నేను దుబాయ్‌లో ఉంటాను. ఇప్పుడు నాకు మూడో నెల. ఇక్కడంతా ప్రాసెస్డ్ అండ్ క్యాన్డ్ ఫుడ్ ఎక్కువగా వాడతారు. హెల్దీ బేబీ కోసం నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో సజెస్ట్ చేయగలరు. – చరిత రెడ్డి.
తాజా పళ్లు, ఆకు కూరలు, కూరగాయలు అన్నీ తినొచ్చు. పాశ్చరైజ్డ్ సాఫ్ట్ చీజ్ అంటే కాటేజ్ చీజ్ (పనీర్), మోజారెల్లా క్రీమ్ చీజ్ వంటివి తీసుకోవచ్చు. పాశ్చరైజ్డ్ మిల్క్, యోగర్ట్, క్రీమ్, ఐస్‌క్రీమ్ తినొచ్చు. అన్‌పాశ్చరైజ్డ్ చీజ్, మిల్క్, బ్లూ చీజ్, పాశ్చరైజ్ చేయని గేదె పాలు, మేక పాలు తీసుకోకూడదు. ఎందుకంటే పాశ్చరైజ్ చేయనివాటిలో Listeria బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీలో listeriosis అనే ఇన్‌ఫెక్షన్‌ని కలగజేసి గర్భస్రావానికి కారణమవుతుంది.
కడుపులోని బిడ్డ ఆరోగ్యం మీదా ప్రభావం చూపిస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్‌ని బాగా ఉడికించి తినాలి. ప్రెగ్నెన్సీలో ఇంట్లో వండిన ఆహారాన్నే తీసుకుంటే మంచిది. రా, అన్‌కుక్డ్ మీట్, లివర్ ప్రొడక్ట్స్‌ని అసలు తీసుకోకూడదు. అన్‌కుక్డ్ మీట్ వల్ల Toxoplasmosis అనే ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది తల్లి నుంచి బిడ్డకు చేరుతుంది. గర్భస్రావానికి ఈ ఇన్‌ఫెక్షనూ ఒక కారణమవుతుంది.
లివర్‌లో అధిక మోతాదులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది గర్భస్థ శిశువుకు హాని చేస్తుంది. కోడిగుడ్లను బాగా ఉడికించి తినొచ్చు. హాఫ్ బాయిల్డ్, హాఫ్ కుక్డ్ ఎగ్స్‌ని అసలు తినకూడదు. ఇలా సగం ఉడికిన ఆహారం వల్ల సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఫిష్ విషయానికి వస్తే సీ ఫిష్, షెల్ ఫిష్, రొయ్యలను కూడా పూర్తిగా వండినవే తినాలి. అదీ వేడివేడి ఆహారపదార్థాలనే తీసుకోవాలి.
నాకు తరచు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తోంది. రోజూవారీ జాగ్రత్తలేమైనా చెప్పగలరా? – సరిత పవార్, భైంసా
యూరినరీ ఇన్‌ఫెక్షన్ అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవటం. ప్రతి ఒక్కరూ వాళ్ల బరువుని బట్టి రోజూ లిక్విడ్స్ తీసుకోవాలి. ఒక కేజీకి ఇరవై ఐదు ఎమ్.ఎల్ అని సూచిస్తాం. అంటే యాభై కేజీల బరువున్నవారు 1.2 లీటర్లు తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు తక్కువ నీరు తీసుకుంటారో యూరినరీ బ్లాడర్‌లో ఇరిటేషన్ స్టార్ట్ అయి, ఎక్కువ సార్లు యూరిన్ వస్తుంది.
దీంతోపాటు తొందరగా వెళ్లాలనీ అనిపిస్తుంది. అప్పుడు యూరిన్ ముదురు పసుపు రంగు, గాఢమైన వాసనతో ఉంటుంది. హెల్దీ బ్లాడర్ కోసం రోజూ 1.5 లీటర్ల నుంచి 2 లీటర్ల నీరు తాగాలి. చల్లటి పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్‌లలో స్పార్కి‍్లంగ్ వాటర్‌తో కార్బన్‌డైయాక్సైడ్ కలసి యూరిన్‌ని అసిడిక్‌గా మారుస్తుంది. ఇది యూరినరీ ఇన్ఫెక్షన్‌కు కారణంగా చెప్పచ్చు. అందుకే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగకూడదు. కెఫీన్ బ్లాడర్‌ని ఉత్తేజపరస్తుంది. టీ, గ్రీన్ టీ, కాఫీ, హాట్ చాక్లెట్, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఉంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్‌లలో కూడా ఉంటుంది.
ఇవి ఎక్కువగా తీసుకుంటే బ్లాడర్‌లో యూరిన్ పెరిగి ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ద్రాక్ష , నిమ్మ, పైనాపిల్, ఆరెంజ్ పండ్ల రసాలు అసిడిక్‌గా ఉంటాయి. ఇవి కూడా బ్లాడర్‌ని ఇరిటేట్ చేస్తాయి. ఈ పండ్ల రసాలను ఒక గ్లాసు కంటే ఎక్కువ తాగకూడదు. హెర్బల్ టీ, బార్లీ వాటర్ మంచివి. ఇవి ఎంత తాగినా అసిడిక్ గా ఉండవు కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్స్ తక్కువ.
అయితే, యూరిన్‌లో రక్తం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి. కొన్ని బ్లడ్ ఇన్‌ఫెక్షన్ పరీక్షలు చేయించుకోవాలి. చాలామందికి చాలాసార్లు యూరిన్‌కి వెళ్తే ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారనే అనుమానం ఉంటుంది. రోజుకు 8 నుంచి 10 సార్ల కన్నా ఎక్కువసార్లు యూరిన్‌కి వెళ్లాల్సివస్తే.. దానిని ఫ్రీక్వెంట్ యూరిన్ అంటారు. సాధారణంగా రోజుకు 4 నుంచి 7 సార్లు కామన్.
ఈ సంఖ్య పెరిగినప్పుడు డాక్టర్‌ని కలవటం మంచిది. మలబద్ధకం, యూరిన్ ఇన్‌ఫెక్షన్స్‌కు ఎక్కువగా టీ, కాఫీ, చల్లటి పానీయాలు కారణం. ఇందుకు రెగ్యులర్‌గా ‘బ్లాడర్ ట్రైనింగ్’ను సూచిస్తాం. అంటే బ్లాడర్ మజిల్ శక్తిని పెంచటం. అప్పుడు బ్లాడర్ ఎక్కువ కెపాసిటీ యూరిన్‌ను హోల్డ్ చేస్తుంది. యూరిన్‌కి వెళ్లే ముందు ఐదు నిమిషాల పాటు హోల్డ్ చేయటానికి ప్రయత్నించండి. దీంతో యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది.
ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ ఈ స్థితితో బ్లాడర్‌ని ట్రైన్ చేయొచ్చు. అయినా మూత్ర పరీక్షలో యూరిన్ ఇన్‌ఫెక్షన్స్ నిర్ధారణైతే, ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. యూరిన్ ఫ్లో టెస్ట్, కొన్ని యూరిన్ డయాగ్నసిస్ స్టడీస్ పరీక్షల ద్వారా యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్‌ను తెలుసుకోవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment