Intimacy
-
మనిషి మనిషికో ఇంటిమసీ అవసరం
అంజలి, కార్తీక్‌లకు పెళ్లయి మూడేళ్లవుతోంది. అంజలికి ప్రయాణాలంటే ఇష్టం. అడ్వంచర్ ట్రిప్స్ అంటే ప్రాణం. ఎప్పటికప్పడు కొత్త హాబీలను ప్రయత్నిస్తుంటుంది. కార్తీకేమో ఒక పరిశోధకుడు. మెదడుకు పదునుపెట్టే పుస్తకాలు చదవడం, సమకాలీన అంశాలపై లోతుగా చర్చించడం చాలా ఇష్టం. కార్తీక్ తనతో సంతోషంగా లేడని అంజలికి అనిపించేది. అంజలి తన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో ఆసక్తి చూపడం లేదని కార్తీక్‌కు అనిపించేది. కానీ ఆ విషయం ఒకరికొకరు చెప్పుకోలేక మథనపడుతున్నారు. రవి సాఫ్ట్వేర్ ఇంజినీర్, మీరా స్కూల్ టీచర్. రవి తన ప్రేమను ముద్దులు, హగ్గులు, బెడ్ టైమ్‌లో వ్యక్తీకరించేవాడు. మీరా రోజువారీ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉండేది. కానీ రవి తన మాటలు వినడంలేదని అనిపించేది. రవేమో మీరా తనను పట్టించుకోవడంలేదని భావించేవాడు. దీంతో ఇద్దరి మధ్య ఆత్మీయతానురాగాలు దూరమవుతున్నాయి. తరచూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి సమస్య మీకూ ఎదురై ఉండవచ్చు. మీరూ మీ భాగస్వామి బాగానే ఉంటున్నా, ఏదో దూరం పెరుగుతోందని అనిపించవచ్చు. అందుకు కారణమేంటో తెలియక ఆందోళన పడుతూ ఉండవచ్చు. అందుకు ప్రధాన కారణం సాన్నిహిత్యం (intimacy) గురించి అవగాహన లేకపోవడమేనని చెప్పవచ్చు. శారీరక సాన్నిహిత్యం ఉంటే అన్నీ సర్దుకుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అంతకుమించి అవసరమైన సాన్నిహిత్యాలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తించకపోవడం లేదా పరిష్కరించకపోవడం సమస్యలకు దారితీస్తుంది. దంపతులు పరస్పరం వారి అవసరాలను అర్థం చేసుకుని, సాన్నిహిత్య రకాల మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉంటే, సంబంధం మరింత గాఢంగా ఉంటుంది. సమస్యలు తీవ్రమైనప్పుడు ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. 1. భావోద్వేగ సాన్నిహిత్యంబంధానికి, అనుబంధానికి మూలస్తంభం emotional intimacy ఇద్దరి మధ్య భావాలు, అనుభవాలను నిరభ్యంతరంగా పంచుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు భావోద్వేగ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అయితే, ఒక వ్యక్తి ఎమోషనల్‌గా దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మరో వ్యక్తి దూరంగా ఉంటే అది అసంతృప్తికి, ఒంటరితనానికి దారితీస్తుంది. మీరా సమస్య అదే. రవి తనతో ఎమోషనల్‌గా కనెక్ట్ కావడంలేదని బాధపడుతోంది. 2. శారీరక సాన్నిహిత్యంPhysical intimacy అంటే కౌగిలింతలు, ముద్దులు, లైంగిక సంబంధాల వంటివి. దీనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది వారి వారి స్థాయిల్లో ఉంటుంది. ఒకరికి శారీరక సాన్నిహిత్యం అవసరం ఎక్కువగా ఉంటే, మరొకరికి దాని ప్రాముఖ్యత తక్కువగా ఉండవచ్చు. అప్పుడు ఇద్దరి మధ్యా దూరం ఏర్పడుతుంది. ఉదాహరణకు రవికి ఫిజికల్ ఇంటిమసీ ముఖ్యమైతే, మీరాకు ఎమోషనల్ ఇంటిమసీ అవసరం. వారిద్దరి మధ్య దూరానికి అదే కారణం. 3. మేధో సాన్నిహిత్యంఆలోచనలు, అభిప్రాయాలు, లోతైన చర్చల ద్వారా ఏర్పడేదే intellectual intimacy ఇద్దరు వ్యక్తులు తమ అభిప్రాయాలను పంచుకుంటూ మానసికంగా కలిసి ఉంటే, వారి సంబంధం మరింత బలపడుతుంది. కానీ, ఒకరు మేధోపరమైన చర్చల పట్ల ఆసక్తి చూపితే, మరొకరు ప్రాక్టికల్ విషయాలకే ప్రాధాన్యం ఇస్తే, అది అసంతృప్తికి దారితీస్తుంది. అంజలి, కార్తీక్‌ల మధ్య సమస్య ఇదే. 4. అనుభవైక సాన్నిహిత్యంఒకే విధమైన అనుభవాలను పంచుకోవడం ద్వారాexperiential intimacy ఏర్పడుతుంది. ఉదాహరణకు, కలిసి ప్రయాణం చేయడం, వంట చేయడం లేదా ఇతర హాబీలను పంచుకోవడం. ఇది బంధంలో టీమ్‌వర్క్‌ను పెంపొందిస్తుంది. కానీ, ఒక వ్యక్తి బహుళ అనుభవాలకు ప్రాధాన్యమిచ్చి.. మరొకరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటే సమస్యలు వస్తాయి.5. ఆధ్యాత్మిక సాన్నిహిత్యంకొందరికి మతపరమైన లేదాspiritual intimacy చాలా ముఖ్యమైనది. కలిసి ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం లేదా జీవితంపై చర్చలు చేయడం ఈ బంధాన్ని బలపరుస్తాయి. అయితే, ఆధ్యాత్మిక లక్ష్యాల్లో భిన్నత్వముంటే సమస్యలు తలెత్తుతాయి. ఉదాహరణకు.. పరమ భక్తురాలికి నాస్తికుడు భర్తగా ఉంటే ఎలా ఉంటుందో మీరే ఊహించండి. 6. ఆర్థిక సాన్నిహిత్యండబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకత, పరస్పర నమ్మకం కలిగి ఉండటమే financial intimacy. ఒకరు ఆదా చేయడంలో ఆసక్తి చూపుతుండగా, మరొకరు ఖర్చుల పట్ల ఆసక్తి చూపితే అది విభేదాలకు దారితీస్తుంది. -
ఇంటిమసీ లేకుంటే మంటలు తప్పవు
కవిత, నరేందర్ లకు పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఉద్యోగం. అన్యోన్యంగా ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకుంటారు. వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ మీట్స్, టూర్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు.కానీ నెలకో, రెణ్నెళ్లకోసారి గొడవ గ్యారంటీ. చిన్న మాట పట్టింపులతో మొదలై తిట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్తోంది. వీళ్ల గొడవలు చూసి పిల్లలు భయపడుతున్నారు. కలిసుండి ఇలా రోజూ కొట్టుకునేకంటే విడిపోవడమే బెటరని నిర్ణయించుకున్నారు. మ్యూచువల్ డైవోర్స్ కోసం లాయర్‌ను కూడా సంప్రదించారు. కోర్టుకు వెళ్లకముందు ఒకసారి మేరిటల్ కౌన్సెలింగ్ కు వెళ్లమని ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడని వచ్చారు.కవిత, నరేందర్ లతో కలివిడిగానూ, విడివిడిగానూ మాట్లాడాక వాళ్ల మధ్య physical intimacy (శారీరక సాన్నిహిత్యం) తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. కవిత శాలరీ ఎంతో కూడా నరేందర్ కు తెలియదు. అడిగినా చెప్పదు. ‘‘ఇంటి ఖర్చులకు నా షేర్ నేను ఇస్తున్నా కదా. నా శాలరీ గురించి నీకెందుకు? డామినేట్ చేయాలని చూస్తున్నావా?’’ అంటూ గొడవ పడుతుంది.నరేందర్ శాలరీ ఏం చేస్తున్నాడో కవితకు తెలియదు. శాలరీ అంతా ఏం చేస్తున్నావ్? అని అడిగితే ‘‘నేనేదో చేస్తున్నా నీకెందుకు? నీ శాలరీ గురించి నాకు చెప్పనప్పుడు, నా శాలరీ గురించి అడిగే రైట్ నీకు లేదు’’ అని గొడవపడతాడు.ఇలాంటి గొడవలు వాళ్లకు మామూలే. ఇన్ని గొడవల మధ్యా వాళ్లకున్న సుగుణమేంటంటే... పగలెన్ని గొడవలున్నా రాత్రికి ఒకటైతే అన్ని గొడవలూ సర్దుకుంటాయని బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు. కానీ మేరిటల్ రిలేషన్షిప్ బలపడాలంటే, నిలబడాలంటే ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే చాలదని, ఇంకా చాలా కావాలని వాళ్లకు తెలియదు. అందువల్ల ఆ దిశగా వాళ్లెలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద గొవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విడాకుల ప్రయత్నాలు.జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అనేకమందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా ఉంటుంది. కానీ బంధాలు బలపడాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. వాటిగురించి ఈరోజు తెలుసుకుందాం.Types of IntimacyPhysical Intimacy: చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకకోవడం, హగ్ చేసుకోవడం వంటివి ఫిజికల్ ఇంటిమసీకి ఉదాహరణలు. అయితే కవిత దీన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంది, నరేందర్ కు అది నచ్చదు. ఫిజికల్ ఇంటిమసీ బెడ్రూమ్ కే పరిమితం కావాలనేది అతని ఫిలాసఫీ.Emotional Intimacy: ఆఫీస్ లో ఆరోజు ఏం జరిగింది? పని ఒత్తిడి ఎలా ఉంది? ఏమైనా ఆందోళనగా ఉందా? భయమేస్తుందా? ఇలాంటి ఎమోషనల్ విషయాలను మాట్లాడుకోండం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవిత, నరేందర్ ల మధ్య ఇది శూన్యం.Intellectual Intimacy: చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం, చర్చించుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవితకు ఫిక్షన్ బుక్స్ అంటే ప్రాణం, నరేందర్ కు అసలు బుక్స్ అంటేనే చిరాకు. ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటాడు.Experiential Intimacy: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలిసి పనిచేయడం, సమయాన్ని గడపడం ముఖ్యం. కవిత, నరేందర్ ల మధ్య ఇది ఫర్వాలేదు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు.Spiritual Intimacy: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను పార్టనర్ తో చర్చించడమే స్పిరిచ్యువల్ ఇంటిమసీ. నరేందర్ పరమ భక్తుడు, కవిత ఆర్జీవీ రామూయిజం ఫాలోయర్. ఇది చాలు కదా గొడవలు పడటానికి.ఆత్మీయతకు ఆటంకాలుప్రతి రిలేషన్ లోనూ విభేదాలుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో పార్టనర్ నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఇంటిమసీని దెబ్బతీస్తుంది. మితిమీరిన పని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా దంపతుల మధ్య ఇంటిమసీని దూరం చేస్తుంది. పార్టనర్ తో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఇంటిమసీని పెంపొందించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే అది మీ ఇంటిమసీని దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు, కొంతమంది గతానుభవాలు, గాయాల వల్ల పార్టనర్ తో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే fear of intimacy అంటారు. కవితలో ఇది కనిపించింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే అన్ని రకాల ఇంటిమసీలు ఉండేలా చూసుకోవడం అవసరం. కవిత, నరేందర్ లకు వారి ఇంటిమసీల మధ్య విభేదాలు వివరించడంతోపాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఎక్సర్ సైజ్ లు చేయించాను. కొద్ది సెషనల్లోనే వారి మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగింది. వారిప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.ఇలా చేయండి... మీ జీవితంలోనూ సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. ఫిజికల్ ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, హగ్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీని పెంపొందిస్తాయి. మీ పార్టనర్ చెప్పే మాటలు వినడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం పెంచుకోవడం ఎమోషనల్ ఇంటిమసీని పెంచుతుంది. భోజనం చేస్తున్నప్పుడు లేదా మీ పార్టనర్ తో కలిసి టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ దూరంగా ఉంచండి. ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అనుభవించడం సరదాగా ఉంటుంది. అందుకే మీరిద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీని పెంపొందిస్తుంది.మీకు నమ్మకమున్నా లేకపోయినా పార్టనర్ విశ్వాసాలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ స్పిరిచ్యువల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి.సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
విద్యార్థులతో మేడమ్ రాసలీలలు వైరల్.. దర్యాప్తు ముమ్మరం
చెన్నై: తమిళనాడులో ఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు.. ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని.. వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్ ద్వారా సర్క్యూలేట్ చేశాడు. వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ.. 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే.. అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. -
సీరియల్స్ మేకర్స్‌కు షాక్.. ఇకపై ‘ఆ సీన్లు’ ఉంటే చర్యలు తప్పవు
ఇస్లామాబాద్: కాలం మారుతున్న కొద్ది ప్రతి రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని మంచికి దారితీస్తే.. మరికొన్ని అతిని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ చూస్తే పైన చెప్పిన మాట నిజం అనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ఇప్పుడది సీరియల్స్ కూడా అంటుకుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సీరియల్స్ కూడా రోమాంటిక్ సీన్లు ప్రసారం అవుతున్నాయి. అయితే ఇక మీదట టీవీల్లో ప్రసారం అయ్యే సీరియల్స్‌లో కౌగిలించుకోవడం, రోమాన్స్ చేసే సన్నివేశాలు ప్రసారం చేయకూడదని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఎలాక్ట్రానిక్ మీడియా రెగ్యూలేటరి అథారటీ(పీఈఎంఆర్ఏ) ఉత్తుర్వులు జారీ చేసింది. సీరియల్స్‌లో ఇలాంటి సన్నివేశాలు బాగా పెరిగిపోయానని తమకు ఫిర్యాదులు వచ్చాయని పెమ్రా తెలిపింది. ఇలాంటి సన్నివేశాలు ప్రసారం చేసే సీరియల్స్ పాకిస్తాన్ సమాజానికి పూర్తి వ్యతిరేకం అని నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సీరియల్ ప్రమోషన్లో కృతిశెట్టి.. రెమ్యునరేషన్ ఎంతంటే?) ఈ మేరకు ‘‘కౌగిలించుకోవడం, ఒకరినొకరు లాలించడం, వివాహేతర సంబంధాలు, పడకగది సన్నివేశాలు, భార్యభర్తల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్యకరంగా దుస్తులు ధరించడం వంటి సీన్లు ఇస్లామిక్ బోధనలు, పాకిస్తానీ సమాజం సంస్కృతిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కిందకే వస్తుంది. కనుక ఇలాంటి సీరియల్స్‌ని ప్రసారం చేసే ముందు సదరు చానెల్స్ ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని.. అసభ్యతకు తావులేదని భావించిన తర్వాతే ప్రసారం చేయాలి’’ అని పెమ్రా తన నోటిఫికేషన్లో పేర్కొంది. (చదవండి: సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి) పెమ్రా నోటిఫికేషన్‌పై లీగల్, హ్యూమన్ రైట్స్ ప్రొఫెషనల్ రీమా ఒమర్ ప్రతిస్పందిస్తూ, "పెమ్రా తీసుకున్న నిర్ణయం సరైంది. వివాహిత జంటల మధ్య సాన్నిహిత్యం, ఆప్యాయత 'పాకిస్తానీ సమాజంలో ఉండదు'. మా 'సంస్కృతి' నియంత్రణ, దుర్వినియోగం, హింస మాత్రమే. ఇటువంటి పరాయి విలువలు విధించకుండా మనమందరం మన సంస్కృతిని కాపాడుకోవాలి అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: ‘యాక్.. ఇలాంటి చెత్త సీన్లు ఎలా తీస్తారు మీరు?’ PEMRA finally got something right: Intimacy and affection between married couples isn’t “true depiction of Pakistani society” and must not be “glamourised” Our “culture” is control, abuse and violence, which we must jealously guard against imposition of such alien values pic.twitter.com/MJQekyT1nH — Reema Omer (@reema_omer) October 22, 2021 -
జ్ఞానదక్షిణ.. గ్రేట్ జర్నీ
‘భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’ మనం అందరమూ ఈ ప్రతిజ్ఞ చేసినవాళ్లమే. పెద్దయ్యి చదువులలోని సారమెల్ల గ్రహించడంతోపాటు బతుకు పాఠాలు నేర్చుకోవడంలో మునిగిపోయిన క్షణం నుంచి ప్రతినబూనడానికి బిగించిన పిడికిలి ఎప్పుడు సడలిందో మనకు గమనింపు కూడా ఉండదు. దేశాన్ని ప్రేమించడం, దేశం లో అందరినీ సహోదరులుగా భావించడం... ఈ రెండూ జీవితపు సోపానపటంలో ఇమడని అంశాలుగా మారిపోతున్నాయి కూడా. అభ్యున్నతి బాటలో ఎదగడం కోసం మన మనసు పరిధిని కుదించుకుంటూ పోతున్నాం. మనం ఇలా ఉంటే... చదువుకోవడానికి మనదేశానికి వచ్చిన వియత్నాం మహిళ తనదేశంతో సమానంగా మనదేశాన్ని కూడా ప్రేమిస్తోంది. పేదవాళ్లకు ఆహారధాన్యాలను, ఆత్మీయతను పంచుతోంది. ‘‘కోవిడ్ 19తో ప్రపంచం కుదేలయిపోతోంది. మా దేశంలో మేమంతా సంఘటితమై కరోనాతో పోరాడుతున్నాం. భారతదేశం చేస్తున్న పోరాటంలో మా వంతుగా ఓ చిన్న సహాయం మాత్రమే’’ అన్నారు ఫామ్ థి లెన్. ఆమె గుంటూరు జిల్లా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నారు. భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వియత్నాం వాసులను అనుసంధానం చేస్తున్నారీమె. ప్రేమ... పంచితే పెరుగుతుంది ‘‘మాకు చదువు చెప్పిన దేశం మాకు పరాయి దేశం ఎలా అవుతుంది? ఈ దేశంలో ఉన్న పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అసహాయ మహిళలకు కరోనా పోరాటంలో అండగా నిలవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందనుకుంటున్నాం. కరుణ, పరస్పర ప్రేమ స్ఫూర్తితో ఈ పని మొదలు పెట్టాం. ప్రభుత్వాలు ఆదుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ మాకు చేతనైనంత మందిని కలిసి ‘భయపడవద్దు. కరోనాను జయించగలుగుతాం’ అని ధైర్యం చెప్తున్నాం. వృద్ధులు, పేదవాళ్లు మేము ఆత్మీయంగా చెప్పే మాట కోసమే ఎక్కువ ఆర్తిగా ఉంటున్నారు. మా ఈ చిన్న సహాయం మనుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. సంఘీభావాన్ని పెంచుతుంది. ఈ బంధం కొనసాగాలి. మనిషి జీవన ప్రయాణంలో ఇలాంటి ఎన్ని మహమ్మారులు ఎదురైనా ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ కష్టం నుంచి ఇండియా త్వరగా గట్టెక్కాలని మా వియత్నాం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించగలుగుతున్నాం. కోవిడ్ రాక ముందు కూడా నిరుపేదలకు ఆహార ధాన్యాలు, దుప్పట్లు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు మరింత ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. నార్త్ ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాల కల్పన, బుద్ధగయ దగ్గర ఆహారధాన్యాల పంపిణీ వంటి పనులను సమన్వయం చేస్తున్నాం. నాకు జ్ఞానమిచ్చిన దేశానికి చెల్లించుకుంటున్న గురుదక్షిణ ఇది’’ అన్నారు ఫామ్ థి లెన్. మహమ్మారితో పోరాటం పీహెచ్డీ తర్వాత పుస్తకాలు రాయడం మీద దృష్టిపెడతానని చెప్తున్న ఫామ్ థి లెన్... ఆధ్యాత్మికత నిండిన శాంతికాముక ప్రపంచసాధన కోసం శాంతి బోధనకు అంకితమవుతానని చెప్పారు. వీలయినంత మందిని కలిసి బాధల నుంచి విముక్తి పొందడానికి అవసరమైన మనోధైర్యాన్ని నింపాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘‘మానవత్వంతో చేతులు కలిపితే మహమ్మారిని జయించగలుగుతాం. శాంతి సంతోషాలతో జీవించగలుగుతాం’’ అన్నారు ఫామ్ థి లెన్. నాగార్జునుడు నడిచిన నేల ఫామ్ థి లెన్ 1973 జూన్‌లో సౌత్ వియత్నాంలోని బీయిన్ హోవా పట్టణలో పుట్టారు, ఏడుగురు సంతానంలో ఆమె ఆరవ వారు. ఆమె తండ్రి సైనికుడు. వియత్నాం స్వేచ్ఛకోసం యుద్ధం చేశారు. తల్లి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సమాజంలోని పీడిత మహిళల కోసం సేవలందించేవారు. ఫామ్ థి లెన్ 24 ఏళ్ల వయసు లో సన్యాసినిగా మారారు. ఐదేళ్ల కిందట పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఆమె ఇండియాకి వచ్చారు. విదేశాల్లో చదువుకునే అవకాశం వచ్చినప్పుడు ఇండియానే ఎంచుకోవడానికి బలమైన కారణమే ఉందన్నారామె. ‘ఇది అహింసను పాటించిన గాంధీజీ దేశం. శూన్యవాదాన్ని బోధించిన నాగార్జునుడు నడిచిన నేల. అంతకంటే ప్రధానంగా సర్వ మానవాళి స్వేచ్ఛ, శాంతికోసం పాటుపడిన బుద్ధుడి ప్రదేశం’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి -
సన్నిహిత సన్నివేశాల రూపశిల్పి
తాము చేస్తున్నది నటన అని నటీనటులకు తెలుసు. దర్శకుడు చెప్పింది చేయాలని కూడా తెలుసు. అయితే ఆ చెప్పింది తమ కంఫర్ట్ లెవల్లో చేయాలని అనుకుంటే అందుకు ఒక ఎక్స్పర్ట్ కావాలి. ప్రేమ సన్నివేశాలు, శోభనం సన్నివేశాలు, సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో పెరిగాయి. చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ‘డాన్స్ కొరియోగ్రాఫర్లు’ ఉన్నట్టుగానే ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ ఎందుకు లేరు అనుకున్నారు ఆస్థా ఖన్నా. భారతదేశపు తొలి ‘ఇంటిమసి కో ఆర్డినేటర్’గా ఇప్పుడు ఆమె ఒక కొత్త ఉపాధి మార్గాన్ని చూపుతున్నారు. ‘మీ టూ’ ఉద్యమం వచ్చే వరకూ ప్రపంచ సినిమా మేకింగ్ ఒకలా ఉండేది. ‘మీ టూ’ వచ్చాక మారిపోయింది. సన్నిహిత సన్నివేశాలలో నటించేటప్పుడు ఆ నటక ఏదైనా తప్పు సంకేతం ఇస్తే అపార్థాలు జరిగి సమస్య ఉత్పన్నం కావచ్చునని ముఖ్యంగా మగ నటులు భావించడం మొదలెట్టారు. మరో వైపు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వల్ల, మారిన సినిమా ధోరణుల వల్ల ‘సన్నిహిత’ సన్నివేశాలు విపరీతం గా పెరిగాయి. సన్నిహితమైన కంటెంట్తోటే కొన్ని వెబ్ సిరీస్ జరుగుతున్నాయి. ప్రేక్షకులు భిన్న అభిరుచులతో ఉంటారు. వీరిని ఆకర్షించడానికి రకరకాల కథలు తప్పవు. అయితే ఇలాంటి కథల్లో ఏ చిక్కులూ రాకుండా ఉండేందుకు, నటీనటులు ఇబ్బంది లేకుండా నటించేందుకు సెట్లో ఉండి తగిన విధంగా సూచనలు ఇస్తూ బాధ్యత తీసుకునే కొత్త సినిమా క్రాఫ్ట్వారు ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. వీరిని ‘ఇంటిమసీ కోఆర్డినేటర్లు’ లేదా ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ అంటున్నారు. బాలీవుడ్లో ఒక మహిళ మొట్టమొదటిసారి సర్టిఫైడ్ ఇంటిమసి కోఆర్డినేటర్ అయ్యింది. ఆమె పేరు ఆస్థా ఖన్నా. ముంబైలోని ‘ఇంటిమసీ ప్రొఫెషనల్ అసోసియేషన్’ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్ పొందిమరీ ఈమె ఈ రంగంలోకి వచ్చారు. నిజంగా ఇదొక విశేషమైన వార్త. సగటు సమాజ భావజాలంలో ఒక స్త్రీ ఇలాంటి ఉపాధి ఎంచుకోవడం విశేషమే. ఎవరీ ఆస్థా చద్దా ఆస్థా చద్దా లండన్‌లో చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ మధ్య హిట్ అయిన ‘అంధా ధున్’కు పని చేసింది. భారతదేశంలో తయారయిన ‘మస్త్ రామ్’ అనే వెబ్ సిరీస్‌కు ‘ఇంటిమసీ కోఆర్డినేటర్’గా ఆస్ట్రేలియాకు చెందిన అమండా కటింగ్ వచ్చి పని చేసింది. ఆ సంగతి ఆస్థా చద్దా తెలుసుకుంది. అదీ గాక తాను పని చేసిన సినిమాలలో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయం లో నటీనటులు, దర్శకుడు ఏదో ఒక ‘తక్షణ ఆలోచన’తో పని చేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. నిజానికి సన్నిహిత సన్నివేశాలు అప్పటికప్పుడు ఆలోచించి చేసేవి కావు. వాటికి ప్రత్యేక సూచనలు, జాగ్రత్తలు అవసరం. ఆ ఖాళీ భారతీయ సినిమారంగంలో ఉందని ఆస్థా అర్థం చేసుకుంది. వెంటనే తాను శిక్షణ పొంది ఇంటిమసి కోఆర్డినేటర్‌గా ఉపాధి ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో తయారవుతున్న మూడు నాలుగు వెబ్ సిరీస్‌కు పని చేసింది ఆస్థా. వీరేం చేయాలి? హీరో హీరోయిన్లుగాని, కేరెక్టర్ ఆర్టిస్టులు కాని వివిధ సందర్భాలకు తగినట్టుగా సన్నిహితంగా నటించాలి. అయితే ఇద్దరూ భిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. ఎంత అది నటన అయినా దానికి ఇబ్బంది పడే వీలు ఎక్కువ. కొందరు అదుపు తప్పి వ్యవహరించవచ్చు కూడా. వీటన్నింటిని ‘ఇంటిమసి కోఆర్డినేటర్లు’ పర్యవేక్షిస్తారు. దుస్తులు, కెమెరా యాంగిల్స్, నటీనటుల మూవ్మెంట్స్ వీరే గైడ్ చేస్తారు. ‘నటీనటులకు తగ్గట్టు అవసరమైతే డూప్స్‌ను వాడటం, వారి శరీరాలు దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని అడ్డంకులు ఉంచడం, ఎంతవరకు సీన్‌కు అవసరమో అంతవరకూ నటించేలా చూడటం మా పని’ అంటుంది ఆస్థా ఖన్నా. ఏ సన్నివేశాలలో ఏ నటీనటులైతే నటించాలో వారితో ముందు వర్క్‌షాప్ నిర్వహించడం కూడా ఆస్థా పని. ‘దానివల్ల నటీనటులు తీయవలసిన సీన్‌కు ప్రిపేర్ అవుతారు. చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటుందామె. పిల్లల రక్షణ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు షూటింగ్లో పాల్గొనే పిల్లలతో తోటి నటుల ‘స్పర్శ’ను కూడా గమనిస్తారు. తండ్రి పాత్రలు వేసేవారు కుమార్తెగా లేక కుమారుడిగా నటించే పిల్లలతో నటించేటప్పుడు ఆ పిల్లలు ఎంత కంఫర్ట్‌గా ఉన్నారు, ఆ టచ్‌లో ఏదైనా దురుద్దేశం ఉందా ఇవన్నీ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు గమనించి పిల్లలకు సూచనలు ఇస్తారు. ‘వాళ్లు ఇబ్బంది పడే సన్నివేశానికి నో చెప్పడం మేము నేర్పిస్తాం’ అంటుంది ఆస్థా ఖన్నా. శరీరాలు ఇబ్బంది పడే సన్నివేశాలంటే కేవలం అత్యాచార సన్నివేశాలే కాదు... బైక్ మీద హీరోను కరుచుకుని కూచోవాల్సిన సమయంలో కూడా ఆ నటికి ఇబ్బంది ఉండొచ్చు. లేదా నటుడికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ సమయంలో ఇంటిమసి కోఆర్డినేటర్లు తగిన జాగ్రత్తలు చెప్పి షూట్ చేయిస్తారు. గతంలో ఫలానా సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడి షూటింగ్ మానేసిన తారలు ఉన్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లుగా స్త్రీలు ముందుకు రావడం వల్ల తమ ఇబ్బందులు వారితో షేర్ చేసుకునే వీలుంది. వీరు డైరెక్టర్‌తో చెప్పి షూటింగ్ సజావుగా అందరి ఆమోదంతో జరిగే విధంగా చూసే వీలు ఉంది. చూడబోతే మున్ముందు ఆస్థా ఖన్నా వంటి ప్రొఫెషనల్స్ అవసరం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఉపాధిని కనిపెట్టడమే కాదు దానిని గౌరవప్రదంగా నిర్వహించడం కూడా ఈ తరం తెలుసుకుంటోంది. దానిని మనం స్వాగతించాలి. – సాక్షి ఫ్యామిలీ -
‘‘ఆక్సిజన్ కావాలా.. రూమ్‌కి వచ్చి నాతో గడుపు’’
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవత్వాన్ని మింగేస్తుంది. ఓవైపు ప్రజలు కోవిడ్‌తో అల్లాడుతుంటే.. దీన్ని అదునుగా తీసుకుని కొందరు మనుషులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. వైరస్ విజృంభిస్తోన్న వేళ ఆక్సిజన్ సిలిండర్, అంబులెన్స్, కొన్ని ఔషధాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దాంతో కొందరు వ్యక్తులు ఏమాత్రం జాలి, దయ లేకుండా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ.. జలగల్లా జనాల రక్తాన్ని పీలుస్తున్నారు. మరి కొందరు నీచులు అంతటితో ఆగక మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అపత్కాలంలో ఆడవారు సాయం కోరితే దాన్ని అదునుగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచారకరమైన అంశం ఏంటంటే కొన్ని చోట్ల బాధితులకు ఎంతో కాలంగా తెలిసిన వారు.. మంచి వారుగా ముద్ర వేయించుకున్న వారు ఇలా ప్రవర్తించడం. తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ ఇలాంటి సంఘటన గురించి ట్వీట్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిని ఆ సంఘటన ఆ వివరాలు.. సదరు ట్విట్టర్ చేసిన ట్వీట్లో ‘‘నా స్నేహితుడి సోదరి తండ్రి కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధితురాలు.. చిన్నతనం నుంచి తనను సోదరిగా భావించిన పొరుగింటి వ్యక్తికి తన పరిస్థితిని వివరించి.. సాయం చేయాల్సిందిగా కోరింది. దానికి అతడు ‘‘తప్పకుండా హెల్స్ చేస్తాను. అందుకు బదులుగా నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకోవాలి. నా గదికి వచ్చి గడిపితే.. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు. అతడి మాటలు విని బాధితురాలు షాక్ అయ్యింది. చిన్నతనం నుంచి తనను చెల్లి అని పిలిచిన వ్యక్తి ఇంత నీచుడా అనుకుని ఎంతో ఆవేదన చెందింది’’ అంటూ వెల్లడించి.. ‘‘ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పండి’’ అని నెటిజనులను కోరాడు సదరు ట్విట్టర్ యూజర్. ఈ ట్వీట్‌పై ‘‘వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని కొందరు సూచించగా.. మరి కొందరు ‘‘సదరు అపార్ట్మెంట్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లండి’’ అనగా.. మరి కొందరు ‘‘అతడి పేరు, ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. పబ్లిక్‌గా పరువు తీస్తే తప్ప ఇలాంటి వారికి బుద్ధి రాదు’’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో ముంబైకి చెందిన ఓ మహిళ ప్లాస్మా కావాలి.. దాతలు సంప్రదించాల్సిందిగా కోరుతూ.. తన పర్సనల్ నంబర్ ఇవ్వడంతో ఎంత టార్చర్ అనుభవించిందో ట్విట్టర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే.. -
అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు
పుట్టుకతో మనిషికి కొన్ని బంధాలు ఏర్పడుతాయి. కానీ పుడుతూనే కొందరికి అన్ని బంధాలూ తెగిపోతాయి. జన్మనిస్తూ తల్లి మరణిస్తుంది. కళ్లు తెరిచేలోపే కన్న తల్లిదండ్రుల్ని మృత్యువు లాక్కెళ్లిపోతుంది. కారణాలు ఏవైతేనేం... పసిగుడ్డుగా ఉన్నప్పుడే బతుకు కుప్పతొట్టి పాలవుతుంది. అలాంటివారికి తమకంటూ చెప్పుకోవడానికి ఏ బంధం ఉంటుంది? ఏ బాంధవ్యం ఒడిలో చేర్చుకుని, గుండెల్లో పొదువుకుని పెంచుతుంది? ఈ ఆలోచన ఒక వ్యక్తిని వేలాదిమందికి తండ్రిని చేసింది. అతడి నీడలో వారి జీవితాలకు పునాది వేసింది! ‘‘నాన్నా... నాకు నాన్న లేడా?’’... ఆ ప్రశ్న వింటూనే అదోలా అయిపోయింది విద్యాకర్ మనసు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూండిపోయారు. ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేని చిన్నారి అభిలాష్ ఏడుస్తూ నిలబడ్డాడు. ‘‘చెప్పండి నాన్నా... నాకు నాన్న లేడా?’’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అతడిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నారు విద్యాకర్. నీకు నాన్న లేడని ఆ చిన్నారికి చెప్పలేరాయన. ఎందుకంటే అతడు తననే తండ్రి అనుకుంటున్నాడు. ఉన్నాడు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆ బాబు తండ్రెవరో తనకు కూడా తెలియదు కాబట్టి! మార్చి 27, 1994. చెన్నైలోని అన్నానగర్‌లో ఉండే విద్యాకర్కి ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వింటూనే విద్యాకర్ హడావుడిగా స్కూటర్ వేసుకుని బయలుదేరారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన గుర్తుల ఆధారంగా ఓ కుప్పతొట్టి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి ఆయన మనసు కరిగి నీరయ్యింది. కుప్ప తొట్టిలో... కళ్లు కూడా తెరవని ఒక పసికందు పడివుంది. చీమలు కుడుతుంటే గుక్కపట్టి ఏడుస్తోంది. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా కందిపోయింది. విద్యాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తారు. తక్షణ చికిత్స చేయించి ఆ శిశువును కాపాడారు. తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్లారు. అభిలాష్ అని పేరుపెట్టి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అతడే అభిలాష్. ఊహ తెలిసేనాటికి తాను ఎవరి చేతుల్లో ఉన్నాడో అతడే తండ్రి అనుకున్నాడు అభిలాష్. బడిలో చేరిన తరువాత తెలిసింది తన అప్లికేషన్ ఫామ్‌లో తండ్రి అనే కాలమ్ ఖాళీగా ఉంది అని. అది తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్లి తను నాన్నా అని పిలిచే విద్యాకర్‌ని నిలదీశాడు. తర్వాత మెల్లగా నిజం తెలుసుకున్నాడు. నాన్న కాని ఆ నాన్నకు పాదాభివందనం చేశాడు. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉంటాడు. కుప్పతొట్టిలో దొరికిన తనకు కొడుకు స్థానాన్ని ఇచ్చిన విద్యాకర్ రుణం తీర్చుకోలేనంటాడు కన్నీళ్లతో. ప్రస్తుతం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేరవు తున్నాడు అభిలాష్. నిజానికి అతడే కాదు. అతడిలా విద్యాకర్ ప్రేమలో తడిసి విరబూసిన కుసుమాలు చాలానే ఉన్నాయి. ఆ గుబాళింపు తెలియాలంటే... చెన్నైలో ఉన్న ‘ఉదవుమ్ కరంగళ్’కు వెళ్లాలి. అది ప్రేమ ప్రపంచం... కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలను విసు క్కుంటూ ఉంటారు. కానీ ‘ఉదవుమ్ కరంగళ్’లో ఉండే ఏ చిన్నారినీ విద్యాకర్ ఒక్కసారి కూడా విసుక్కుని ఉండరు. వాళ్లని చూస్తేనే ఆయన మనసులో ప్రేమ పొంగి పొరలుతుంది. ఎక్కడెక్కడినుంచో ఆ పిల్లలను తీసుకొచ్చా రాయన. తల్లిదండ్రుల్ని కోల్పోయినవాళ్లు, కుప్పతొట్టి లోనో రోడ్డు పక్కనో దారుణమైన స్థితిలో పడివుండి పసికందులుగా దొరికిన వాళ్లు... ఎక్కడ ఓ చిన్నారి కనిపించినా అక్కున చేర్చు కుంటారాయన. వారి కోసమే ‘ఉదవుమ్ కరంగళ్’ను స్థాపించారు. విద్యాకర్ పుట్టింది మంగుళూరులో. పద మూడేళ్ల వయసులో అనుకోకుండా రామకృష్ణ అనే వ్యక్తిని ఓ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఓసారి ఆయనను కలుసుకోవడానికి చెన్నై కూడా వెళ్లారు. అప్పుడే ఆయనకు సమాజం కోసం బతకడమంటే ఏంటో తెలిసింది తొలిసారి. రామకృష్ణ సమాజ సేవ చేసేవారు. ఆయనను చూసి స్ఫూర్తిపొందిన విద్యాకర్... స్థానికంగా కుష్టురోగుల కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో చేరారు. సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ క్రమంలో ఓరోజు... ఒక రిక్షా కార్మికుడు ఒక పసిబిడ్డను తీసుకుని విద్యాకర్ దగ్గరకు వచ్చాడు. సినిమా హాల్లో దొరికిందని చెప్పి, విద్యాకర్కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ బిడ్డకు ఓ నీడ కల్పించాలని చాలా ప్రయత్నించారు విద్యాకర్. కానీ ఎవరూ సహకరించలేదు. దాంతో ఆయన మనసు కదిలిపోయింది. దిక్కులేని బిడ్డను సాకేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, ఇలాంటి పిల్లలందరి పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన ఆయన ‘ఉదవుమ్ కరంగళ్ (సాయం చేసే చేతులు)’కు పునాది వేశారు. నాటి నుంచి తన సంస్థ ద్వారా ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకున్నారు విద్యాకర్. వాళ్లంతా తనను ‘నాన్నా’ అని పిలుస్తుంటే ఆయన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆయన చేతులు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. - సమీర నేలపూడి ‘ఉదవుమ్ కరంగళ్’ను 1983లో స్థాపించారు విద్యాకర్. మొదట అనాథ శిశువుల సంరక్షణ కోసమే పెట్టినా... తరువాత సంస్థను పలు సేవా కార్యక్రమాల దిశగా విస్తరించారాయన. వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను చేరదీసి చికిత్స చేయిస్తున్నారు. ఎయిడ్ వ్యాధిగ్రస్తులను కూడా చేరదీస్తున్నారు. వీరందరికీ ఆవాసం కల్పించేందుకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు విద్యాకర్. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది వందలకు పైగా మానసిక వికలాంగులు, నాలుగు వందల మందికి పైగా ఎయిడ్స వ్యాధిగ్రస్తులు, యాభై మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అదే విధంగా ఆరు వందల మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వీరిలో నెల రోజుల నుంచి ఇరవయ్యేళ్ల వయసు ఉన్నవారి వరకూ ఉన్నారు. అందరూ విద్యాకర్‌ని ‘పప్పా (నాన్నా)’ అనే పిలుస్తారు. ఎవరూ అనాథలుగా ఫీలవకూడదన్న ఉద్దేశంతోనే అలా పిలవడం అలవాటు చేశారు విద్యాకర్. అందరికీ చదువు చెప్పిస్తున్నారు. అది కూడా ఎవరికి నచ్చిన కోర్సు వాళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి మనసే ఆయనను అందరికీ ఆప్తుడిగా మార్చింది. ఆయన ఖ్యాతిని విదేశాల వారు సైతం గుర్తించేలా చేసింది! -
మూడిళ్ల పండగ
ఉండేవి ఉంటాయి. ఉంటూనే ఉంటాయి. అంతమాత్రాన... పండగలు లేకుండా పోతాయా? పలకరింపులు బంద్ అయిపోతాయా? రాకపోకలు తెగిపోతాయా? ఇచ్చిపుచ్చుకోవడం ఆగిపోతుందా? ఒకనాటి సంస్కృతా, ఒకనాటి సంప్రదాయమా? ఒకనాటి ఆత్మీయతలా, ఒకనాటి అనుబంధాలా? ప్రాంతాలు లెక్క కాదు... అంతరంగం ముఖ్యం. పరమాన్నాలు ఎన్నిరకాలని కాదు... తియ్యదన మే ప్రధానం. భక్ష్యాలు, బొబ్బట్లు, ఓలిగలు... వేర్వేరు కావచ్చు. అదే బెల్లం, అదే పంచదార, అదే పిండి... అందరం ఒక్కటే... నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు. కలిసి జరుపుకుందాం... కలిసి తీపిని పంచుకుందాం. శుభాకాంక్షలు తెలుపుకుందాం. పాలముంజలు కావలసినవి: శనగపప్పు - ముప్పావు కప్పు; బెల్లంతురుము - కప్పు; పచ్చికొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; బొంబాయిరవ్వ - ఒకటిన్నర కప్పులు; పాలు - మూడు కప్పులు; నూనె-డీప్ ఫ్రైకి సరిపడా తయారి: శనగపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి కుకర్‌లో ఉడికించాలి ఉడికిన తర్వాత నీరు ఎక్కువగా ఉంటే వడపోసి, పప్పు చల్లారాక, మిక్సీలో వేసి పొడిపొడిగా వచ్చేలా చేయాలి ఒక పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీరు వేసి స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగి, మరిగేవరకు ఉంచాలి శనగపప్పు పొడి, కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఉడికించి దించేయాలి చల్లారాక, ఉండల్లా చే సి పక్కన ఉంచాలి గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి బొంబాయిరవ్వ నెమ్మదిగా వేస్తూ, కలుపుతుండాలి మంట తగ్గించి, మిశ్రమం దగ్గర పడేవరకు రెండు నిముషాలు ఉడికించాలి చల్లారిన తరవాత మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలపాలి చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చే సుకోవాలి ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని పూరీ షేప్‌లోకి ప్రెస్ చేయాలి శనగపప్పు మిశ్రమాన్ని మధ్యలో ఉంచి అంచులను మూసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఒక్కో ఉండను నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. కొబ్బరి సద్ది కావలసినవి: అన్నం - మూడు కప్పులు; కొబ్బరి ముక్కలు - కప్పు; పచ్చిమిర్చి - 3 (మధ్యకు కట్ చేయాలి); ఎండుమిర్చి - 3; పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - పది పలుకులు; ఆవాలు - టీ స్పూను; శనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; నువ్వులపొడి - రెండు టేబుల్ స్పూన్లు. తయారి: కొబ్బరిముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి వేయించాలి జీడిపప్పు, పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు జత చేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరిపేస్ట్ వేసి బాగా కలిపి, వేయించాలి అన్నం, ఉప్పు వేసి కలపాలి మంట తగ్గించి రెండు నిముషాలు ఉంచి దించేయాలి. కజ్జి కాయలు కావలసినవి: మైదా - 250 గ్రా; బొంబాయిరవ్వ - కప్పు; పంచదార - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఎండుకొబ్బరి తురుము - అరకప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; ఉప్పు - చిటికెడు; నెయ్యి - 2 టీ స్పూన్లు; నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి: ఒక పాత్రలో బొంబాయిరవ్వ, ఎండుకొబ్బరి తురుము, ఏలకులపొడి, పంచదార వేసి కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో మైదా, నెయ్యి, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, పైన వస్త్రం వేసి, సుమారు గంటసేపు నాననివ్వాలి నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి, పూరీలా ఒత్తి కజ్జికాయ మౌల్డ్ మీద ఉంచాలి టేబుల్ స్పూను బొంబాయిరవ్వ మిశ్రమాన్ని ఇందులో ఉంచి మౌల్డ్‌ని మూసి, అంచులు తీసేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కజ్జికాయలను వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. గుమ్మడి హల్వా కావలసినవి: తీపిగుమ్మడికాయ తురుము - 2 కప్పులు; పాలు - 2 కప్పులు; పంచదార - కప్పు; నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 15; ఏలకులపొడి - అర టీ స్పూను తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక బాదంపప్పుల తరుగు వేసి వేయించి, తీసి పక్కన ఉంచాలి అదే బాణలిలో గుమ్మడికాయ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు సుమారు ఐదు నిముషాలు వేయించాలి రెండు కప్పుల పాలు పోసి బాగా కలిపి, పాలు ఇగిరిపోయేవరకు ఉడికించాలి పంచదార వేసి కలపాలి అన్నీ బాగా ఉడికిన తరవాత దించేయాలి ఏలకులపొడి, బాదంపప్పు ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయాలి. పెరుగన్నం కావలసినవి: అన్నం - రెండు కప్పులు; ఉప్పు - కొద్దిగా; పెరుగు - రెండు కప్పులు; కొత్తిమీర - చిన్న కట్ట; దానిమ్మ గింజలు - పావుకప్పు; కిస్మిస్ ద్రాక్ష - రెండు టీస్పూన్లు; జీడిపప్పులు - టేబుల్ స్పూను; తయారి: ఒకపాత్రలో అన్నం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి దానిమ్మ గింజలు, కిస్మిస్ ద్రాక్ష వేసి కలపాలి కొత్తిమీర, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి. మురుకులు కావలసినవి: బియ్యప్పిండి - 3 కప్పులు; వేయించిన శనగపిండి - కప్పు ; వాము - టీ స్పూను; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత తయారి: ఒక పాత్రలో బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వాము వేసి కలపాలి ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు, రెండు టేబుల్స్పూన్ల నూనె వేసి మరిగించి, ఆ నీటిని పిండిలో వేసి కలపాలి అవసరమనుకుంటే కొద్దిగా చన్నీరు వేస్తూ పిండి మెత్తగా అయ్యేవరకు కలపాలి పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, మురుకుల గొట్టంలో ఉంచి, ఒక ప్లేట్ లాంటి దాని మీద గుండ్రంగా మురుకు ఆకారం వచ్చేలా తిప్పుతుండాలి బాణలిలో నూనె పోసి కాగాక, వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి, మంట తగ్గించి వేయించాలి బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేయాలి. పాల్ పోలీ కావలసినవి: మైదా - కప్పు; పాలు - అర లీటరు; కండెన్స్డ్ మిల్క్ - 3 టేబుల్ స్పూన్లు; నూనె - టీ స్పూను; నీరు - పావు కప్పు; నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా; పంచదార - 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు - చిటికెడు; బాదంపప్పులు - కొద్దిగా; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారి: ఒక పాత్రలో మైదా వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా క లిపి, మూత పెట్టి గంటసేపు నాననివ్వాలి కడాయిలో పాలు మరిగించి, మంట తగ్గించి, కండెన్స్డ్ మిల్క్ పోయాలి చిన్న గ్లాసులో కొద్దిగా నీరు, కుంకుమపువ్వు వేసి బాగా కలిపి, మరుగుతున్న పాలలో వేయాలి పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి ఈ పాలను వెడల్పాటి పాత్రలో పోయాలి పిండిని చిన్నచిన్న ఉండలుగా తీసుకుని, పూరీల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి వేయించాలి పూరీలన్నీ తయారుచేసుకుని, పాలలో వేయాలి గంటసేపు నానినతర్వాత పూరీలను బయటకు తీసి, బాదంపప్పులతో గార్నిష్ చేసి, చల్లగా సర్వ్ చేయాలి. సజ్జ ముద్దలు కావలసినవి: సజ్జపిండి - 2 క ప్పులు; బెల్లంతురుము - కప్పు; నీరు - తగినంత; ఏలకులపొడి - చిటికెడు; డ్రైఫ్రూట్స్ - (బాదం, జీడిపప్పు, కిస్మిస్) - 2 టీ స్పూన్లు; నెయ్యి - 2 టే బుల్ స్పూన్లు తయారి: తగినన్ని నీరు మరిగించాలి ఒక గిన్నెలో సజ్జపిండి వేసి, వేడినీరు కొద్దికొద్దిగా పోస్తూ కలిపి ముద్ద చేయాలి కావలసిన పరిమాణంలో ముద్ద తీసుకొని, కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ, రొట్టె చేసి, పెనం మీద వేసి రెండువైపులా కాల్చాలి వేడిగా ఉన్నప్పుడే సజ్జ రొట్టెలకు నీళ్లు అద్దుకుంటూ చేత్తో ముక్కలు ముక్కలు చేసి, రోట్లో వేసి దంచాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో నెయ్యి, బెల్లం, ఏలకులపొడి, సజ్జరొట్టె ముక్కల పొడి వేసి కొద్దిగా వేయించి దించాలి కావలసిన పరిమాణంలో ఈ పొడిని తీసుకొని బాదం, జీడిపప్పులు, కిస్మిస్లు అద్దుకుంటూ ముద్దలు చేయాలి. ఓలిగలు కావలసినవి: కందిపప్పు - కప్పు; బెల్లంతురుము - కప్పు; నీరు - 3 కప్పులు. పైన కవరింగ్ కోసం: మైదా - కప్పు; నువ్వుపప్పు - 2 టేబుల్‌స్పూన్లు; నూనె - అర కప్పు; నీరు - అరకప్పు; పసుపు - అర టేబుల్ స్పూను తయారి: ఒక పాత్రలో కందిపప్పు, తగినంత నీరు వేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి చల్లారాక అధికంగా ఉన్న నీరు తీసేసి, పప్పును మెత్తగా చిదిమి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఐదు నిముషాలు ఉంచి దించి చల్లారనివ్వాలి ఏలకులపొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఒక పాత్రలో మైదా, నీరు, పసుపు, నూనె వేసి చపాతీపిండిలా కలిపి మూడుగంటలసేపు నాననివ్వాలి ఈ పిండిని చిన్న ఉండలా తీసుకుని చేతితో ఒత్తి, పూర్ణం ముద్దను ఇందులో ఉంచి, అప్పడాల పీట మీద ఉంచి అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి, కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ఓలిగను పెనం మీద వేసి చుట్టూ నూనె వేసి, రెండువైపులా నూనె వేసి కాలాక తీసేయాలి. సేకరణ డా.వైజయంతి పిండివంటలు రుచిగా ఉండాలంటే... బొంబాయిరవ్వ వేయించి వాడితే పిండివంటలు రుచిగా ఉంటాయి. ఎండుకొబ్బరి వాడితే స్వీట్లు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి. మైదాపిండిని కలిపిన తరవాత చిన్నగిన్నెడు నూనె వేసి చేత్తో బాగా మర్దన చేసి, గిన్నె మీద తడి వస్త్రం కప్పి, గంటసేపు నాననిస్తే పిండివంటలు గుల్లగా వస్తాయి. గుమ్మడికాయ వంటి వాటిని స్వీట్లలో ఉపయోగించేటప్పుడు, వీటిలోని నీరు బాగా పిండేసి, నేతిలో దోరగా వేయించాలి. మిల్క్ స్వీట్లు తయారుచేసేటప్పుడు... పాల బదులు కండెన్స్డ్ మిల్క్ ఉపయోగిస్తే స్వీట్లు రుచిగా ఉంటాయి. ఏ పిండివంటలనైనా నూనెలో వేయించేటప్పుడు మంట తగ్గిస్తే, వంటకాలు మాడిపోకుండా, దోరగా వేగుతాయి. -
కులమత సాగర సంగమ శృతిలో...
భారతదేశం పుణ్యభూమి, వేదభూమే కాకుండా ప్రేమ భూమి కూడా. ప్రేమను పంచడం, ఆత్మీయతలను అందీయడంలో భారతదేశం ముందువరుసలో ఉంటుంది. ప్రేమ తత్త్వానికీ, మానవత్వానికీ అర్థం పరమార్థం తెలిపిన ఎందరో మహానీయుల కథలు, కథనాలు ఈ నేలమీద నిత్యశ్రవణాలు, చిరస్మరణాలు. ప్రేమభావనకు పాదులు తొడిగి మానవ మనుగడకు ప్రేమే మూలమని చాటిచెప్పిన రామాయణం, విశ్వరహస్యమంతా ప్రేమమయమేనని వేణువూదిన కృష్ణతత్త్వం, బుద్ధుడు, పరమహంస, వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ, మదర్ థెరిసా... ఇలా ఎందరో ఈ నేలమీద ప్రేమకు ఆనవాలుగా కనిపిస్తారు. ఈ దేశం చెరిగిపోని ప్రేమలకు చిరునామా... కాలం చెరిగిపోని మమతలకు వీలునామా. ఇలాంటి దేశంలో ఒక మారుమూల పల్లెలో మనసులు కలబోసుకున్న ఒక కుర్రజంట గుండెచప్పుళ్లకు అందమైన అనువాదమేమో అనిపించే అద్భుతమైన గీతం, నాకు నచ్చిన గీతం ‘సీతాకోకచిలక (1981)’ చిత్రంలోని ఈ పాట. భారతీరాజా దర్శకత్వం - ఇళయరాజా సంగీత దర్శకత్వం, బాలసుబ్రహ్మణ్యం. వాణీజయరామ్ల గళ మాధుర్యాల మేళవింపుగా రూపుదిద్దుకున్న ఈ పాట, కీర్తిశేషులు వేటూరి వారి సాిహ తీ సుగంధంతో అజరామరమైంది. వైయక్తికమైన ప్రేమకు విశ్వవ్యాప్తమైన ఆలోచన ఆలంబనగా నిలిచినప్పుడు ఆ ప్రేమగీతం సత్యం-శివం-సుందరం అవుతుంది. ఈ పాటలో వేటూరి సుందరరామమూర్తి కలవిన్యాసం ఆ విధంగానే సాగింది కనుక, ఈపాట కలకాలం చల్లని చల్లని ప్రేమ గీతమైంది. క్రైస్తవ-హిందూ మతాలకు చెందిన యువతీయువకుల ప్రేమకథగా దర్శకుడు భారతీరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనసులకు కులం ఉండదు, మతం ఉండదు కనుక అవి స్వేచ్ఛగా ప్రేమించేసుకుంటాయి. కానీ, మనుషులకు కులం ఉంటుంది, మతం ఉంటుంది. ప్రేమ-పెళ్లితో బంధంగా మారాలంటే అది అడ్డుపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక విరహగీతికగా సాగే పాట ఇది. రచనాశైలి దృష్ట్యా ఇందులో చోటు చేసుకున్న వస్తువైవిధ్యం, వస్తుగాంభీర్యత కూడా ఉదాత్తమైనవే. భారతదేశం అనేక మతాలకు నెలవు. అనేక కులాలకు పట్టుగొమ్మ. కులమతాలనే అనేక నదులు సంగమించిన మహాసాగరమే భారత దేశం. అందుకే ఈ ప్రేమ గీతావిష్కరణకు భారతదేశమంతటి మహా విస్తృతమైన నేపథ్యాన్ని ఊతంగా తీసుకున్నారు వేటూరి. ఈ దేశంలో పుట్టిన రామాయణం వంటి మహాకావ్యాన్ని మించిన ప్రేమగాథ లేదు. అంతకు మించిన విరహ గాథ కూడా లేదు. సీతారాములు అనుభవించిన ఎడబాటుని మించిన వియోగం ఏముంటుంది. అక్కడ అశోకవనంలో సీత, ఇక్కడ అడవుల్లో రాముడు... ఇద్దరి నడుమ దారి లేని సముద్రం. ఆ కడలి రాముడి మదిలో కొలువై వుంది, ఆ కడలి కెరటం సీతమ్మ కన్నుల్లో పొంగుతూ ఉంది. దాటలేని సముద్రం కూడా దాటించే వార ధి నిర్మించిన సంకల్ప బలమే ప్రేమ. అదే ప్రేమకున్న శక్తి. దాన్ని ‘జానకి కన్నుల జలధి తరంగం... రాముని మదిలో విరహ సముద్రం... చేతులు కలిపిన సేతు బంధనం... ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం... అంటూ ఈ గీత రచనకు నాంది, ప్రస్తావన చేశారు వేటూరి. సీతారాముల ప్రణయంలోని అచంచలమైన శక్తి నేటికీ ప్రేమమూర్తులుగా ఆ ఇద్దరినీ పూజింపచేస్తోంది కాబట్టే, నేటికీ రామాయణం ఆసేతుహిమాచలం పాడుకునే నిత్య పారాయణం అయింది. మూడు సముద్రాలు ఒకటిగా కలిసేచోటు, కనిపించే చోటు కన్యాకుమారి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంలోని ఈ పాటలో... కన్యాకువూరి నీ పదవుులు నేనే.../ కడలి కెరటమై కడిగిన వేళ... అంటూ భౌగోళికంగానూ, పాత్రపరంగా భావ గర్భితంగానూ రాయడం వేటూరిగారికే చెల్లింది. అలాగే భౌగోళికంగా చూస్తే... దేశ పటంలో కన్యాకుమారి ప్రాంతం అడుగున ఉంటుంది. దేశాన్ని మాతృమూర్తిగా ఆరాధించే మన సంప్రదాయాన్ని అనుసరించి అది పవిత్రమైన మాతృపాదాలతో సమానం. అందుకే ఆ ప్రాంతాన్ని... భారత భారతి పద సన్నిధిలో.../ కులవుత సాగర సంగమ శృతిలో... అంటూ మాతృవందనం చేసి ధన్యులయ్యారు వేటూరి. అంతేకాదు ఈ ప్రాంతంలోనే వారధి నిర్మించి రాముడు రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మను వెనుకకు తెచ్చుకున్నాడన్నది చారిత్రకం. అందుకే పాట మొదట్లో రామాయణ ప్రస్తావన. పాట రాయడానికి పదాలు తెలిస్తే చాలును. కాని ఉదాత్తమైన పాట రాయడానికి మాత్రం... పురాణాలు, చరిత్ర, భౌగోళిక ం, దేశ కాలమాన పరిస్థితుల మీద అవగాహన ఎంత అవసరమో ఈ పాట గుర్తు చేస్తుంది. అందుకే ఈ పాట ప్రణయగీతాలన్నింటి వరుసలో గురుస్థానంలో నిలుస్తుందన్నది నా స్థిర అభిప్రాయం.