
ములుగు, సాక్షి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రె గుట్టలను భద్రతా బలగాలు పూర్తిగా స్వాధీనపర్చుకున్నాయి. మావోయిస్టుల కోసం అన్నివైపులా నుంచి గాలింపు కొనసాగిస్తున్నాయి. వేల సంఖ్యలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. ఆపరేషన్ కగార్‌లో భాగంగా పది రోజులుగా సాయుధ బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
కర్రెగుట్టలలో 20వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో కర్రెగుట్టలో పై భాగంలో బేస్ క్యాంపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్యాంప్‌లో 10 వేల మంది సిబ్బంది భాగం అవుతారని సమాచారం. ఇప్పటికే ఈ క్యాంపు సమీపంలో భారీ సెల్ టవర్స్ నెలకొల్పారు. అలాగే.. బేస్ క్యాంపు వద్దకు డాగ్ స్క్వాడ్, మైన్ ప్రూఫ్ చేరుకోగా.. భారీగా ఆయుధాలలను తరలించారు.
కర్రేగుట్టలోని దోబి కొండ నీలం సారాయి కొండలను పూర్తిగా సీఆర్‌పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ పది రోజుల్లో మావోయిస్టుల జాడ లభ్యం కాకపోవడం గమనార్హం. ఒకవైపు కర్రెగుట్టని మావోయిస్టులు ఖాళీ చేసి సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయి ఉంటారని ఏజెన్సీలో ప్రచారం భారీ ఎత్తున జరుగుతోంది. మరోవైపు భద్రతా బలగాలు మాత్రం మావోయిస్టులు వదిలేసిన బంకర్లు, షెల్టర్ జోన్లను బలగాలు గుర్తించాయి. దీంతో భూగర్భంలో రహస్య స్థావరాలలో దాక్కుని ఉంటారని భావిస్తున్నాయి. అందుకు నిటారుగా ఉన్న కర్రెగుట్టలే కారణమని చెబుతున్నాయి. ఈ క్రమంలో.. మావోయిస్టులు స్థావరాల నుండి బయటకి వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నాయి.