సీమాసింగ్‌..: చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌ | MeghaShrey NGO Lauded for its Cervical Cancer Free India Campaign, Seema Singh crowned as Champion of Change and Philanthropist of the Year | Sakshi
Sakshi News home page

సీమాసింగ్‌..: చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌

Published Tue, Aug 1 2023 12:52 AM | Last Updated on Tue, Aug 1 2023 12:52 AM

MeghaShrey NGO Lauded for its Cervical Cancer Free India Campaign, Seema Singh crowned as Champion of Change and Philanthropist of the Year - Sakshi

‘సేవ అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అని బలంగా నమ్మే సీమా సింగ్‌ విద్య నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాలలో ఎన్నోరకాల సేవాకార్యక్రమాలు చేస్తోంది. సీమ స్ఫూర్తితో ఆమె ఇద్దరు పిల్లలు కూడా సేవా పథంలో పయనిస్తున్నారు. ‘సర్వైకల్‌ క్యాన్సర్‌ ఫ్రీ ఇండియా’ ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన ‘మేఘా శ్రేయ్‌’   స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సీమాసింగ్‌ తాజాగా ‘చాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌’ పురస్కారాన్ని స్వీకరించింది...

‘సేవలో ఉండే గొప్పతనం ఏమిటంటే అది మన శక్తిని మనకు పరిచయం చేస్తుంది. నువ్వు ఇంకా చేయగలవు అని ముందుకు నడిపిస్తుంది’ అంటుంది ముంబైకి చెందిన సీమాసింగ్‌.
కష్టాల్లో ఉన్న డ్రైవర్‌ కుమారుడి చదువుకు సహాయం చేయడం ద్వారా ఆమె సేవాప్రస్థానం మొదలైంది. అది తనకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. సీమ ఆర్థిక సహాయం చేసిన పిల్లాడు సీఏ విజయవంతంగా పూర్తి చేశాడు.

గృహిణిగా ఉన్న సీమ సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కావడానికి ఈ సందర్భమే పునాది. తన కలలను సాకారం చేసుకోవడానికి ‘మేఘాశ్రేయ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ద్వారా పిల్లల చదువు, స్త్రీ సాధికారత నుంచి అన్నదానం వరకు ఎన్నో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుపెట్టింది.
కోవిడ్‌ సమయంలో ముంబైవాసుల కోసం వాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించింది. పేదల అవసరాలను తీర్చింది.

‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఒక స్వీపర్‌కు భోజనం, మాస్క్, శానిటైజర్‌ అందించాను. అవి తీసుకున్న అతడు... ‘థ్యాంక్స్‌ అమ్మా’ అన్నాడు. ఈ రెండు మాటలు నాకు ఎంతో శక్తిని ఇచ్చాయి. వెంటనే శానిటైజేషన్‌ కిట్స్‌కు ఆర్డరు ఇచ్చాను. ఒక కిచెన్‌ సర్వీస్‌ ద్వారా వాటిని పేదలకు పంపిణీ చేశాను. బయటికి వెళ్లడం వల్ల నాకు ఏమైనా అవుతుందేమో అని మావారు భయపడేవారు. అయితే జాగ్రత్తల విషయంలో నేను ఎప్పుడూ రాజీపడలేదు. రెండు రోజుల తరువాత నా పిల్లలు అమ్మా నీతో పాటు మేమూ వస్తాం అన్నారు. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది’’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సీమ.

కోవిడ్‌ సమయంలో సీమ మామయ్యకు ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలోనే సీనియర్‌ సిటిజెన్‌ల ప్రస్తావన తీసుకువచ్చింది ఆమె కూతురు మేఘన. తల్లీకూతుళ్లు వృద్ధాశ్రమాలకు వెళ్లి అవసరమైన మందులు ఇవ్వడమే కాదు... వారికి ధైర్యం కూడా చెప్పేవారు.
çపట్టణం– పల్లె తేడా లేకుండా ‘సర్వైకల్‌ క్యాన్సర్‌ ఫ్రీ ఇండియా’ క్యాంపెయిన్‌ను ఎన్నోచోట్లకు తీసుకువెళ్లి అవగాహన సదస్సులు, ఉచిత స్క్రీనింగ్‌లు నిర్వహించింది సీమ.

తన ఇద్దరు పిల్లలు డా.మేఘన, శ్రేయ్‌ శ్రీ పేర్లను కలుపుతూ స్వచ్ఛందసంస్థకు ‘మేఘాశ్రేయ్‌’ అని నామకరణం చేసింది సీమ. ఇప్పుడు వారు కూడా సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె కుమారుడు శ్రేయ్‌ తన 14వ పుట్టిన రోజు సందర్భంగా ఆడంబరాల జోలికి పోకుండా పుట్టినరోజు వేడుకకు అయ్యే ఖర్చుతో 150 మంది పేదవాళ్లకు అవసరమయ్యే వస్తువులను కొనిచ్చాడు.

ఇక మేఘనకు తన పుట్టిన రోజును అనాథాశ్రమాలలో జరుపుకోవడం అలవాటు.  ‘సమాజంపై సానుకూల మార్పు’ అనే అంశానికి సంబంధించి సీమాసింగ్‌ లోతైన ఆలోచనలు చేస్తుంటుంది. అయితే అవి మనసుకు మాత్రమే పరిమితమయ్యే ఆలోచనలు కావు. ఆచరణకు ప్రేరేపించే అద్భుత ఆలోచనలు.  ఒక మహిళా కానిస్టేబుల్‌... ‘అమ్మా మీతో ఫొటో దిగుతాను’ అని సీమాసింగ్‌ను అభ్యర్థించింది. ‘నేను సినిమా స్టార్‌ని కాదు కదా!’ అని చిన్నగా నవ్వింది సీమ.

‘మంచి పనులు చేసే ప్రతి ఒక్కరూ స్టారే. మీ గురించి మా అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను’ అన్నది ఆ కానిస్టేబుల్‌. మంచి పనులు చేసే వాళ్లను ప్రజలు ఎంతగా అభిమానిస్తారో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement