cervical cancer
-
క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్: సాధారణంగా క్యాన్సర్ బాధితులకు జీవితమే అంధకారబంధురంగా ఉంటుంది. అందులోనూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వచ్చిందంటే, ఆ తర్వాత ఇక గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. దాంతో వాళ్లు గర్భసంచి తొలగించుకునేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.“ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒకసారి గర్భం వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దాంతో తప్పనిసరిగా ఆమెకు గర్భసంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి, ఇక్కడకు వచ్చారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగిస్తే, తర్వాత ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయొచ్చని, ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చని వివరించాము. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరుశాతం ఉంటుందని, నిరాశ చెందక్కర్లేదని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్లు సమాధానపడి, చికిత్సకు సిద్ధమయ్యారు. ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ శస్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించాము. గర్భసంచికి కూడా కుట్లు వేశాం. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది.క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాము. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే, కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొనసాగించాము. మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్ పరీక్షలు, ఇతర పరీక్షలు చేశాము. 32 వారాల తర్వాత ముందుజాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల సమయంలోనే ప్రసవం కావచ్చని చూశాము గానీ, గర్భసంచి బాగానే ఉండటంతో వేచి చూశాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టింది.పాప పుట్టిన తర్వాత, ఒకసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భసంచి తొలగించాల్సిందిగా ఆ దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పైగా ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదు కాబట్టి అలాగే వదిలేయడం మంచిదని వారికి చెప్పాము. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్టర్ చీపురుపల్లి వసుంధర తెలిపారు. “ఒకానొక దశలో మేము అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి బృందం ఎంతగానో మాకు నచ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్యకరమైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి, డాక్టర్ వసుంధర, ఆమె బృందానికి మేమెంతో కృతజ్ఞులై ఉంటాము” అని మౌనిక భర్త మహేష్ చెప్పారు. -
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్‌పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్‌పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?
మంగళవారం రాజ్యసభలో తొలి ప్రసంగంలో రెండు కీలక అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యరిచారు సుధామూర్తి. ముఖ్యంగా తన ప్రసంగంలో సర్వైకల్ వాక్సినేషన్, టూరిజం గురించి హైలెట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణంగా ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రముఖంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ఇక రాజ్యసభలో మహిళ ఆరోగ్యంపై మాట్లాడటమే గాక దాని పరిష్కారం గురించి కూడా వివరించి దటీజ్ సుధామూర్తి అని చెప్పకనే చెప్పారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమె రాజ్యసభ ఎంపీ హోదాలో కూడా ఆమె ప్రజా సేవకే పెద్ద పీట వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ అంటే ఏంటీ? ఎందుకు వేయించుకోవాలి అంటే..సర్వైకల్ వ్యాక్సినేషన్ని గర్భాశయ కేన్సర్ నిరోధక టీకా అని పిలుస్తారు. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ కేన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుంచి 80 శాతం వరకు తొలగించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. బాలికలు ఈ టీకా తీసుకుంటే కేన్సర్ రాకుండా నివారించొచ్చు. వచ్చాక చికిత్స తీసుకుని నయమయ్యేలా చేయడం కంటే ముందుగానే నివారించడం ఉత్తమం. 26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు. దీన్ని 9 నుంచి 14 ఏళ్ల లోపు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్నే సుధామూర్తి రాజ్యసభ ప్రసంగంలో హైలెట్ చేసి మాట్లాడారు. మన దేశం కరోనా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయగలిగినప్పుడూ ఈ సర్వైకల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా విజయవంతమవుతుందని అన్నారు. కాస్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే ప్రతి కుటుంబ ఒక తల్లిని కోల్పోదని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి చనిపోతే ఆస్పత్రిలో ఒక మరణంగా నమోదవ్వుతుంది. కానీ ఓ కుటుంబం తల్లిని కోల్పోతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేశామని, గత 20 ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది చాలా బాగా పనిచేస్తోందని కూడా చెప్పారు. ఈ వ్యాక్సిన ఖరీదు రూ. 1400. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ వ్యాక్సిన్‌ను కేవలం రూ. 700 నుంచి రూ. 800లకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. పైగా మన దేశంలో జనభా ఎక్కువ కాబట్టి మన ఇంటి ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్ మేలు చేస్తుందని అన్నారు సుధామూర్తి. కాగా, అందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ సుధామూర్తిని ప్రశంసించారు . పైగా తన తొలి ప్రసంగంలో మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు ధన్యావాదాలని కూడా చెప్పారు మోదీ. (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
లండన్‌లో సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం!
ఆడవారిలో కేన్సర్ కేసులు సంఖ్య విపరీతం గా పెరుపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ సెర్వికల్ కేన్సర్ మహిళలకు మరింత ప్రాణాంతకంగా మారింది. ఈ నేపథ్యంలో యూకే రాజధాని లండన్‌లో మహిళల్లో వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు లండన్‌లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ భారత కమ్యూనిటీ(బీబీసీ) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన ఆధ్వరంలో ఆడవారికి వచ్చే కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడవారికి వచ్చే ఈ సెర్వికల్ కేన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వంహిచారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా మహిళలు పాల్గొని ఈ కేన్సర్ రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు కూలంకషంగా తెలుసుకున్నారు. అంతేగాదు ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే గత నెల మార్చిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అప్పుడే ఇలా మహిళ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నట్లు బీబీజీ ఛారిటబుల్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మహిళల ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా దాదాపు £1,655 పౌండ్లను (సుమారు 1.70 లక్షల రూపాయలు) ఒవేరియన్ కేన్సర్ యాక్షన్ (Ovarian Cancer Action)’ అనే ఛారిటీకి అందజేశామని నిర్వాహకులు తెలిపారు. (చదవండి: ఏరియల్ రోప్ వే.. అదో అద్భుత ప్రయాణ అనుభూతి!) -
స్మార్ట్ స్కోప్: సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే.. కనిపెట్టొచ్చు
సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే పసిగట్టే సంస్థ ‘స్మార్ట్ స్కోప్’ అనే డిజిటల్ డివైజ్‌ను రూపొందించింది పుణెలోని పెరివింకిల్ టెక్నాలజీస్... మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని పసిగట్టడంలో ‘స్మార్ట్ స్కోప్’ కీలకపాత్ర పోషిస్తోంది. యూఎస్, యూకేలలో పని చేసిన వీణా మోక్తాలి ఆమె భర్త కౌస్తుభ్ నాయక్‌లు మన దేశానికి వచ్చి పుణె కేంద్రంగా పెరివింకిల్ టెక్నాలజీకి శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘స్మార్ట్ స్కోప్’ డిజిటల్ డివైజ్ సులభంగా ఉపయోగించేలా ఉంటుంది. ‘ప్రస్తుతం ఉన్న సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు సమయం తీసుకుంటాయి. ఈ సౌకర్యాలు పెద్ద నగరాల్లోని సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఎక్కువమంది మహిళలు స్క్రీనింగ్ చేయించుకోలేకపోతున్నారు’ అంటుంది వీణ. ఈ నేపథ్యంలో ‘స్మార్ట్ స్కోప్’ అనేది చిన్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోమ్స్, మున్సిపల్ డిస్పెన్సరీలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, జిల్లా ఆస్పత్రులలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక బ్యాంకు మేనేజర్‌కు గ్రేడ్–2 దశలో క్యాన్సర్‌ని గుర్తించడంలో స్మార్ట్ స్కోప్ ఉపయోగపడింది. మన దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన లక్షమంది ఈ పరికరం సహాయంతో జాగ్రత్త పడ్డారు. ఈ డివైజ్ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం కూడా మరో సానుకూల అంశం. ‘కూలి పనుల వల్ల రోజుల తరబడి ప్రయాణాలు చేసే టైమ్ గ్రామీణ మహిళలకు ఉండడం లేదు. స్మార్ట్ స్కోప్ ద్వారా ఫలితం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం లేదు’ అంటుంది వీణ. అంతర్జాతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తోంది వీణా మొక్తాలి. ఇవి చదవండి: అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. -
ఒక్కరోజు వ్యవధిలో కన్నుమూసిన అక్కాచెల్లెళ్లు
గర్భాశయ క్యాన్సర్ వల్ల నటి పూనమ్ పాండే మరణించిందంటూ ఆమె టీం ఇటీవల ఓ ప్రాంక్ చేసింది. దానివల్ల ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే బతికుండగానే చనిపోయినట్లు నాటకం ఆడింది పూనమ్. తన ఉద్దేశం బాగానే ఉన్నా, అవగాహన కల్పించాల్సిన తీరు బాగోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్ అంత ప్రమాదమా? దాని వల్ల మరణిస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది. క్యాన్సర్‌తో ఒకరు.. ఈ క్రమంలో తాజాగా బుల్లితెర నటి డాలీ సోహి (48) ఇదే క్యాన్సర్ బారినపడి కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో శుక్రవారం(మార్చి 8న) ఉదయం తుదిశ్వాస విడిచింది. మరింత విషాదం ఏంటంటే.. నటి కన్నుమూయడానికి ముందు రోజు ఆమె సోదరి అమందీప్ సోహి కూడా ప్రాణాలు విడిచింది. జాండిస్‌తో సోదరి మృతి పచ్చకామెర్ల వ్యాధి(జాండిస్) తీవ్రం కావడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇద్దరు బిడ్డలు తమను వదిలేసి వెళ్లిపోయారంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా బుల్లితెర ప్రేక్షకులకు డాలీ సుపరిచితురాలే! మేరీ ఆషిఖి తుమ్ సే హి, ఖూబ్ లడీ మర్దానీ.. జాన్సీకి రాణి, పరిణీతి వంటి పలు సీరియల్స్ ద్వారా ఆమె ఆడియన్స్‌కు దగ్గరైంది. చదవండి:'గామి' మూవీ రివ్యూ -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి
బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్ చేశారు. ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన పోస్ట్‌లో ఆమె మరణ వార్త మొదటగా వెల్లడైంది. ఆమె మరణ వార్త గురించి పూనమ్ పాండే పీఆర్ టీమ్ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో, ఈ విషయాన్ని మేము షేర్ చేసేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం.' అని అందులో ఉంది. పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ టీమ్ మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు. పూనమ్ పాండే ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని ఆమె కామెంట్ చేసి వైరల్ అయ్యారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్ తెలుగులో 'మాలిని అండ్ కో'లో నటించింది. సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఢిల్లీలో జన్మించిన పూనమ్. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అక్కడ పాపులారిటీ రావడంతో ఎక్కువగా అర్ధనగ్న ఫోటోలు షేర్ చేస్తూ వివాదాస్పద నటిగా మిగిలింది. ఆమె వైవాహిక జీవితం చుట్టూ కూడా అనేక గొడవలు జరిగాయి. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించడమే కాకుండా అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే పూనమ్ జీవిస్తుంది. (పూనమ్ పాండే అరుదైన చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Poonam Pandey (@poonampandeyreal) -
అది ఏ వయసు వారికి?
సర్విక్స్ క్యాన్సర్ రాకుండా టీకా ఉంది అంటున్నారు కదా.. దాన్ని ఏ వయసువారైనా తీసుకోవచ్చా? – ఎన్. విజయలక్ష్మి, హిందూపూర్ సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలావరకు 65 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకి కూడా రావచ్చు. చాలా అధ్యయనాల తరువాత టీనేజ్లోనే అమ్మాయిలకు వ్యాక్సీన్ ఇస్తే భవిష్యత్‌లో సర్విక్స్ క్యాన్సర్‌ని నివారించవచ్చు అని రుజువు అయింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ 16, 18 ద్వారా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అది రాకుండా చిన్న వయసులోనే వ్యాక్సీన్ ఇస్తున్నారు. 9 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో సూచిస్తారు. 11–12 ఏళ్ల వయసులో కనీసం మొదటి డోస్ వ్యాక్సీన్ ఇస్తే మంచిది. ఈ వ్యాక్సీన్ మూడు డోసుల్లో ఉంటుంది. నెలకి, 6 నెలలకి రెండవ, మూడవ డోసులను ఇస్తారు. ఈ వ్యాక్సీన్‌తో చాలావరకు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వ్యాక్సీన్ తీసుకున్నవారిలో వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది. కొంతమందికి అంటే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మాత్రం 27–45 ఏళ్లకి కూడా ఇస్తున్నారు. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పెళ్లికి ముందే వ్యాక్సీన్ ఇవ్వటం మంచిది. చిన్న వయసులో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువకాలం ఉంటుంది. ఇప్పుడు Gardasil 9 అనే సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తున్నారు. యీస్ట్ అలెర్జీ ఉన్నా.. ఫస్ట్ డోస్ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సీన్‌కి అలెర్జీ వచ్చినా తరువాత డోస్‌లను తీసుకోకూడదు. 25 ఏళ్లు దాటిన వారికి పాప్ స్మియర్ టెస్ట్ చేసి.. సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తారు. నాకిప్పుడు పాతికేళ్లు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ని. రోజుకి పది గంటలు వర్క్ చేస్తాను. కొన్నాళ్లుగా నడుము కింది భాగమంతా నొప్పిగా ఉంటోంది. అది కాళ్ల దాకా లాగుతోంది. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా? మెడికల్ షాప్‌లో అడిగి కొనుక్కోవచ్చా? – పేరు రాయలేదు, హైదరాబాద్ నడుము కింది భాగంలో నొప్పి అంటే నడుము నొప్పి, సోర్నెస్, స్టిఫ్‌గా ఉండి సయాటికా పెయిన్ అంటే నొప్పి వెనుక నుంచి రెండు కాళ్లల్లోకి రావడం. కొంతమందికి తిమ్మిర్లు కూడా వస్తాయి. సయాటికా నర్వ్ అనేది బ్యాక్ నుంచి నడుము, కాళ్లు, పాదాల్లోకి వెళ్తుంది. ఈ నర్వ్ ఒత్తిడికి గురైనా.. ఇరిటేట్ అయినా నొప్పి వస్తుంది. మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే.. ఈ పెయిన్ ఏమైనా బోన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిందా లేక వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అరుదుగా బోన్ క్యాన్సర్ ఏమైనా కావచ్చా అని మొదటగా రూల్ అవుట్ చేస్తారు. చేసి.. ఫిజియోథెరపిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ టీమ్‌కి రిఫర్ చేసి.. ఆ నొప్పికి కారణమేంటో కనిపెడతారు. ఎక్స్‌రే లేదా ఎమ్ఆర్ఐ తీస్తారు. మీ రోజూవారీ పనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ఏ మందులు వాడాలో సూచిస్తారు. కొంతమందిలో మందుల్లేకుండానే కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా లో బ్యాక్ పెయిన్‌ని మేనేజ్ చేయవచ్చు. బెల్టులు, corsets, ఫుట్ సపోర్ట్ షూస్ వంటివేమీ నొప్పిని తగ్గించడంలో సహాయపడవు. అలాగే ఆక్యూపంక్చర్,ట్రాక్షన్, ఎలక్ట్రోథెరపీ లాంటివీ చాలామందికి పనిచేయవు. వీటివల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంటుంది. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి.. మీ వయసు, మీ వృత్తిని బట్టి మీకు ఏ విధమైన చికిత్స సరిపోతుందో ఆ చికిత్సను సూచిస్తారు. NSAIDs(పెయిన్ కిల్లర్స్)ని సాధారణంగా మొదటి దశలో నొప్పి నుంచి ఉపశమనానికి వాడొచ్చు. కానీ వీటివల్ల కడుపులో నొప్పి, అల్సర్లు కావచ్చు. అందుకే యాంటాసిడ్స్ కూడా తీసుకోవాలి. opioids అనేవి చాలా బాగా రిలీఫ్‌నిస్తాయి. అయితే వీటిని తక్కువ మోతాదులో.. చాలా తక్కువ రోజులు మాత్రమే వాడాలి. ఇవేవీ పనిచేయనప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. అంటే ఈ బ్యాక్ పెయిన్‌కి కారణమవుతున్న నర్వ్‌ని బ్లాక్ చేయడం, లోకల్ ఎనస్తీషియా లేదా స్పైన్‌లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాక్ సర్జరీతో నర్వ్ మీద ఒత్తిడి తగ్గించడం లాంటి పరిష్కారాలన్నమాట. స్ట్రెయిన్, స్లిప్డ్ డిస్క్ లాంటివి మందులతో తగ్గుతాయి. మీ జీవనశైలిని కొంత మారిస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గవచ్చు. బరువు పెరగకుండా చూసుకోవడం, యాక్టివ్‌గా ఉండడం, రోజూవారీ ఇంటి పనులను మీరే చేసుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్‌ని తీసుకోవడం, Ibuprofen, పారాసిటమాల్ లాంటి మాత్రలను తక్కువ మోతాదులో వాడటం, ఐస్ ప్యాక్‌తో బ్యాక్ పెయిన్‌కి కాపడం పెట్టుకోవడం, హాట్ ప్యాక్‌తో జాయింట్స్ దగ్గర స్టిఫ్నెస్ను, మజిల్స్ స్పాజమ్ని తగ్గించడం, క్రమం తప్పకుండా బ్యాక్ స్ట్రెచెస్ చెయ్యడం లాంటివాటితో నొప్పిని తగ్గించే వీలుంది. ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ అప్రోచ్‌తో కూడా బ్యాక్ పెయిన్‌ను మేనేజ్ చేయొచ్చు. చాలామందికి ఇది పనిచేస్తుంది. మందులను మాత్రం డాక్టర్లు తక్కువ మోతాదులో.. అదీ అతి తక్కువ రోజులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పి తీవ్రత తగ్గాక.. స్ట్రెచింగ్, మసాజ్‌లు, కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు. మూడు నెలల కంటే తక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు. ఆ నొప్పికి పెయిన్ రిలీఫ్ మందులు పనిచేస్తాయి. మూడు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దీని చికిత్సకు టీమ్ అప్రోచ్ అవసరం. డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్,హైదరాబాద్ -
సీమాసింగ్..: చాంపియన్ ఆఫ్ చేంజ్
‘సేవ అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అని బలంగా నమ్మే సీమా సింగ్ విద్య నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాలలో ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేస్తోంది. సీమ స్ఫూర్తితో ఆమె ఇద్దరు పిల్లలు కూడా సేవా పథంలో పయనిస్తున్నారు. ‘సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా’ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన ‘మేఘా శ్రేయ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సీమాసింగ్ తాజాగా ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ పురస్కారాన్ని స్వీకరించింది... ‘సేవలో ఉండే గొప్పతనం ఏమిటంటే అది మన శక్తిని మనకు పరిచయం చేస్తుంది. నువ్వు ఇంకా చేయగలవు అని ముందుకు నడిపిస్తుంది’ అంటుంది ముంబైకి చెందిన సీమాసింగ్. కష్టాల్లో ఉన్న డ్రైవర్ కుమారుడి చదువుకు సహాయం చేయడం ద్వారా ఆమె సేవాప్రస్థానం మొదలైంది. అది తనకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. సీమ ఆర్థిక సహాయం చేసిన పిల్లాడు సీఏ విజయవంతంగా పూర్తి చేశాడు. గృహిణిగా ఉన్న సీమ సోషల్ ఎంటర్ప్రెన్యూర్ కావడానికి ఈ సందర్భమే పునాది. తన కలలను సాకారం చేసుకోవడానికి ‘మేఘాశ్రేయ్’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ద్వారా పిల్లల చదువు, స్త్రీ సాధికారత నుంచి అన్నదానం వరకు ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది. కోవిడ్ సమయంలో ముంబైవాసుల కోసం వాక్సినేషన్ డ్రైవ్‌ను నిర్వహించింది. పేదల అవసరాలను తీర్చింది. ‘‘లాక్డౌన్ సమయంలో ఒక స్వీపర్‌కు భోజనం, మాస్క్, శానిటైజర్ అందించాను. అవి తీసుకున్న అతడు... ‘థ్యాంక్స్ అమ్మా’ అన్నాడు. ఈ రెండు మాటలు నాకు ఎంతో శక్తిని ఇచ్చాయి. వెంటనే శానిటైజేషన్ కిట్స్‌కు ఆర్డరు ఇచ్చాను. ఒక కిచెన్ సర్వీస్ ద్వారా వాటిని పేదలకు పంపిణీ చేశాను. బయటికి వెళ్లడం వల్ల నాకు ఏమైనా అవుతుందేమో అని మావారు భయపడేవారు. అయితే జాగ్రత్తల విషయంలో నేను ఎప్పుడూ రాజీపడలేదు. రెండు రోజుల తరువాత నా పిల్లలు అమ్మా నీతో పాటు మేమూ వస్తాం అన్నారు. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సీమ. కోవిడ్ సమయంలో సీమ మామయ్యకు ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే సీనియర్ సిటిజెన్ల ప్రస్తావన తీసుకువచ్చింది ఆమె కూతురు మేఘన. తల్లీకూతుళ్లు వృద్ధాశ్రమాలకు వెళ్లి అవసరమైన మందులు ఇవ్వడమే కాదు... వారికి ధైర్యం కూడా చెప్పేవారు. çపట్టణం– పల్లె తేడా లేకుండా ‘సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా’ క్యాంపెయిన్‌ను ఎన్నోచోట్లకు తీసుకువెళ్లి అవగాహన సదస్సులు, ఉచిత స్క్రీనింగ్‌లు నిర్వహించింది సీమ. తన ఇద్దరు పిల్లలు డా.మేఘన, శ్రేయ్ శ్రీ పేర్లను కలుపుతూ స్వచ్ఛందసంస్థకు ‘మేఘాశ్రేయ్’ అని నామకరణం చేసింది సీమ. ఇప్పుడు వారు కూడా సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె కుమారుడు శ్రేయ్ తన 14వ పుట్టిన రోజు సందర్భంగా ఆడంబరాల జోలికి పోకుండా పుట్టినరోజు వేడుకకు అయ్యే ఖర్చుతో 150 మంది పేదవాళ్లకు అవసరమయ్యే వస్తువులను కొనిచ్చాడు. ఇక మేఘనకు తన పుట్టిన రోజును అనాథాశ్రమాలలో జరుపుకోవడం అలవాటు. ‘సమాజంపై సానుకూల మార్పు’ అనే అంశానికి సంబంధించి సీమాసింగ్ లోతైన ఆలోచనలు చేస్తుంటుంది. అయితే అవి మనసుకు మాత్రమే పరిమితమయ్యే ఆలోచనలు కావు. ఆచరణకు ప్రేరేపించే అద్భుత ఆలోచనలు. ఒక మహిళా కానిస్టేబుల్... ‘అమ్మా మీతో ఫొటో దిగుతాను’ అని సీమాసింగ్‌ను అభ్యర్థించింది. ‘నేను సినిమా స్టార్‌ని కాదు కదా!’ అని చిన్నగా నవ్వింది సీమ. ‘మంచి పనులు చేసే ప్రతి ఒక్కరూ స్టారే. మీ గురించి మా అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను’ అన్నది ఆ కానిస్టేబుల్. మంచి పనులు చేసే వాళ్లను ప్రజలు ఎంతగా అభిమానిస్తారో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. -
HPV వ్యాక్సిన్ అంటే ఏంటి ..? ఇది బాలికలకి వేయవచ్చా?
-
సర్వైకల్ క్యాన్సర్ అవగాహనలో గిన్నిస్ రికార్డు.. విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా
గుంటూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్, విజ్ఞాన్ యూనివర్సిటీ, కలెక్టివ్ పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూఎస్ఏ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అతిపెద్ద సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వారానికి సంబంధించింది) కార్యక్రమాన్ని నిర్వహించాయి. తానా ఫౌండేషన్ తరఫున ట్రస్టీ విద్యాధర్ గారపటి ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ అవగాహన కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించడం విశేషం. గతంలో 1919 మందితో సర్వైకల్ అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఇప్పుడు 4000 మంది పాల్గొనడంతో పాత గిన్నిస్ రికార్డు చెరిగిపోయింది. మార్చి 18న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వేదిక కావడం తెలుగువారికి గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోతోంది. 2030 నాటికి మరణాల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ కారణంగా మరణించేవారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళనకర విషయం. చదవండి: అకాల వర్షాలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు -
వ్యాధి ముదిరిపోయిన తర్వాత లక్షణాలు, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే!
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్‌ను పూర్వకాలంలో రాచపుండుగా పిలిచేవారు. ఈ వ్యాధి ధనికులకే వస్తుందని అప్పట్లో దానికి ఆ పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ వ్యాధికి పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరికీ సోకుతోంది. చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లే తెలియదు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత దాని తాలూకు లక్షణాలు ప్రారంభమై అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి నెలను గర్భాశయ ముఖద్వార అవగాహన మాసంగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంవత్సరం ‘కొన్ని తరాలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంతం’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెరిగిన వైద్యులు రెండు దశాబ్దాల క్రితం రాయలసీమ కంతటికీ కర్నూలులో ఒక్కరే క్యాన్సర్ వైద్యులుండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పాతికమందికి క్యాన్సర్ డాక్టర్లున్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 60 నుంచి 80 మంది కొత్తగా క్యాన్సర్ బాధితులు వస్తున్నారు. అలాగే ప్రతిరోజూ 10 నుంచి 15 మందికి కీమోథెరపి, 25 మందికి రేడియోథెరపి చేస్తున్నారు. నిత్యం 80 నుంచి 120 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్(సెరి్వకల్ క్యాన్సర్) బాధితులున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 40 వేల వరకు ఉంటుందని వైద్యుల అంచనా. ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు విశ్వభారతి, ఒమెగా, శాంతిరామ్ హాస్పిటల్లలో క్యాన్సర్ వ్యాధులకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. అలాగే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కణతులు తొలగించేందుకు నిర్వహించే శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా చేస్తున్నారు. ఈ పథకం లేనప్పుడు రోగులకు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. అన్ని ఆసుపత్రుల్లో క్యాన్సర్‌కు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకుని డిశ్చార్జ్ అయిన రోగులకు ఆసరా పథకం కింద రోజుకు రూ.225, నెలకు రూ.5వేలు తక్కువ కాకుండా ప్రభుత్వం అందజేస్తోంది. సెర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే.. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సుగల స్త్రీలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు ఇవీ.. ► సాధారణ రుతుక్రమం గాకుండా యోని నుంచి రక్తస్రావం ► లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం ► పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్) ► యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం ► మూత్రం, మలవిసర్జనలో ఆటంకాలు ఇలా చేస్తే నివారణ సాధ్యం 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రపంచ కార్యాచరణ ప్రణాళికను అందించింది. దీనికింద 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 సంవత్సరాల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సుగల కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు దేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా 1,24,000 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బాధితులు నమోదవుతున్నారు. వారిలో సగం మంది ఒక సంవత్సరంలోపు మరణిస్తున్నారు. ఈ క్యాన్సర్ వల్ల ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ మరణిస్తోంది. దీనికి నివారణగా 30 ఏళ్ల వయస్సు నుంచి లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలందరూ 5 నుంచి 10 ఏళ్లకు ఒకసారి హెచ్‌పీవీ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 26 సంవత్సరాల వయస్సుగల బాలికలందరికీ హెచ్‌పీవీ టీకాలు వేయాలని సూచించాలి. ఈ వ్యాధిని నయం చేయడం కంటే నివారణ ఉత్తమం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. –డాక్టర్ శిల్పారెడ్డి, గైనకాలజిస్టు, కర్నూలు ల్యాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్స నయం కాని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ల్యాప్రోస్కోపి పరికరం ద్వారా ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేయవచ్చు. దీనివల్ల కోత, కుట్టు ఉండదు. త్వరగా ఎవరి పనులు వారు చేసుకోవచ్చు. హెరి్నయా వచ్చే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వైరస్ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది. దీనివల్ల వివాహం అయిన మహిళలు ప్రతి సంవత్సరం పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే, క్యాన్సర్‌ను ప్రాథమికంగా గుర్తించగలిగితే నయం చేసుకోవచ్చు. దీనికితోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయడం వల్ల వారికి 70 నుంచి 80శాతం వరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. –డాక్టర్ సి. వాసురెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్టు, కర్నూలు -
కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ (ఐనైఫ్) గర్భాశయ కేన్సర్‌ను సెకండ్లలో పసిగట్టేస్తోంది. కేన్సర్ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. -
క్యాన్సర్‌ను నివారించేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఎవరికి మేలు..
వైద్య విజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవితకాలాన్ని పొడిగించుకోగలిగిన మనిషి క్యాన్సర్‌కు ఆన్సర్ మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. క్యాన్సర్ అనగానే ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతుంటాయి. క్యాన్సర్‌పై అవగాహన కోసం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలివి... ► క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ లక్షణాలు ఆ వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి... తీవ్రమైన అలసట. జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఆకలి తగ్గడం, వాంతులు, విరేచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత. ► క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోవచ్చా? శరీరం మొత్తంలో క్యాన్సర్ కణం ఎక్కడైనా ఉందా అని ముందే తెలుసుకోడానికి నిర్దిష్టమైన పరీక్ష అయితే లేదు. ఎందుకంటే ఏ అవయవానికి క్యాన్సర్ వచ్చిందని అనుమానిస్తే... దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్ఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై, పెట్ స్కాన్ ఇలా.. అవసరాన్ని బట్టి రకరకాల పరీక్షలు చేస్తుంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రం పాప్‌స్మియర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు. ► క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ లేదా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. తొమ్మిదేళ్ల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందుగా) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. హెపటైటిస్–బి వ్యాక్సిన్ ద్వారా 50% – 60% కాలేయ క్యాన్సర్లను నివారించవచ్చు. ► క్యాన్సర్ నివారణ మన చేతుల్లో లేదా? సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కూ ఖచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్టే. అయితే పుష్కలంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికీ, రసాయనాలకూ దూరంగా ఉండటం, పొగతాగడం–ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, తరచూ ఇన్ఫెక్షన్స్ గురికాకుండా చూసుకోవడం ద్వారా వీలైనంతవరకు క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ► క్యాన్సర్స్ వంశపారంపర్యమా? ఖచ్చితంగా చెప్పలేం గానీ... రక్తసంబంధీకుల్లో రొమ్ముక్యాన్సర్ ఉన్నప్పుడు... మిగతా వారితో పోలిస్తే... వీళ్లకువచ్చే ముప్పు ఎక్కువ. బీఆర్సీఏ–1, బీఆర్సీఏ–2 వంటి జీన్ మ్యూటేషన్ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. ► క్యాన్సర్‌ను కొంతమంది జయిస్తే మరికొందరు కొద్దిరోజుల్లోనే మరణిస్తారు. ఎందుకని? ప్రతి మనిషి ప్రవర్తనలో తేడా ఉన్నట్లే, క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. క్యాన్సర్‌ను జయించడం అన్న విషయం దాన్ని ఏ దశలో కనుక్కున్నాం, ఆ క్యాన్సర్ గడ్డకు త్వరగా పాకే గుణం ఉందా లేక సోకిన ప్రాంతానికే పరిమితమయ్యిందా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, చికిత్సప్రక్రియలూ ఆ విషయాల మీదే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడంలో త్వరగా గుర్తించడంతో పాటు ఆ గడ్డ తాలూకు స్టేజ్, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. ► క్యాన్సర్‌కు వయోభేదం లేదా? లేదు. ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. అదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలావరకు పూర్తిగా నయం చేయగలిగేవే. ► క్యాన్సర్‌ను అదుపులో మాత్రమే ఉంచగలమా? నయం చేయలేమా? చికిత్స సమయంలోనూ, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? క్యాన్సర్ చికిత్సతో వచ్చే దుష్ప్రభావాలను (సైడ్‌ఎఫెక్ట్స్‌ను) పరిశోధకులు కొంతవరకు తగ్గించగలిగారు గానీ ఇప్పటికీ అవి ఎంతోకొంత ఉన్నాయి. వైద్యుల సలహాలు పాటించడం, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండే వైద్యకేంద్రంలోని అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్లడం, మనోధైర్యంతో యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉండటం మంచిది. పథ్యాలు ఏవీ పాటించనక్కర్లేదు. మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్ కణాలమీదే పనిచేసే కీమోథెరపీ, రేడియోథెరపీలతో పాటు ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేసే కీ–హోల్ సర్జరీలు కూడా నేడు క్యాన్సర్‌కు చేయగలుగుతున్నారు. సర్జరీ చేశాక రేడియోథెరపీ, కీమో, హార్మోన్ థెరపీ వంటివి ఇచ్చినా లేదా థెరపీ తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో ముగిసిందని అనుకోడానికి లేదు. క్రమం తప్పకుండా చెకప్స్‌కు వెళ్లడం, పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. మొదటి ఐదేళ్లలో వ్యాధి తిరగబెట్టకపోతే అది మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమందిలో పది, ఇరవై ఏళ్ల తర్వాత వ్యాధి వచ్చిన భాగంలో కాకుండా మరో అవయవంలో వచ్చిన సందర్భాలున్నాయి. కాబట్టి క్యాన్సర్ అదుపులో ఉందంటారుగానీ పూర్తిగా నయమైంది అని చెప్పలేరు. ఒక రొమ్ములో క్యాన్సర్ వచ్చిన వారిలో మరో రొమ్ములోనూ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల క్యాన్సర్లు శరీరంలోని ఒక అవయవం నుంచి ఇంకో అవయవానికి విస్తరించి, మిగతా భాగాలకు వ్యాపించి, ఇతర అవయవాలకూ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని నిర్ధారణ చేసే పరీక్షలను చికిత్స ముగిశాక కూడా చేయించుకుంటూ ఉండాలి. -
స్త్రీ జాతికి శుభవార్త!
అవును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ అన్నట్టు ఇది స్త్రీ జాతికి శుభవార్త. తక్కువ వెలతో, అందరికీ అందుబాటులో ఉండే దేశీయ టీకా గనక భారత మహిళా లోకానికి మరీ మంచివార్త. గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్‌పై విజయానికి మనమిప్పుడు మరింత చేరువయ్యాం. దేశంలోనే తొలి ‘క్వాడ్రివలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్’ (క్యూహెచ్‌పీవీ)కి భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ మంగళవారం ఆమోదం తెలిపారు. పుణేకు చెందిన ప్రసిద్ధ ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ దేశీయంగా వృద్ధిచేస్తున్న ఈ ‘సర్వావ్యాక్’ టీకా ఈ నవంబర్ కల్లా అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి తరచూ వచ్చే క్యాన్సర్లలో నాలుగోదీ, 15 నుంచి 44 ఏళ్ళ మధ్య భారతీయ మహిళలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో రెండోదీ అయిన సర్వికల్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం ఇప్పుడిక మన చేతుల్లోనే ఉంది. మన దేశంలో ఏటా 1.23 లక్షల పైచిలుకు మంది ఆడవారు ఈ మాయదారి రోగం బారిన పడుతుంటే, సగం మందికి పైగా (67 వేల మంది) ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, యుక్తవయసుకు రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ హెచ్‌పీవీ టీకానిస్తే గర్భాశయ క్యాన్సర్‌ను సమూలంగా దూరం చేయవచ్చని సౌమ్య లాంటి శాస్త్రవేత్తల మాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) అనేది లైంగికంగా వ్యాపించే కొన్ని వైరస్ల సమూహం. ఎక్కువ రిస్కుండే హెచ్‌పీవీల వల్ల క్యాన్సర్ వస్తుంది. నూటికి 95 సర్వికల్ క్యాన్సర్లు ఈ హెచ్‌పీవీ పుణ్యమే. సాధారణంగా గర్భాశయద్వార క్యాన్సర్ బయటపడేందుకు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ, వ్యాధినిరోధకత బాగా తక్కువగా ఉన్న స్త్రీలలో అయిదు నుంచి పదేళ్ళలోనే ఇది రావచ్చు. హెచ్ఐవీ లేని వారి కన్నా ఉన్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. అయితే, క్రమం తప్పకుండా తరచూ పరీక్ష చేయించుకొంటే, ముందుగానే రోగ నిర్ధారణ, చికిత్స జరిగి బయటపడవచ్చు. తొమ్మిది నుంచి 14 ఏళ్ళ లోపు ఆడపిల్లలు టీకా వేయించుకుంటే, ఈ వ్యాధి రాదని డబ్ల్యూహెచ్ఓ లెక్క. మన దేశంలో అభివృద్ధి చేస్తున్న కొత్త టీకా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మరో 4 టీకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆ టీకాలకు మన దేశంలో ఒక్కో వ్యక్తికీ కనీసం రూ. 5 వేల నుంచి 8 వేల దాకా ఖర్చవుతుంది. కానీ, మన దేశవాళీ కొత్త టీకా అంతకన్నా చాలా తక్కువకే దొరకనుంది. నిజానికి, పుణేలోని సీరమ్ సంస్థ చేస్తున్న ఈ టీకా ప్రయోగాలు 2019 నుంచి నాలుగేళ్ళుగా జరుగుతున్నాయి. 12 ప్రాంతాల్లో 9 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసులోని 2 వేల మందికి పైగా వ్యక్తులపై ఈ టీకాను ప్రయోగించి చూశారు. మూడు విడతలుగా ఈ ప్రయోగాలు సాగాయి. వైరస్ నిరోధకతకు అవసరమైన ప్రాథమికస్థాయి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ టీకా ప్రభావశీలమని ప్రయోగాల్లో తేలింది. టీకా వేసుకున్నవారిలో నూటికి నూరు మందిలో అద్భుత వ్యాధినిరోధకత అభివృద్ధి చెందినట్లూ, అంతా సురక్షితంగా ఉన్నట్లూ ఫలితాలు రావడం విశేషం. ప్రపంచంలో ప్రతి లక్ష మంది మహిళలనూ ప్రమాణంగా తీసుకుంటే, 18 ఏళ్ళ వయసుకే భయపెడుతున్న ప్రాణాంతక రోగమిది. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు గత 15 ఏళ్ళుగా రకరకాల సర్వికల్ క్యాన్సర్ టీకాలు వాడుతున్నాయి. ఇక, మన దేశంలో ఎప్పుడు లెక్కతీసినా కనీసం 4 లక్షల మందికి పైగా మహిళలు ఈ రోగపీడితులే. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ అయిదేళ్ళకోసారి ఈ గర్భాశయద్వార క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకం. వసతుల లేమి, అవగాహన లోపంతో ఆచరణలో అది జరగడమే లేదు. అందుకే, ఇప్పుడు దేశీయంగా టీకా అభివృద్ధి ఓ పెనుమార్పు తేనుంది. 15 ఏళ్ళ లోపు ఆడపిల్లల్లో నూటికి 90 మందికి 2030 నాటికల్లా హెచ్‌పీవీ టీకాలతో రక్షణ కల్పించాలని డబ్ల్యూహెచ్ఓ లక్షిస్తున్న వేళ ఈ చొరవ సమయానికి అంది వచ్చింది. నిజానికి, ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రోగులను రక్షించేంత ప్రాథమిక వసతులు నేటికీ మన దేశంలో లేవు. దేశంలో సగటున ప్రతి 10 వేల మంది క్యాన్సర్ రోగులకూ కేవలం ముగ్గురు రేడియేషన్ ఆంకాలజిస్టులే ఉన్నారన్నది కఠోర వాస్తవం. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ప్రధానం గనక, ఈ కొత్త టీకా ఉపయోగకరం. సర్వికల్ క్యాన్సర్ టీకాలను కూడా దేశ సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని 2018లోనే టీకాకరణపై జాతీయ సాంకేతిక సలహా బృందం సూచించింది. కానీ, మెర్క్, గ్లాక్సో లాంటి బహుళ జాతి ఔషధ సంస్థల అంతర్జాతీయ టీకాలు ఖరీదైనవి కావడంతో ఆ పని జరగలేదు. అంతర్జాతీయ టీకాల ఆధిపత్యానికి గండికొడుతూ ఇప్పుడు దేశవాళీ చౌక రకం టీకా వచ్చింది గనక, ఆ బృహత్కార్యానికి వీలు చిక్కింది. ప్రతి 8 నిమిషాలకూ ఓ మహిళను సర్వికల్ క్యాన్సర్ బలితీసుకుంటున్న మన దేశంలో మహిళా ఆరోగ్య సంరక్షణలో ఈ కొత్త టీకా ఓ చరిత్రాత్మక పరిణామం. ప్రభుత్వం బరిలోకి దిగితే కనీసం 5 కోట్ల మంది బడి వయసు పిల్లలకు ఇది తక్షణం ఉపయుక్తం. దీని గురించి యువతుల్లో, తల్లితండ్రుల్లో చైతన్యం తేవాలి. కౌమారంలోనే ఈ టీకాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి. సర్వికల్ క్యాన్సర్‌పై విజయం సాధించాలి. ఇప్పటికే, కరోనా వేళ టీకాల అభివృద్ధి, తయారీల్లో సాధించిన పురోగతితో మన దేశాన్ని ‘టీకాల రాజధాని’ అంటున్నారు. ‘సర్వావ్యాక్స్’ లాంటి కొత్త టీకాలు ఆ పేరును నిలబెడతాయి. మరిన్ని కొత్త టీకాల పరిశోధన, అభివృద్ధికి వసతులు కల్పించి, మన శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం పాలకుల కర్తవ్యం. -
మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన
క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోకపోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా, ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలం. డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన కాల పరిమితుల్లో పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్: స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. లక్షణాలు: ►పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు ►యోని అసాధారణ స్రావాలు, మూత్రం ఎక్కువగా రావటం ∙అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్స్: గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియల్, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు టెమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్స్: యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్స్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్స్‌కు గురైతే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టం. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఖచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకెన్ స్లీ్కరోసస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకెన్ స్లీ్కరోసస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్స్‌కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ►పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం ∙అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. ►గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యం అవుతుంది. -
మహిళల క్యాన్సర్లలో ముఖ్యమైనది.. సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోండి!
మహిళల క్యాన్సర్లలో ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్. సర్విక్స్ అనే భాగం యోనిని, గర్భసంచితో కలుపుతుంది. మహిళ జీవితంలోని అనేక దశల్లో ఇది ఎన్నెన్నో మార్పులకు లోనవుతుంటుంది. అందుకే అక్కడ వేగంగా జరిగే కణవిభజన వల్ల క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. సర్వైకల్ క్యాన్సర్లలో అడెనోకార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అని రెండు ప్రధాన రకాలున్నాయి. ఈ రెండింటికి అవలంబించాల్సిన చికిత్స విధానాలు వేర్వేరు. సెర్విక్స్‌లో వచ్చే అడెనోకార్సినోమాలో పీరియడ్స్ మధ్యలో లేదా దాంపత్యంలో పాల్గొన్న వెంటనే రక్తస్రావం, దుర్వాసనతో కూడిన తెలుపు, నడుము కింది భాగంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ‘అడెనోకార్సినోమా’ సర్విక్స్ క్యాన్సర్ విషయంలో... అది ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, శస్త్రచికిత్స ద్వారా ఆ భాగాన్ని తొలగించడమే మంచి మార్గం. ఇది అరుదుగా వచ్చేదే అయినప్పటికీ చిన్న వయసులోనే వచ్చే క్యాన్సర్ ఇది. ఇందులో రెండో రకం ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ తరహాకు చెందింది. ఇందులోనూ పీరియడ్స్ మధ్యకాలంలో లేదా దాంపత్యం తర్వాత రక్తస్రావంతో పాటు యోని నుంచి దుర్వాసనతో కూడిన నీళ్లలాంటి రక్తస్రావం అవుతుంటుంది. కాస్త ముదిరినప్పటికీ చికిత్సకు మంచి ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. చదవండి: Health Tips: కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి.. సర్వైకల్ క్యాన్సర్ ‘హ్యూమన్ పాపిలోమా వైరస్’ కారణంగా వస్తుంది. దీనికి వ్యాక్సిన్ ఉంది. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. బాలికలు 12–20 ఏళ్ల మధ్యలో దాన్ని తీసుకోవడం మంచిది. అంటే వివాహానికి ముందుగా... మరీ ముఖ్యంగా చెప్పాలంటే దాంపత్యజీవితం మొదలుపెట్టక ముందు తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చు. చదవండి: అకస్మాత్తుగా వాంతి ,ఫిట్స్ రావడం జరుగుతుందా.. ఆలస్యం చేయకండి -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారుచేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్లను తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. -
గర్భసంచి సమస్యలకు రోబోటిక్ ప్రక్రియ మేలు
క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. బాగా లావుగా ఉంటాను. ఇటీవల మెనోపాజ్ వచ్చింది. రుతుస్రావం ఆగిపోయి దాదాపు ఐదేళ్లు అవుతోంది. కానీ గత మూడు నెలల నుంచి అప్పుడప్పుడు విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది. ఆ సమయంలో నొప్పిలు నన్ను విపరీతంగా బాధిస్తున్నాయి. చాలా మంది వైద్యులను సంప్రదించాను. ఒక డాక్టర్ కొన్ని టెస్ట్‌లు నిర్వహించి గర్భసంచి తీసివేస్తే గానీ సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. దీంతో మా కుటుంబ సభ్యులంతా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు. - ఒక సోదరి, నిర్మల్ మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. మహిళల్లో ఈ సమస్య ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా లేదా సురక్షితం కాని లైంగిక సంబంధాలతో పాటు జన్యుపరమైన కారణా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో టీబీకి గురైనవారిలో కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి మీరు వెంటనే నిపుణులైన సర్జికల్ ఆంకాలజిస్ట్‌లు అందుబాటులో ఉండే పెద్ద ఆసుపత్రికి వెళ్లి సంప్రదించండి. వారు మీకు ముందుగా అల్ట్రా సౌండ్ లాంటి ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో మీరు గర్భాశయ క్యాన్సర్‌కు లోనైనట్లు తెలిసినా ఎలాంటి భయాందోళలకు గురికావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికిత్సకు సంబంధించి అత్యంత అధునాతనమైన విధానాలు, నిపుణులైన వైద్యులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. క్యాన్సర్ ఏ గ్రేడింగ్‌లో ఉందో తెలుసుకోడానికి అలాగే ఆ క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు ఏమైనా పాకిందా కనుగొనడానికి సీటీ స్కాన్, ఎమ్మారై లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలూ చేస్తారు. ఒకవేళ మొదటి లేదా రెండో దశలో ఉంటే మీకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా మీ గర్భసంచిని తొలగించడం జరుగుతుంది. అయినప్పటికీ మీరు చింతించాల్సిన పనేమీ లేదు. దాన్ని తొలగించిన తర్వాత మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తవు. అలాకాకుండా మూడు లేదా నాలుగో స్టేజ్‌లో ఉంటే గర్భసంచి తొలగించడంతో పాటు క్యాన్సర్ కణాలను పూర్తిగా నిర్మూలించడానికి రేడియో థెరపీ, కీమోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఇప్పుడు అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ విధానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధానంలో 3డి కెమెరా సహాయంతో శరీరంలోని కీలకమైన అవయవాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం ప్రభావితమైన కణజాలాన్ని సమూలంగా తుడిచిపెట్టేయవచ్చు. - డాక్టర్ జగదీశ్వర్‌గౌడ్ గజగౌని సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్ సెన్సైస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కేన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందా?
మానవాళిని పీడిస్తున్న కేన్సర్ మహమ్మారిపై విజయం దిశగా ఓ అడుగు పడింది. బ్రిటన్‌కు చెందిన ఓ యువతికి వైద్యులు ఓ సరికొత్త వ్యాక్సిన్ ఇచ్చారు. దాంతో.. ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, శరీరంలో ఎక్కడ ట్యూమర్లు పెరిగినా వాటిని నాశనం చేసే శక్తి వస్తుందని చెబుతున్నారు. కెల్లీ పోటర్ (35) అనే మహిళకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉన్నట్లు 2015 జూలైలో గుర్తించారు. అప్పటికే వ్యాధి కూడా ముదిరింది. ఆమెకు తొలిసారిగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో 30 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించబోతున్నారు. సాధారణంగా శరీరంలో కణాలు కొంతకాలం తర్వాత చనిపోతుంటాయి, వాటి బదులు కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ కేన్సర్ కణాలకు మాత్రం అసలు చావు అన్నది లేకపోగా, మరింతగా వృద్ధిచెందుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కణాలపై పనిచేసేలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించేలా ఈ కొత్త వ్యాక్సిన్‌ను వైద్య పరిశోధకులు రూపొందించారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలోనే పేషెంట్లకు కెమెథెరపీ కూడా తక్కువ డోస్‌లో ఇస్తారు. ఈ కెమోథెరపీ రోగనిరధక శక్తికి ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. సాధారణంగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి బయటి నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటుంది తప్ప, సొంత శరీరంలోనే పెరిగే కేన్సర్ కణాలను ఏమీ చేయదు. సరిగ్గా ఆ లక్షణాన్నే ఈ కెమోథెరపీ మందు వదిలిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెల్లీకి కేన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాధి వ్యాపించింది. లండన్‌లోని గయ్స్ ఆస్పత్రిలో కొంతమేర చికిత్స చేసినా, అప్పటికే కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపించిందని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ తనకు ఇస్తాననగానే ఎంతో సంతోషించానని ఆమె చెప్పారు. ఆమెకు ఫిబ్రవరి 9వ తేదీన వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించొచ్చని వైద్యులు చెప్పినా, అలాంటివేవీ ఇంతవరకు లేవు. ఈ వ్యాక్సిన్ సాయంతో తాను కేన్సర్‌ను జయిస్తే.. ఇతరులకు కూడా ఇది స్ఫూర్తిమంతంగా ఉంటుందని కెల్లీ పోటర్ తెలిపారు. తాము ప్రధానంగా శరీరంలోని రోగ నిరోధక శక్తి మీద పనిచేసేలా వ్యాక్సిన్‌ను రూపొందించామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హర్దేవ్ పాండా తెలిపారు. -
గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు... జాగ్రత్తలు!
మహిళల ఆరోగ్యం గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను... ప్రధానంగా నెలసరి రక్తస్రావంలో వచ్చే తేడాల ద్వారా గుర్తించవచ్చు. రుతుక్రమ సమయంలో రక్తస్రావం మరీ ఎక్కువగా ఉండడం, నెల మధ్యలో స్పాటింగ్ వంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి గర్భకోశ నిపుణులను సంప్రదించాలి. తెల్లని లేదా పసుపు రంగు ద్రవాలు సాధారణ స్థాయికన్నా ఎక్కువగా స్రవిస్తుంటే కూడా అప్రమత్తం కావాల్సిందే. పొత్తి కడుపు నొప్పి మరో లక్షణం. కలయిక సమయంలో నొప్పి, మూత్రాశయం నొప్పిగా అనిపించడం, మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి కూడా సర్వికల్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి. ఇది వ్యాధి ముదిరిన దశ. క్యాన్సర్ సర్విక్స్ నుంచి మూత్రాశయానికి పాకినప్పుడు ఈ లక్షణం కనిపిస్తుంది. ఇదే లక్షణం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లోనూ ఉంటుంది. కాబట్టి సమస్య మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చనే కోణంలో కూడా నిర్ధారించుకుని చికిత్స చేయించుకోవాలి. పరీక్షలు: పాప్‌స్మియర్ టెస్ట్ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా కనుక్కోగలిగిన పరీక్ష. ఇందులో అంతా సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించు కోవాలి. భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని ఇది తెలియచేస్తుంది. ఏదైనా తేడా ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించాలి. -
సెర్వికల్ కేన్సర్‌నుగుర్తించే పరికరం విడుదల
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐసీఎంఆర్ న్యూఢిల్లీ: మొట్టమొదటిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరికరాన్ని భారత్ సోమవారం విడుదల చేసింది. దేశంలో ఏటా సుమారు 74 వేల మంది మహిళలు సెర్వికల్ కేన్సర్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో మహిళలకు వరప్రసాదంలా ఉపయోగపడే ఈ పరికరాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దీనిని విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ, మహిళల్లో సెర్వికల్ కేన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని, తద్వారా పలువురి ప్రాణాలు నిలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నోయిడాలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైటాలజీ అండ్ ప్రివెంటివ్ ఆంకాలజీ (ఐసీపీవో) రూపొందించిన ఈ పరికరం ఖరీదు రూ.10 వేలు మాత్రమే. ప్రస్తుతం సెర్వికల్ కేన్సర్‌ను గుర్తించే పరీక్షల కోసం దాదాపు రూ.8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ ఖర్చుతో పోలిస్తే ఇది నామమాత్రమేనని ఆజాద్ అన్నారు. ఈ పరికరం రూపకల్పన లో కృషిచేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. 8 నెల ల్లో మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.