అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు | His shadow lay a foundation for their lives! | Sakshi
Sakshi News home page

అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు

Published Sun, Jun 15 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు

అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు

పుట్టుకతో మనిషికి కొన్ని బంధాలు ఏర్పడుతాయి. కానీ పుడుతూనే కొందరికి అన్ని బంధాలూ తెగిపోతాయి. జన్మనిస్తూ తల్లి మరణిస్తుంది. కళ్లు తెరిచేలోపే కన్న తల్లిదండ్రుల్ని మృత్యువు లాక్కెళ్లిపోతుంది. కారణాలు ఏవైతేనేం... పసిగుడ్డుగా ఉన్నప్పుడే బతుకు కుప్పతొట్టి పాలవుతుంది. అలాంటివారికి తమకంటూ చెప్పుకోవడానికి ఏ బంధం ఉంటుంది? ఏ బాంధవ్యం ఒడిలో చేర్చుకుని, గుండెల్లో పొదువుకుని పెంచుతుంది? ఈ ఆలోచన ఒక వ్యక్తిని వేలాదిమందికి తండ్రిని చేసింది. అతడి నీడలో వారి జీవితాలకు పునాది వేసింది!
 
‘‘నాన్నా... నాకు నాన్న లేడా?’’... ఆ ప్రశ్న వింటూనే అదోలా అయిపోయింది విద్యాకర్ మనసు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూండిపోయారు. ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేని చిన్నారి అభిలాష్ ఏడుస్తూ నిలబడ్డాడు. ‘‘చెప్పండి నాన్నా... నాకు నాన్న లేడా?’’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అతడిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నారు విద్యాకర్. నీకు నాన్న లేడని ఆ చిన్నారికి చెప్పలేరాయన. ఎందుకంటే అతడు తననే తండ్రి అనుకుంటున్నాడు. ఉన్నాడు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆ బాబు తండ్రెవరో తనకు కూడా తెలియదు కాబట్టి!
    
మార్చి 27, 1994. చెన్నైలోని అన్నానగర్‌లో ఉండే విద్యాకర్‌కి ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వింటూనే విద్యాకర్ హడావుడిగా స్కూటర్ వేసుకుని బయలుదేరారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన గుర్తుల ఆధారంగా ఓ కుప్పతొట్టి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి ఆయన మనసు కరిగి నీరయ్యింది. కుప్ప తొట్టిలో... కళ్లు కూడా తెరవని ఒక పసికందు పడివుంది. చీమలు కుడుతుంటే గుక్కపట్టి ఏడుస్తోంది. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా కందిపోయింది. విద్యాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తారు. తక్షణ చికిత్స చేయించి ఆ శిశువును కాపాడారు. తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్లారు. అభిలాష్ అని పేరుపెట్టి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అతడే అభిలాష్.
 
ఊహ తెలిసేనాటికి తాను ఎవరి చేతుల్లో ఉన్నాడో అతడే తండ్రి అనుకున్నాడు అభిలాష్. బడిలో చేరిన తరువాత తెలిసింది తన అప్లికేషన్ ఫామ్‌లో తండ్రి అనే కాలమ్ ఖాళీగా ఉంది అని. అది తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్లి తను నాన్నా అని పిలిచే విద్యాకర్‌ని నిలదీశాడు. తర్వాత మెల్లగా నిజం తెలుసుకున్నాడు. నాన్న కాని ఆ నాన్నకు పాదాభివందనం చేశాడు. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉంటాడు. కుప్పతొట్టిలో దొరికిన తనకు కొడుకు స్థానాన్ని ఇచ్చిన విద్యాకర్ రుణం తీర్చుకోలేనంటాడు కన్నీళ్లతో.
 
ప్రస్తుతం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేరవు తున్నాడు అభిలాష్. నిజానికి అతడే కాదు. అతడిలా విద్యాకర్ ప్రేమలో తడిసి విరబూసిన కుసుమాలు చాలానే ఉన్నాయి. ఆ గుబాళింపు తెలియాలంటే... చెన్నైలో ఉన్న ‘ఉదవుమ్ కరంగళ్’కు వెళ్లాలి.
 
అది ప్రేమ ప్రపంచం...


కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలను విసు క్కుంటూ ఉంటారు. కానీ ‘ఉదవుమ్ కరంగళ్’లో ఉండే ఏ చిన్నారినీ విద్యాకర్ ఒక్కసారి కూడా విసుక్కుని ఉండరు. వాళ్లని చూస్తేనే ఆయన మనసులో ప్రేమ పొంగి పొరలుతుంది. ఎక్కడెక్కడినుంచో ఆ పిల్లలను తీసుకొచ్చా రాయన.
 
తల్లిదండ్రుల్ని కోల్పోయినవాళ్లు, కుప్పతొట్టి లోనో రోడ్డు పక్కనో దారుణమైన స్థితిలో పడివుండి పసికందులుగా దొరికిన వాళ్లు... ఎక్కడ ఓ చిన్నారి కనిపించినా అక్కున చేర్చు కుంటారాయన. వారి కోసమే ‘ఉదవుమ్ కరంగళ్’ను స్థాపించారు.
 
విద్యాకర్ పుట్టింది మంగుళూరులో. పద మూడేళ్ల వయసులో అనుకోకుండా రామకృష్ణ అనే వ్యక్తిని ఓ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఓసారి ఆయనను కలుసుకోవడానికి చెన్నై కూడా వెళ్లారు. అప్పుడే ఆయనకు సమాజం కోసం బతకడమంటే ఏంటో తెలిసింది తొలిసారి. రామకృష్ణ సమాజ సేవ చేసేవారు. ఆయనను చూసి స్ఫూర్తిపొందిన విద్యాకర్... స్థానికంగా కుష్టురోగుల కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో చేరారు. సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ క్రమంలో ఓరోజు... ఒక రిక్షా కార్మికుడు ఒక పసిబిడ్డను తీసుకుని విద్యాకర్ దగ్గరకు వచ్చాడు. సినిమా హాల్లో దొరికిందని చెప్పి, విద్యాకర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు.

ఆ బిడ్డకు ఓ నీడ కల్పించాలని చాలా ప్రయత్నించారు విద్యాకర్. కానీ ఎవరూ సహకరించలేదు. దాంతో ఆయన మనసు కదిలిపోయింది. దిక్కులేని బిడ్డను సాకేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, ఇలాంటి పిల్లలందరి పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన ఆయన ‘ఉదవుమ్ కరంగళ్ (సాయం చేసే చేతులు)’కు పునాది వేశారు.

నాటి నుంచి తన సంస్థ ద్వారా ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకున్నారు విద్యాకర్. వాళ్లంతా తనను ‘నాన్నా’ అని పిలుస్తుంటే ఆయన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆయన చేతులు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి.
 
- సమీర నేలపూడి
 
‘ఉదవుమ్ కరంగళ్’ను 1983లో స్థాపించారు విద్యాకర్. మొదట అనాథ శిశువుల సంరక్షణ కోసమే పెట్టినా... తరువాత సంస్థను పలు సేవా కార్యక్రమాల దిశగా విస్తరించారాయన. వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను చేరదీసి చికిత్స చేయిస్తున్నారు. ఎయిడ్ వ్యాధిగ్రస్తులను కూడా చేరదీస్తున్నారు. వీరందరికీ ఆవాసం కల్పించేందుకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు విద్యాకర్. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది వందలకు పైగా మానసిక వికలాంగులు, నాలుగు వందల మందికి పైగా ఎయిడ్‌‌స వ్యాధిగ్రస్తులు, యాభై మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అదే విధంగా ఆరు వందల మందికి పైగా  అనాథ పిల్లలున్నారు. వీరిలో నెల రోజుల నుంచి ఇరవయ్యేళ్ల వయసు ఉన్నవారి వరకూ ఉన్నారు. అందరూ విద్యాకర్‌ని ‘పప్పా (నాన్నా)’ అనే పిలుస్తారు. ఎవరూ అనాథలుగా ఫీలవకూడదన్న ఉద్దేశంతోనే అలా పిలవడం అలవాటు చేశారు విద్యాకర్. అందరికీ చదువు చెప్పిస్తున్నారు. అది కూడా ఎవరికి నచ్చిన కోర్సు వాళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి మనసే ఆయనను అందరికీ ఆప్తుడిగా మార్చింది. ఆయన ఖ్యాతిని విదేశాల వారు సైతం గుర్తించేలా చేసింది!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement