Importance of Cancer Awareness - Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ ఎవరికి రావొచ్చు.. ఈ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? వ్యాక్సిన్‌తో క్యాన్సర్‌ను నివారించవచ్చా?

Published Sun, Nov 27 2022 6:13 AM | Last Updated on Sun, Nov 27 2022 12:28 PM

Importance of Cancer Awareness - Sakshi

వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్‌ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్‌ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి...

► క్యాన్సర్‌ లక్షణాలు ఎలా ఉంటాయి?
క్యాన్సర్‌ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్‌లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత.

► క్యాన్సర్‌ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా?
శరీరం మొత్తంలో క్యాన్సర్‌ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్‌ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్‌ఎన్‌ఏ టెస్ట్, బ్లడ్‌ మార్కర్స్, ఎక్స్‌–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్‌ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు.

► క్యాన్సర్‌ రాకుండా వ్యాక్సిన్‌ లేదా?
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌)కు కారణం హెచ్‌పీవీ వైరస్‌ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్‌ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు.

► క్యాన్సర్‌ నివారణ మన చేతుల్లో లేదా?
సర్వైకల్‌ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్‌ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు.  

► క్యాన్సర్స్‌ వంశపారంపర్యమా?
ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్‌ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్‌సీఏ–1, బీఆర్‌సీఏ–2 వంటి జీన్‌ మ్యూటేషన్‌ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని
పసిగట్టవచ్చు.

► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని?
ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్‌ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్‌ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్‌ కూడా చాలా ముఖ్యం.  

► క్యాన్సర్‌కు వయోభేదం లేదా?
లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్‌ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే.

► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?
క్యాన్సర్‌ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని  అనుభవజ్ఞులైన డాక్టర్‌ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్‌ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్‌ పద్ధతిలో చేసే కీ–హోల్‌ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు.

సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్‌ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి.

కాబట్టి క్యాన్సర్‌ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్‌ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్‌లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement