తాము చేస్తున్నది నటన అని నటీనటులకు తెలుసు. దర్శకుడు చెప్పింది చేయాలని కూడా తెలుసు. అయితే ఆ చెప్పింది తమ కంఫర్ట్ లెవల్‌లో చేయాలని అనుకుంటే అందుకు ఒక ఎక్స్‌పర్ట్ కావాలి. ప్రేమ సన్నివేశాలు, శోభనం సన్నివేశాలు, సన్నిహిత సన్నివేశాలు ఇప్పుడు కథల్లో పెరిగాయి. చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ‘డాన్స్ కొరియోగ్రాఫర్‌లు’ ఉన్నట్టుగానే ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్‌లు’ ఎందుకు లేరు అనుకున్నారు ఆస్థా ఖన్నా. భారతదేశపు తొలి ‘ఇంటిమసి కో ఆర్డినేటర్’గా ఇప్పుడు ఆమె ఒక కొత్త ఉపాధి మార్గాన్ని చూపుతున్నారు.
‘మీ టూ’ ఉద్యమం వచ్చే వరకూ ప్రపంచ సినిమా మేకింగ్ ఒకలా ఉండేది. ‘మీ టూ’ వచ్చాక మారిపోయింది. సన్నిహిత సన్నివేశాలలో నటించేటప్పుడు ఆ నటక ఏదైనా తప్పు సంకేతం ఇస్తే అపార్థాలు జరిగి సమస్య ఉత్పన్నం కావచ్చునని ముఖ్యంగా మగ నటులు భావించడం మొదలెట్టారు. మరో వైపు ఓటిటి ప్లాట్‌ఫామ్స్ వల్ల, మారిన సినిమా ధోరణుల వల్ల ‘సన్నిహిత’ సన్నివేశాలు విపరీతం గా పెరిగాయి. సన్నిహితమైన కంటెంట్‌తోటే కొన్ని వెబ్ సిరీస్ జరుగుతున్నాయి. ప్రేక్షకులు భిన్న అభిరుచులతో ఉంటారు. వీరిని ఆకర్షించడానికి రకరకాల కథలు తప్పవు. అయితే ఇలాంటి కథల్లో ఏ చిక్కులూ రాకుండా ఉండేందుకు, నటీనటులు ఇబ్బంది లేకుండా నటించేందుకు సెట్‌లో ఉండి తగిన విధంగా సూచనలు ఇస్తూ బాధ్యత తీసుకునే కొత్త సినిమా క్రాఫ్ట్‌వారు ఇప్పుడిప్పుడే మొదలయ్యారు. వీరిని ‘ఇంటిమసీ కోఆర్డినేటర్లు’ లేదా ‘ఇంటిమసీ కొరియోగ్రాఫర్లు’ అంటున్నారు.
బాలీవుడ్‌లో ఒక మహిళ మొట్టమొదటిసారి సర్టిఫైడ్ ఇంటిమసి కోఆర్డినేటర్ అయ్యింది. ఆమె పేరు ఆస్థా ఖన్నా. ముంబైలోని ‘ఇంటిమసీ ప్రొఫెషనల్ అసోసియేషన్’ ద్వారా శిక్షణ, సర్టిఫికెట్ పొందిమరీ ఈమె ఈ రంగంలోకి వచ్చారు. నిజంగా ఇదొక విశేషమైన వార్త. సగటు సమాజ భావజాలంలో ఒక స్త్రీ ఇలాంటి ఉపాధి ఎంచుకోవడం విశేషమే.
ఎవరీ ఆస్థా చద్దా
ఆస్థా చద్దా లండన్‌లో చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి బాలీవుడ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ మధ్య హిట్ అయిన ‘అంధా ధున్’కు పని చేసింది. భారతదేశంలో తయారయిన ‘మస్త్ రామ్’ అనే వెబ్ సిరీస్‌కు ‘ఇంటిమసీ కోఆర్డినేటర్’గా ఆస్ట్రేలియాకు చెందిన అమండా కటింగ్ వచ్చి పని చేసింది. ఆ సంగతి ఆస్థా చద్దా తెలుసుకుంది. అదీ గాక తాను పని చేసిన సినిమాలలో సన్నిహిత సన్నివేశాల చిత్రీకరణ సమయం లో నటీనటులు, దర్శకుడు ఏదో ఒక ‘తక్షణ ఆలోచన’తో పని చేస్తున్నట్టుగా ఆమెకు అనిపించింది. నిజానికి సన్నిహిత సన్నివేశాలు అప్పటికప్పుడు ఆలోచించి చేసేవి కావు. వాటికి ప్రత్యేక సూచనలు, జాగ్రత్తలు అవసరం. ఆ ఖాళీ భారతీయ సినిమారంగంలో ఉందని ఆస్థా అర్థం చేసుకుంది. వెంటనే తాను శిక్షణ పొంది ఇంటిమసి కోఆర్డినేటర్‌గా ఉపాధి ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌లో తయారవుతున్న మూడు నాలుగు వెబ్ సిరీస్‌కు పని చేసింది ఆస్థా.
వీరేం చేయాలి?
హీరో హీరోయిన్లుగాని, కేరెక్టర్ ఆర్టిస్టులు కాని వివిధ సందర్భాలకు తగినట్టుగా సన్నిహితంగా నటించాలి. అయితే ఇద్దరూ భిన్న నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు. ఎంత అది నటన అయినా దానికి ఇబ్బంది పడే వీలు ఎక్కువ. కొందరు అదుపు తప్పి వ్యవహరించవచ్చు కూడా. వీటన్నింటిని ‘ఇంటిమసి కోఆర్డినేటర్లు’ పర్యవేక్షిస్తారు. దుస్తులు, కెమెరా యాంగిల్స్, నటీనటుల మూవ్‌మెంట్స్ వీరే గైడ్ చేస్తారు. ‘నటీనటులకు తగ్గట్టు అవసరమైతే డూప్స్‌ను వాడటం, వారి శరీరాలు దగ్గరగా ఉన్నా ఇద్దరి మధ్య కొన్ని అడ్డంకులు ఉంచడం, ఎంతవరకు సీన్‌కు అవసరమో అంతవరకూ నటించేలా చూడటం మా పని’ అంటుంది ఆస్థా ఖన్నా. ఏ సన్నివేశాలలో ఏ నటీనటులైతే నటించాలో వారితో ముందు వర్క్‌షాప్ నిర్వహించడం కూడా ఆస్థా పని. ‘దానివల్ల నటీనటులు తీయవలసిన సీన్‌కు ప్రిపేర్ అవుతారు. చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటుందామె.
పిల్లల రక్షణ కూడా
ఇంటిమసీ కోఆర్డినేటర్‌లు షూటింగ్‌లో పాల్గొనే పిల్లలతో తోటి నటుల ‘స్పర్శ’ను కూడా గమనిస్తారు. తండ్రి పాత్రలు వేసేవారు కుమార్తెగా లేక కుమారుడిగా నటించే పిల్లలతో నటించేటప్పుడు ఆ పిల్లలు ఎంత కంఫర్ట్‌గా ఉన్నారు, ఆ టచ్‌లో ఏదైనా దురుద్దేశం ఉందా ఇవన్నీ కూడా ఇంటిమసీ కోఆర్డినేటర్లు గమనించి పిల్లలకు సూచనలు ఇస్తారు. ‘వాళ్లు ఇబ్బంది పడే సన్నివేశానికి నో చెప్పడం మేము నేర్పిస్తాం’ అంటుంది ఆస్థా ఖన్నా.
శరీరాలు ఇబ్బంది పడే సన్నివేశాలంటే కేవలం అత్యాచార సన్నివేశాలే కాదు... బైక్ మీద హీరోను కరుచుకుని కూచోవాల్సిన సమయంలో కూడా ఆ నటికి ఇబ్బంది ఉండొచ్చు. లేదా నటుడికి ఇబ్బంది ఉండొచ్చు. ఆ సమయంలో ఇంటిమసి కోఆర్డినేటర్లు తగిన జాగ్రత్తలు చెప్పి షూట్ చేయిస్తారు. గతంలో ఫలానా సన్నివేశంలో నటించడానికి ఇబ్బంది పడి షూటింగ్ మానేసిన తారలు ఉన్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లుగా స్త్రీలు ముందుకు రావడం వల్ల తమ ఇబ్బందులు వారితో షేర్ చేసుకునే వీలుంది. వీరు డైరెక్టర్‌తో చెప్పి షూటింగ్ సజావుగా అందరి ఆమోదంతో జరిగే విధంగా చూసే వీలు ఉంది.
చూడబోతే మున్ముందు ఆస్థా ఖన్నా వంటి ప్రొఫెషనల్స్ అవసరం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఉపాధిని కనిపెట్టడమే కాదు దానిని గౌరవప్రదంగా నిర్వహించడం కూడా ఈ తరం తెలుసుకుంటోంది. దానిని మనం స్వాగతించాలి.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment