మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన | Cervical Cancer Elimination What Is This Cancer | Sakshi
Sakshi News home page

మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన

Published Sun, Jul 10 2022 10:12 AM | Last Updated on Sun, Jul 10 2022 10:12 AM

Cervical Cancer Elimination What Is This Cancer - Sakshi

క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (సర్వైకల్‌ క్యాన్సర్‌) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్‌.పి.వి. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోకపోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్‌.పి.వి. వైరస్‌ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు.

అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా, ఈ క్యాన్సర్‌ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్‌ వేయించుకుంటే సర్విక్స్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడుకోగలం. డాక్టర్‌ సలహా మేరకు వారు సూచించిన కాల పరిమితుల్లో పాప్‌స్మియర్స్‌ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్‌ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. 

అండాశయాల (ఒవేరియన్‌) క్యాన్సర్‌:
స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్‌ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో  ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్‌ కిల్లర్‌గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్‌ క్యాన్సర్‌ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువ.

లక్షణాలు:
►పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు
►యోని అసాధారణ స్రావాలు, మూత్రం ఎక్కువగా రావటం ∙అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్‌ స్కానింగ్‌లతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయవచ్చు. 

యుటెరైన్‌ లేదా ఎండోమెట్రియల్‌ లేదా గర్భాశయ క్యాన్సర్స్‌:
గర్భసంచిలో ఉండే లైనింగ్‌ ఎండోమెట్రియల్‌, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్‌ లెవల్స్‌ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్‌ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్‌ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్‌ ఎక్కువగా కన్పిస్తోంది.

అందుకనే మెనోపాజ్‌ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌కు టెమాక్సిఫెన్‌ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్‌ తీసుకున్నవారు, హార్మోన్‌ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్‌ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. 

వెజైనల్‌ అండ్‌ వల్వా క్యాన్సర్స్‌:
యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్స్‌ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్స్‌కు గురైతే ట్రీట్‌మెంట్‌ ఇవ్వటం మరింత కష్టం. మెనోపాజ్‌ వయస్సులో థైరాయిడ్‌ హార్మోన్‌ సమస్య ఉన్నవారిలో, హెచ్‌.పి.వి. వైరల్, హెపటైటిస్‌ సి వైరల్‌ ఇన్ఫెక్షన్‌  లేదా ఖచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌ అయిన ‘‘లైకెన్‌  స్లీ్కరోసస్‌’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి.

ఆ మచ్చలు ‘వల్వార్‌ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్‌ వచ్చే రిస్క్‌ చాలా ఎక్కువ. ‘లైకెన్‌ స్లీ్కరోసస్‌’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్‌ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్‌ క్యాన్సర్స్‌కు చెక్‌ పెట్టాలంటే స్త్రీలు పాప్‌స్మియర్‌ పరీక్షలు చేయించుకుంటూ ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. 

►పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం ∙అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. 

►గైనకాలజికల్‌ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement