా గానీ జరగవచ్చు. చాలావరకు నయం చేయగలిగే ఈ చికిత్సలో కీమో, రేడియో ధెరపీలు ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగ (బోన్‌మ్యారో)ను పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు. పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పవచ్చు. పొద్దున్నే లేవగానే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారడం, ఆందోళన, ఫిట్స్, చూపు/మాట మందగించడంవంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. అది క్యాన్సర్ కణితి అయినా, కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీతో దాన్ని తొలగించడమా లేక ఇతర చికిత్స ప్రక్రియలు అనుసరించడం మంచిదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారు. ఒక్కోసారి మెదడు కణితిని రేడియోసర్జరీతో తొలగిస్తారు. రోగనిరోధక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే లింఫ్నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హాడ్జ్కిన్స్, నాన్‌హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జల్లో లింఫ్‌నాళాలు వాయడం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చెమటలు, దగ్గు, ఊపిరితీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలతో లింఫోమాలు బయటపడుతుంటాయి. ఇతర టిష్యూలను కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌ను సాఫ్ట్టిష్యూ సార్కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ లక్షణాలు... వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండటం వల్ల తొలిదశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్‌టిష్యూలలో వచ్చే క్యాన్సర్స్‌కు ప్రధానంగా సర్జరీ, అవసరాన్ని బట్టి దానికంటే ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలుంటాయి. అండాల్లో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ. రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణుతులు (న్యూరో)బ్లాస్టోమాలు, ఎముకలు, టిష్యూలలో వచ్చే ఈవింగ్ సర్కోమా, కిడ్నీల్లో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగిన ఈ క్యాన్సర్స్ పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం అంతే తేలిగ్గా నయం కాకపోవచ్చు. పిల్లల్లో అరుదుగా కనిపించే మిగతా క్యాన్సర్స్ అదుపులోకి రావడం కొంత కష్టం కావచ్చు లేదా ఎంతగా ప్రయత్నించినా చికిత్సకు లొంగకపోవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యుసంబంధంమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండోబిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలు గుర్తించి సరైన చికిత్స అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, చికిత్స తర్వాత కూడా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. -
లక్షలో 40 మందికి లంగ్ కేన్సర్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు పలువురు పల్మొనాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో కేవలం ఊపిరితిత్తుల కేన్సర్లే 8 శాతం ఉండగా, కేన్సర్ మరణాల్లో లంగ్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ఈ కేన్సర్ నుంచి బయటపడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు ‘లంగ్‌పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఊపిరితిత్తుల కేన్సర్లపై లైవ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ముఖ్యఅతిథిగా హాజరై వర్క్‌షాప్‌ను ప్రారంభించగా, డాక్టర్ చాంగ్ హూ జాంగ్(చైనా), డాక్టర్ మెల్విన్ టే(సింగపూర్), డాక్టర్ టై వాన్ సెక్ (మలేసియా) సహా దేశవిదేశాలకు చెందిన సుమారు 300 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా యశోద ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక ‘లంగ్ పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్)ని ఈ సందర్భంగా ప్రారంభించారు. సోమాజి గూడ యశోద హాస్పిటల్స్ ఇంట్రావేన్షనల్ పల్మొనాలజిస్టులు డాక్టర్ వి.నాగార్జున మాటూరు, డాక్టర్ నవనీత్ సాగర్‌రెడ్డి, డాక్టర్ రఘోత్తమ్‌రెడ్డిలు లంగ్ కేన్సర్ గుర్తింపు, చికిత్సలో మెళకువలను లైవ్‌లో ప్రదర్శించారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే లంగ్ కేన్సర్లు గుర్తించే వారని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ కేన్సర్‌ను గుర్తించే అవకాశం లభించిందన్నారు. శరీరంపై ఎటువంటి కోతలు లేకుండా, రక్తం చుక్క కూడా చిందించాల్సిన అవసరం లేకుండా కనీసం నొప్పి కూడా తెలియకుండా శ్వాస మార్గాల ద్వారా రక్తనాళాలు, శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల చిత్రాలను చూస్తూ పనితీరును తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి స్పష్టం చేశారు. తొలిదశలో వ్యాధి నిర్ధారణ జరిగి సరైన సమయంలో సరైన రీతిలో చికిత్స అందిస్తే ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులు, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్ల నుంచి ఉపశమనం పొంది సాధారణ జీవితం గడపటం పూర్తిగా సాధ్యపడుతుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. -
కేన్సర్ కణాల ఏరివేతకు కొత్త విధానం
ముంబై: రక్తంలో కలిసిపోయి ప్రవహిస్తున్న కేన్సర్ కణాలను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించగల ఒక కొత్త 3డీ విధానాన్ని భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘ఒక కేన్సర్ గడ్డకు వేలకొద్దీ కేన్సర్ కణాలు వదులుగా తగులుకుని ఉంటాయి. ఇవి తరచుగా గడ్డ నుంచి విడిపోయి రక్తంతో కలిసి ప్రవహించి శరీరంలోని ఇతర భాగాలకు చేరి అక్కడ కూడా కేన్సర్‌ను వ్యాపింపజేస్తాయి. కేన్సర్ వల్ల మరణాలు సంభవించడానికి 90 శాతం కారణం ఇదే’అని శాస్త్రవేత్తలు జయంత్ ఖండరే, శాశ్వత్ బెనర్జీ చెప్పారు. వేగంగా విస్తరిస్తున్న రోగాల్లో కేన్సర్ ఒకటనీ, 2013లో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల కొత్త కేన్సర్ కేసులు గుర్తించారని తెలిపారు. అదే ఏడాది కేన్సర్ వల్ల 82 లక్షల మంది మరణించారన్నారు. మహారాష్ట్ర ఫార్మసీ ఇన్స్టిట్యూట్, అక్టోరియస్ ఇన్నొవేషన్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్, పుణెలోని మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మెడికల్ కాలేజ్‌లకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన చేశారు. -
బిర్లా సన్‌లైఫ్ నుంచి క్యాన్సర్షీల్డ్ పాలసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా రంగ సంస్థ బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ (బీఎస్‌ఎల్‌ఐ) తాజాగా క్యాన్సర్షీల్డ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం దేశీయంగా ఏటా పది లక్షల పైగా క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదమవుతున్నాయని, గత కొన్నేళ్లలో చికిత్స వ్యయాలు మూడు, నాలుగు రెట్లు పెరిగిపోయాయని బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ పంకజ్ రజ్దాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ ప్రీమియంతో క్యాన్సర్ తొలి దశ నుంచి తీవ్ర స్థాయి దాకా చికిత్స వ్యయాలకు గరిష్ట కవరేజి లభించేలా క్యాన్సర్షీల్డ్ పాలసీని తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు. ప్రీమియం వెయివర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు బుధవారమిక్కడ క్యాన్సర్షీల్డ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన సందర్భంగా విలేకరులకు తెలిపారు. మరోవైపు, క్యాన్సర్షీల్డ్తో కలిపి ఈ ఏడాది ఇప్పటిదాకా రెండు పాలసీలను ప్రవేశపెట్టామని, బీమా రంగ పరిస్థితులను బట్టి ఈ సంవత్సరం మరో పథకం ప్రవేశపెట్టే అవకాశముందని పంకజ్ రజ్దాన్ తెలిపారు. సంస్థ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉత్పాదకత మరింత పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రైవేట్ రంగ జీవిత బీమా మార్కెట్లో ప్రస్తుతం తమకు సుమారు 7 శాతం వాటా ఉందని, దాదాపు 17 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థూల ప్రీమియం ఆదాయం రూ. 5,580 కోట్లుగా నమోదైనట్లు రజ్దాన్ చెప్పారు.