అంజలి, కార్తీక్‌లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్‌కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు.
రవి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్‌లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు.
అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం.
1. భావోద్వేగ సాన్నిహిత్యం
బంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్‌గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది.
2. శారీరక సాన్నిహిత్యం
Physical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం.
3. మేధో సాన్నిహిత్యం
ఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్‌ల మధ్య సమస్య ఇదే.
4. అనుభవైక సాన్నిహిత్యం
ఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.
5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం
కొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి.
6. ఆర్థిక సాన్నిహిత్యం
డబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment