రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్‌ ఎందుకు? మంచిదేనా? | Sudha Murthys 1st Rajya Sabha Speech Calls Cervical Cancer Vaccine Programme | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్‌ ఎందుకు? మంచిదేనా?

Published Wed, Jul 3 2024 4:01 PM | Last Updated on Wed, Jul 3 2024 5:39 PM

 Sudha Murthys 1st Rajya Sabha Speech Calls Cervical Cancer Vaccine Programme

మంగళవారం రాజ్యసభలో తొలి ప్రసంగంలో రెండు కీలక అంశాలపై మాట్లాడి అందర్నీ ఆశ్చర్యరిచారు సుధామూర్తి. ముఖ్యంగా తన ప్రసంగంలో సర్వైకల్‌ వాక్సినేషన్‌, టూరిజం గురించి హైలెట్‌ చేశారు. ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి భార్య సుధామూర్తిని రాష్ట్రపతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణంగా ప్రసంగంలో మహిళల సాధికారత గురించి ప్రముఖంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. 

ఇక రాజ్యసభలో మహిళ ఆరోగ్యంపై మాట్లాడటమే గాక దాని పరిష్కారం గురించి కూడా వివరించి దటీజ్‌ సుధామూర్తి అని చెప్పకనే చెప్పారు. సోషల్‌ సర్వీస్‌లో ముందుండే ఆమె రాజ్యసభ ఎంపీ హోదాలో కూడా ఆమె ప్రజా సేవకే పెద్ద పీట వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆమె ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్‌ అంటే ఏంటీ? ఎందుకు వేయించుకోవాలి అంటే..

సర్వైకల్‌ వ్యాక్సినేషన్‌ని గర్భాశయ కేన్సర్‌ నిరోధక టీకా అని పిలుస్తారు. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్, దాని వ్యాక్సిన్ గురించి ప్రజలకు అవగాహన లేదు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఏ వ్యాక్సిన్‌ వేయాలో, ఎప్పుడు వేయాలో చాలా మంది మహిళలకు తెలియదు. టీకా గురించి సమాచారం లేకపోవడం వల్ల భారతదేశంలో గర్భాశయ కేన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

అయితే టీకాతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 70 నుంచి 80 శాతం వరకు తొలగించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తేనే ప్రయోజనం ఉంటుంది. బాలికలు ఈ టీకా తీసుకుంటే కేన్సర్‌ రాకుండా నివారించొచ్చు. వచ్చాక చికిత్స తీసుకుని నయమయ్యేలా చేయడం కంటే ముందుగానే నివారించడం ఉత్తమం. 26 ఏళ్ల తర్వాత ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు.  దీన్ని 9 నుంచి 14 ఏళ్ల లోపు తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్ల ఈ విషయాన్నే సుధామూర్తి రాజ్యసభ ప్రసంగంలో హైలెట్‌ చేసి మాట్లాడారు. మన దేశం కరోనా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ని పెద్ద ఎత్తున చేపట్టి విజయవంతం చేయగలిగినప్పుడూ ఈ సర్వైకల్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా విజయవంతమవుతుందని అన్నారు. 

కాస్త ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే ప్రతి కుటుంబ ఒక తల్లిని కోల్పోదని సుధామూర్తి అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి ప్రస్తావిస్తూ..ఓ తల్లి చనిపోతే ఆస్పత్రిలో ఒక మరణంగా నమోదవ్వుతుంది. కానీ ఓ కుటుంబం తల్లిని కోల్పోతుందంటూ భావోద్వేగంగా మాట్లాడారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో సర్వైకల్ వ్యాక్సినేషన్‌ను అభివృద్ధి చేశామని, గత 20 ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది చాలా బాగా పనిచేస్తోందని కూడా చెప్పారు. 

ఈ వ్యాక్సిన ఖరీదు రూ. 1400. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఆ వ్యాక్సిన్‌ను కేవలం రూ. 700 నుంచి రూ. 800లకు అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. పైగా మన దేశంలో జనభా ఎక్కువ కాబట్టి మన ఇంటి ఆడబిడ్డలకు ఈ వ్యాక్సిన్‌ మేలు చేస్తుందని అన్నారు సుధామూర్తి. కాగా, అందుకుగానూ ప్రధాని నరేంద్రమోదీ సుధామూర్తిని ప్రశంసించారు . పైగా తన తొలి ప్రసంగంలో మహిళల ఆరోగ్యం గురించి మాట్లాడినందుకు ధన్యావాదాలని కూడా చెప్పారు మోదీ. 

(చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్‌'!..ఏకంగా రోబోటిక్‌ పాములతో..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement