సర్విక్స్ క్యాన్సర్ రాకుండా టీకా ఉంది అంటున్నారు కదా.. దాన్ని ఏ వయసువారైనా తీసుకోవచ్చా?
– ఎన్. విజయలక్ష్మి, హిందూపూర్
సర్విక్స్ క్యాన్సర్ అనేది చాలావరకు 65 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా కనపడుతుంది. కానీ కొన్నిసార్లు చిన్న వయసులోనే అంటే 25 ఏళ్లకి కూడా రావచ్చు. చాలా అధ్యయనాల తరువాత టీనేజ్‌లోనే అమ్మాయిలకు వ్యాక్సీన్ ఇస్తే భవిష్యత్‌లో సర్విక్స్ క్యాన్సర్‌ని నివారించవచ్చు అని రుజువు అయింది. హ్యూమన్ పాపిలోమా వైరస్ టైప్స్ 16, 18 ద్వారా సర్విక్స్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అది రాకుండా చిన్న వయసులోనే వ్యాక్సీన్ ఇస్తున్నారు.
9 ఏళ్ల నుంచి ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు. పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తే ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో సూచిస్తారు. 11–12 ఏళ్ల వయసులో కనీసం మొదటి డోస్ వ్యాక్సీన్ ఇస్తే మంచిది. ఈ వ్యాక్సీన్ మూడు డోసుల్లో ఉంటుంది. నెలకి, 6 నెలలకి రెండవ, మూడవ డోసులను ఇస్తారు. ఈ వ్యాక్సీన్‌తో చాలావరకు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల లోపు వ్యాక్సీన్ తీసుకున్నవారిలో వ్యాక్సీన్ బాగా పనిచేస్తుంది.
కొంతమందికి అంటే క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మాత్రం 27–45 ఏళ్లకి కూడా ఇస్తున్నారు. కానీ ఇది డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎక్కువగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పెళ్లికి ముందే వ్యాక్సీన్ ఇవ్వటం మంచిది. చిన్న వయసులో ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువకాలం ఉంటుంది. ఇప్పుడు Gardasil 9 అనే సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తున్నారు. యీస్ట్ అలెర్జీ ఉన్నా.. ఫస్ట్ డోస్ హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సీన్‌కి అలెర్జీ వచ్చినా తరువాత డోస్‌లను తీసుకోకూడదు. 25 ఏళ్లు దాటిన వారికి పాప్ స్మియర్ టెస్ట్ చేసి.. సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సీన్‌ను ఇస్తారు.
నాకిప్పుడు పాతికేళ్లు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. రోజుకి పది గంటలు వర్క్ చేస్తాను. కొన్నాళ్లుగా నడుము కింది భాగమంతా నొప్పిగా ఉంటోంది. అది కాళ్ల దాకా లాగుతోంది. ఈ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడొచ్చా? మెడికల్ షాప్‌లో అడిగి కొనుక్కోవచ్చా? – పేరు రాయలేదు, హైదరాబాద్
నడుము కింది భాగంలో నొప్పి అంటే నడుము నొప్పి, సోర్‌నెస్, స్టిఫ్‌గా ఉండి సయాటికా పెయిన్ అంటే నొప్పి వెనుక నుంచి రెండు కాళ్లల్లోకి రావడం. కొంతమందికి తిమ్మిర్లు కూడా వస్తాయి. సయాటికా నర్వ్ అనేది బ్యాక్ నుంచి నడుము, కాళ్లు, పాదాల్లోకి వెళ్తుంది. ఈ నర్వ్ ఒత్తిడికి గురైనా.. ఇరిటేట్ అయినా నొప్పి వస్తుంది. మీరు ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే.. ఈ పెయిన్ ఏమైనా బోన్ ఇన్‌ఫెక్షన్‌కి సంబంధించిందా లేక వెంట్రుక మందం ఫ్రాక్చర్ ఏమైనా ఉందా లేదా అరుదుగా బోన్ క్యాన్సర్ ఏమైనా కావచ్చా అని మొదటగా రూల్ అవుట్ చేస్తారు.
చేసి.. ఫిజియోథెరపిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ టీమ్‌కి రిఫర్ చేసి.. ఆ నొప్పికి కారణమేంటో కనిపెడతారు. ఎక్స్‌రే లేదా ఎమ్‌ఆర్‌ఐ తీస్తారు. మీ రోజూవారీ పనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే ఏ మందులు వాడాలో సూచిస్తారు. కొంతమందిలో మందుల్లేకుండానే కొన్ని స్పెషల్ ఎక్సర్‌సైజెస్, ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా లో బ్యాక్ పెయిన్‌ని మేనేజ్ చేయవచ్చు.
బెల్టులు, corsets, ఫుట్ సపోర్ట్ షూస్ వంటివేమీ నొప్పిని తగ్గించడంలో సహాయపడవు. అలాగే ఆక్యూపంక్చర్,ట్రాక్షన్, ఎలక్ట్రోథెరపీ లాంటివీ చాలామందికి పనిచేయవు. వీటివల్ల కొన్నిసార్లు ఇబ్బంది ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంటుంది. డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి.. మీ వయసు, మీ వృత్తిని బట్టి మీకు ఏ విధమైన చికిత్స సరిపోతుందో ఆ చికిత్సను సూచిస్తారు.
NSAIDs(పెయిన్ కిల్లర్స్)ని సాధారణంగా మొదటి దశలో నొప్పి నుంచి ఉపశమనానికి వాడొచ్చు. కానీ వీటివల్ల కడుపులో నొప్పి, అల్సర్లు కావచ్చు. అందుకే యాంటాసిడ్స్ కూడా తీసుకోవాలి. opioids అనేవి చాలా బాగా రిలీఫ్‌నిస్తాయి. అయితే వీటిని తక్కువ మోతాదులో.. చాలా తక్కువ రోజులు మాత్రమే వాడాలి. ఇవేవీ పనిచేయనప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు.
అంటే ఈ బ్యాక్ పెయిన్‌కి కారణమవుతున్న నర్వ్‌ని బ్లాక్ చేయడం, లోకల్ ఎనస్తీషియా లేదా స్పైన్‌లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, బ్యాక్ సర్జరీతో నర్వ్ మీద ఒత్తిడి తగ్గించడం లాంటి పరిష్కారాలన్నమాట. స్ట్రెయిన్, స్లిప్డ్ డిస్క్ లాంటివి మందులతో తగ్గుతాయి. మీ జీవనశైలిని కొంత మారిస్తే కూడా బ్యాక్ పెయిన్ తగ్గవచ్చు.
బరువు పెరగకుండా చూసుకోవడం, యాక్టివ్‌గా ఉండడం, రోజూవారీ ఇంటి పనులను మీరే చేసుకోవడం, కాల్షియం సప్లిమెంట్స్‌ని తీసుకోవడం, Ibuprofen, పారాసిటమాల్ లాంటి మాత్రలను తక్కువ మోతాదులో వాడటం, ఐస్ ప్యాక్‌తో బ్యాక్ పెయిన్‌కి కాపడం పెట్టుకోవడం, హాట్ ప్యాక్‌తో జాయింట్స్ దగ్గర స్టిఫ్‌నెస్‌ను, మజిల్స్ స్పాజమ్‌ని తగ్గించడం, క్రమం తప్పకుండా బ్యాక్ స్ట్రెచెస్ చెయ్యడం లాంటివాటితో నొప్పిని తగ్గించే వీలుంది.
ఎక్కువ సమయం బెడ్ రెస్ట్ తీసుకోకూడదు. సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ అప్రోచ్‌తో కూడా బ్యాక్ పెయిన్‌ను మేనేజ్ చేయొచ్చు. చాలామందికి ఇది పనిచేస్తుంది. మందులను మాత్రం డాక్టర్లు తక్కువ మోతాదులో.. అదీ అతి తక్కువ రోజులకు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. నొప్పి తీవ్రత తగ్గాక.. స్ట్రెచింగ్, మసాజ్‌లు, కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తారు.
మూడు నెలల కంటే తక్కువ రోజులు బ్యాక్ పెయిన్ ఉంటే దాన్ని అక్యూట్ పెయిన్ అంటారు. ఆ నొప్పికి పెయిన్ రిలీఫ్ మందులు పనిచేస్తాయి. మూడు నెలల కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటారు. దీని చికిత్సకు టీమ్ అప్రోచ్ అవసరం.
డా.భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment