
జనాభా దామాషాతో చేపడితే దక్షిణాది రాష్ట్రాలు గళం కోల్పోతాయి: రేవంత్‌రెడ్డి
తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దామని ప్రతిపాదన
ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ సభను ఏర్పాటు చేస్తామని వెల్లడి
సాక్షి, చెన్నై: నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడుదామని, అసమగ్ర పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందించారు. సమావేశంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘ప్రస్తుతం దేశం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. జనాభాను నియంత్రించాలని 1971లో దేశం నిర్ణయించినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే.. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు విఫలమయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్ధి సాధించాయి. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయి.
ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ నిధులు
దక్షిణాది రాష్ట్రాలు దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ కూడా తక్కువ మొత్తాన్ని తిరిగి పొందుతున్నాయి. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే.. 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు అందుతున్నాయి. బిహార్‌కు ఆరు రూపాయల ఆరు పైసలు, మధ్యప్రదేశ్‌కు రూపాయి 73 పైసలు వెనక్కి పొందుతున్నాయి.
అదే కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణ 41 పైసలు, కేరళ 62 పైసలు మాత్రమే వెనక్కు పొందుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు, పన్నుల వాటా చెల్లింపులు క్రమంగా తగ్గుతున్నాయి. చివరికి జాతీయ ఆరోగ్యమిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60– 65 శాతం నిధులు దక్కుతున్నాయి.
అలా పునర్విభజనను ఒప్పుకోం..
మనది ఒకే దేశం.. దానిని గౌరవిస్తాం.. కానీ జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించం. అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అధికారాన్ని కుదిస్తుంది. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలకు శిక్షగా మారుతుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్ధతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ గళం కోల్పోతాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా బీజేపీని అడ్డుకుందాం. దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలి.
వాజ్‌పేయి విధానాన్ని అనుసరించండి..
ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర కూడా ఉంది. ఈ దృష్ట్యా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచకుండా ఏ విధంగా పునర్విభజన ప్రక్రియ జరిపిందో.. ఆ విధానాన్నే ఇప్పుడు అనుసరించాలి. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అదే తరహాలో ప్రారంభించింది. ఇప్పుడు అదే విధానాన్ని పాటించేలా.. మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో, సంఖ్యలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.
ఈ అంశంపై తర్వాతి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిద్దాం. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనే అంశంపై ఆ సమావేశంలో చర్చిద్దాం. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తాం..’’అని రేవంత్ చెప్పారు.
చెన్నై శ్రీకారం.. హైదరాబాద్ ఆకారం: రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిని గౌరవిస్తామని.. రాజకీయాల్లోనైనా, విద్యావ్యవస్థలోనైనా పెత్తనాన్ని మాత్రం సహించబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తి ప్రకారం హక్కుల సాధనలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా పోస్టు చేశారు. ‘‘ఈ పుణ్యభూమి అంబేడ్కర్ మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్ల సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని, సమాన హక్కులను పొందింది.
కేవలం రాజకీయ ప్రయోజన కాంక్షతో పునర్విభజనను అస్త్రంగా ప్రయోగించి ఆ హక్కులను విచ్చిన్నం చేస్తామంటే మౌనంగా ఉండలేం. ఉత్తరాదిని గౌరవిస్తాం.. దక్షిణాది హక్కుల విషయంలో రాజీపడం. ఈ ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టింది. ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుంది’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment