క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ | A woman From West Godavari Who Beat Cervical Cancer And Gave Birth To Baby | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ

Published Sun, Jul 28 2024 3:18 PM | Last Updated on Sun, Jul 28 2024 3:35 PM

A woman From West Godavari Who Beat Cervical Cancer And Gave Birth To Baby

గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ బాధితురాలికి గ‌ర్భం.. శిశు జ‌న‌నం

గ‌ర్భ‌సంచి తొల‌గింపు కోసం వ‌చ్చిన మహిళ

కౌన్సెలింగ్ చేసిన కిమ్స్ కడల్స్ వైద్యురాలు డాక్ట‌ర్ వ‌సుంధ‌ర‌

ముందుగానే పిండాల‌ను ఫ్రీజ్ చేసి, త‌ర్వాత శ‌స్త్రచికిత్స‌

క్యాన్స‌ర్ చికిత్స అనంత‌రం మ‌హిళ‌కు గ‌ర్భం

37 వారాల త‌ర్వాత పూర్తి ఆరోగ్యంతో పుట్టిన పాప‌

హైద‌రాబాద్: సాధార‌ణంగా క్యాన్స‌ర్ బాధితుల‌కు జీవిత‌మే అంధ‌కార‌బంధురంగా ఉంటుంది. అందులోనూ గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార (స‌ర్వైక‌ల్) క్యాన్స‌ర్ వ‌చ్చిందంటే, ఆ త‌ర్వాత ఇక గ‌ర్భం దాల్చ‌డం, పిల్ల‌లు పుట్ట‌డం అనే ఆశ‌లే వదిలేసుకోవాల్సి వ‌స్తుంది. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు  గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. దాంతో వాళ్లు గ‌ర్భ‌సంచి  తొల‌గించుకునేందుకు హైద‌రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. ఇక్క‌డ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గైన‌కాల‌జిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ వ‌సుంధ‌ర చీపురుప‌ల్లి ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశారు.

“ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒక‌సారి గ‌ర్భం వ‌చ్చింది. కానీ కొన్నాళ్ల త‌ర్వాత లోప‌లున్న శిశువుకు ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో స్థానికంగా త‌ప్ప‌నిస‌రై గ‌ర్భ‌స్రావం చేయించాల్సి వ‌చ్చింది. కొన్నాళ్ల త‌ర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేద‌ని ప‌రీక్ష చేయించుకోగా, గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. దాంతో త‌ప్ప‌నిస‌రిగా ఆమెకు గ‌ర్భ‌సంచి తొల‌గించాల‌ని అక్క‌డి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్ప‌త్రిలో ఆ శ‌స్త్రచికిత్స చేయించుకోవాల‌ని భావించి, ఇక్క‌డ‌కు వ‌చ్చారు. 

క్యాన్స‌ర్ ఉన్నంత మాత్రాన గ‌ర్భ‌సంచి తొల‌గిస్తే, త‌ర్వాత ఇక జీవితాంతం పిల్ల‌లు పుట్టే అవ‌కాశం ఉండ‌దు. గ‌ర్భ‌సంచి తొల‌గించ‌కుండానే క్యాన్స‌ర్ చికిత్స చేయొచ్చ‌ని, ఆ త‌ర్వాత పిల్ల‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించాము. క్యాన్స‌ర్ ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల పిల్ల‌లు పుట్టే అవ‌కాశం నూరుశాతం ఉంటుంద‌ని, నిరాశ చెంద‌క్క‌ర్లేద‌ని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన త‌ర్వాత అప్పుడు వాళ్లు స‌మాధాన‌ప‌డి, చికిత్స‌కు సిద్ధ‌మ‌య్యారు. ముందుగానే పిండాల‌ను (ఎంబ్రియో) సేక‌రించి, వాటిని ఫ్రీజ్ చేసిన త‌ర్వాత అప్పుడు క్యాన్స‌ర్ శ‌స్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్స‌ర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్ర‌త్త‌గా గుర్తించి, దాన్ని మాత్ర‌మే తొల‌గించాము. గ‌ర్భ‌సంచికి కూడా కుట్లు వేశాం. తొల‌గించిన ప్రాంతానికి బ‌యాప్సీ చేయించ‌గా క్యాన్స‌ర్ అక్క‌డ మాత్ర‌మే ఉంద‌ని, ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించ‌లేద‌ని నిర్ధార‌ణ అయ్యింది.

క్యాన్స‌ర్ చికిత్స పూర్త‌యిన‌ త‌ర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాల‌ను గ‌ర్భ‌సంచిలో ప్ర‌వేశ‌పెట్టాము. రెండూ ఫ‌ల‌దీక‌ర‌ణం చెందాయి. అయితే, కుట్లు వేయ‌డం వ‌ల్ల గ‌ర్భ‌సంచి రెండు పిండాల‌ను మోసే ప‌రిస్థితి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని ముందుజాగ్ర‌త్త‌గా ఒక పిండాన్ని తీసేయాల్సి వ‌చ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొన‌సాగించాము. మ‌ధ్య‌లో కూడా ఎందుకైనా మంచిద‌ని క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు, ఇత‌ర ప‌రీక్ష‌లు చేశాము. 32 వారాల త‌ర్వాత ముందుజాగ్ర‌త్త‌గా లోప‌ల శిశువుకు ఊపిరితిత్తులు బ‌లంగా ఉండేందుకు ఇంజెక్ష‌న్లు చేశాము. 34, 35 వారాల స‌మ‌యంలోనే ప్ర‌స‌వం కావ‌చ్చ‌ని చూశాము గానీ, గ‌ర్భ‌సంచి బాగానే ఉండ‌టంతో వేచి చూశాము. స‌రిగ్గా 37 వారాల త‌ర్వాత అంతా బాగుండ‌టంతో ఆమెకు సిజేరియ‌న్ శ‌స్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్య‌వంత‌మైన పాప పుట్టింది.

పాప పుట్టిన త‌ర్వాత‌, ఒక‌సారి క్యాన్స‌ర్ వ‌చ్చింది కాబ‌ట్టి త‌ర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని గర్భ‌సంచి తొల‌గించాల్సిందిగా ఆ దంప‌తులు కోరారు. కానీ, సిజేరియ‌న్ చేసిన స‌మ‌యంలోనే హిస్ట‌రెక్ట‌మీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబ‌ట్టి, పైగా ఇప్పుడు క్యాన్స‌ర్ స‌మ‌స్య లేదు కాబ‌ట్టి అలాగే వ‌దిలేయ‌డం మంచిద‌ని వారికి చెప్పాము. ఇప్పుడు త‌ల్లీబిడ్డ‌లు ఇద్ద‌రూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్ట‌ర్ చీపురుప‌ల్లి వ‌సుంధ‌ర తెలిపారు. 

“ఒకానొక ద‌శ‌లో మేము అస‌లు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌నుకున్నాం. కానీ డాక్ట‌ర్ వ‌సుంధ‌ర‌ చీపురుప‌ల్లి, కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రి బృందం ఎంత‌గానో మాకు న‌చ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్య‌క‌ర‌మైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రికి, డాక్ట‌ర్ వ‌సుంధ‌ర‌, ఆమె బృందానికి మేమెంతో కృత‌జ్ఞులై ఉంటాము” అని మౌనిక భ‌ర్త మ‌హేష్ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement