
దేశాన్ని నడిపిస్తున్న రాష్ట్రాలకు అన్యాయం: కేటీఆర్
జనాభా దామాషాతో డీలిమిటేషన్‌తో నియంతృత్వంవైపు అడుగులు
దేశంలో ఓ ప్రాంతం మరో ప్రాంతంపై ఆధిపత్యం చలాయించేలా ఉండొద్దు
అభివృద్ధి సాధించిన ప్రాంతాలను ప్రోత్సహించాలే తప్ప శిక్షించవద్దని వ్యాఖ్య
సాక్షి, చెన్నై: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొత్త కాదని.. ఈ మధ్యకాలంలో ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం ప్రారంభించిన బుల్లెట్ రైలు వంటి ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికే పరిమితం కావడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత పెంచేలా డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిందని మండిపడ్డారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా చెన్నైలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే..
‘‘కేసీఆర్ ఆధ్వర్యంలో 14 ఏళ్లపాటు తెలంగాణ ఉద్యమం నడిపాం. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలు స్ఫూర్తిగా తీసుకున్నాం. అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు స్ఫూర్తినిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టబోతున్న నియోజకవర్గాల పునర్విభజనతో అనేక నష్టాలు ఎదురవుతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలతో దక్షిణాదికి అనేక నష్టాలు జరుగుతున్నాయి. అందరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. కానీ దేశ అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలకు నష్టం కలిగిస్తూ, దేశాన్ని వెనక్కి నెడుతున్న రాష్ట్రాలకు లాభం చేకూర్చే విధంగా ఈ డీలిమిటేషన్ విధానం ఉంది.
నియంతృత్వంవైపు దారి తీస్తుంది..
దేశంలో ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంపై ఆధిపత్యం చలాయించే విధంగా ఉండరాదన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇది కేవలం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వ్యవహారం కాదు.. అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, ప్రాంతాలకు నష్టం జరుగుతున్న అంశం. పరిపాలన, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయి.
దేశ జీడీపీలో 36 శాతం భాగస్వామ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయి. డీలిమిటేషన్ అంశం కేవలం పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గడానికే పరిమితం కాదు. ఆర్థికపరమైన నిధుల కేటాయింపులో కూడా తీవ్ర నష్టం జరగబోతోంది. నిధుల కేటాయింపులో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు పరిస్థితులు దారి తీసే అవకాశం ఉంది.
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం..
కేవలం జనాభా ఆధారంగా పార్లమెంటు సీట్ల పెరుగుదల జరిగితే దేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది. అందరం భారతీయులమే. కానీ మనందరికీ, ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అస్తిత్వం ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. విభిన్న భాషలు, సాంçస్కృతిక అస్తిత్వాలతో కూడిన ఒక సమాఖ్య దేశం మనది అన్నది గుర్తుంచుకోవాలి.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే 2047 నాటికి సూపర్ పవర్ కావాలంటే.. అభివృద్ధి సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహం లభించాలి. అంతేతప్ప శిక్షించకూడదు. డీలిమిటేషన్ అనేది ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి వంటి అంశాలపైనే జరగాలి. ఇంత నష్టం జరుగుతున్నా మాట్లాడకుంటే చరిత్ర క్షమించదు.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment