‘వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్’ పరికరం ప్రారంభోత్సవంలో యశోద ఆస్పత్రి వైద్యులు, పలువురు విదేశీ వైద్య నిపుణులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి లక్ష మందిలో 40 మంది ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్లు పలువురు పల్మొనాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో కేవలం ఊపిరితిత్తుల కేన్సర్లే 8 శాతం ఉండగా, కేన్సర్ మరణాల్లో లంగ్ కేన్సర్ రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ఈ కేన్సర్ నుంచి బయటపడొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు ‘లంగ్‌పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ మేరకు యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ఊపిరితిత్తుల కేన్సర్లపై లైవ్ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్ రావు ముఖ్యఅతిథిగా హాజరై వర్క్‌షాప్‌ను ప్రారంభించగా, డాక్టర్ చాంగ్ హూ జాంగ్(చైనా), డాక్టర్ మెల్విన్ టే(సింగపూర్), డాక్టర్ టై వాన్ సెక్ (మలేసియా) సహా దేశవిదేశాలకు చెందిన సుమారు 300 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా..
తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా యశోద ఆస్పత్రిలో అందుబాటులోకి తెచ్చిన అత్యాధునిక ‘లంగ్ పాయింట్’(వర్చువల్ బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ సిస్టమ్)ని ఈ సందర్భంగా ప్రారంభించారు. సోమాజి గూడ యశోద హాస్పిటల్స్ ఇంట్రావేన్షనల్ పల్మొనాలజిస్టులు డాక్టర్ వి.నాగార్జున మాటూరు, డాక్టర్ నవనీత్ సాగర్‌రెడ్డి, డాక్టర్ రఘోత్తమ్‌రెడ్డిలు లంగ్ కేన్సర్ గుర్తింపు, చికిత్సలో మెళకువలను లైవ్‌లో ప్రదర్శించారు. ఇప్పటివరకు బయాప్సీ ద్వారా మాత్రమే లంగ్ కేన్సర్లు గుర్తించే వారని, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ కేన్సర్‌ను గుర్తించే అవకాశం లభించిందన్నారు.
శరీరంపై ఎటువంటి కోతలు లేకుండా, రక్తం చుక్క కూడా చిందించాల్సిన అవసరం లేకుండా కనీసం నొప్పి కూడా తెలియకుండా శ్వాస మార్గాల ద్వారా రక్తనాళాలు, శ్వాసకోశాలు, ఊపిరితిత్తుల చిత్రాలను చూస్తూ పనితీరును తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి స్పష్టం చేశారు. తొలిదశలో వ్యాధి నిర్ధారణ జరిగి సరైన సమయంలో సరైన రీతిలో చికిత్స అందిస్తే ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులు, టీబీ, ఊపిరితిత్తుల కేన్సర్ల నుంచి ఉపశమనం పొంది సాధారణ జీవితం గడపటం పూర్తిగా సాధ్యపడుతుందని డాక్టర్ నాగార్జున తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment