abhilash
-
‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి.. యువకుడు..
సాక్షి, కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు మోయతుమ్మెద వాగు(ఎల్ఎండీ బ్యాక్ వాటర్)లో దూకిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటకు చెందిన సందెబోయిన అభిలాష్ అలియాస్ టింకు బుధవారం రాత్రి రేణికుంట శివారులోని రాజీవ్ రహదారి బ్రిడ్జి పైనుంచి ఎల్ఎండీ బ్యాక్ వాటర్‌లో దూకాడు. అంతకుముందు తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అభిలాష్ ఆచూకీ దొరకలేదని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం! -
'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్ విద్యార్థి?
సాక్షి, కరీంనగర్: అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థి పడాల అభిలాష్(20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి పడాల రమేశ్–రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు అభిలాష్ కరీంనగర్‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇతడి తల్లి, నానమ్మ ఇంట్లో తరచూ గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు జరిగితే తమ పరువు పోతుందని ఇద్దరికీ చెప్పాడు. గొడవలు పెట్టుకోవద్దని సూచించాడు. అయినా, అత్తాకోడళ్లు ఇదేమీ పట్టించుకోలేదు. తీవ్రమనస్తాపం చెందిన అభిలాష్ తన ఇంటి సమీపంలో పత్తి చేనులోకి వెళ్లాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com Follow the Sakshi TV channel on WhatsApp: -
అసాధారణ ప్రయాణం
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వంలో జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్ నిర్మించాయి. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ, తమిళ ట్రైలర్స్‌ని హీరోలు నాగార్జున, షారుక్ ఖాన్, మోహన్ లాల్, సూర్య విడుదల చేశారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’ ఒక అసాధారణ ప్రయాణం. గొప్ప పాత్రలు, క్లిష్టమైన కథతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు జీ స్టూడియోస్ సౌత్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్. -
పరారీలో రామాంజనేయ చౌదరి
ఒంగోలు టౌన్: గిరిజన యువకుడిని చితక బాది, అతడి మీద మూత్రం పోస్తూ సెల్ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించిన కేసులో ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి పరారయ్యాడు. మిగతా నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 19వ తేదీన ఈ సంఘటన జరగ్గా, వారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు. రామాంజనేయ చౌదరి నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఒంగోలు పరిసరాల్లోనే ఒక ప్రతిపక్ష నాయకుడి రక్షణలో ఉన్నట్లు సమాచారం. ఆ నాయకుడి సలహా మేరకు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా వీడియోను లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి, బాధితుడైన మోటా నవీన్‌పై పలు కేసులున్నాయి.ఇద్దరూ దొంగతనాలు, రాబరీ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. డబ్బు పంపకాల్లో వీరి మధ్య విభేదాలున్నాయి. నవీన్ కొద్దికాలంగా ఓ మైనర్ బాలికను వేధించడం మొదలెట్టాడు. ఆ బాలికను ఓసారి కిడ్నాప్ చేశాడు. దీంతో నవీన్‌పై పోక్సో కేసు నమోదైంది. ఆ బాలికను అభిలాష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, నవీన్ ఆ బాలికను వేధిస్తుండడంతో ఆమె సోదరుడు ఈ విషయాన్ని అభిలాష్ కు చెప్పాడు. నవీన్‌కు గుణపాఠం చెప్పాలని రామాంజనేయ చౌదరితో కలిసి వారు పథకం రచించారు. గత నెల 19న ప్రభు, నరేంద్ర ఉరఫ్ టిల్లుతో కలిసి రామాంజనేయ చౌదరి నవీన్ ఇంటికి వెళ్లాడు. అందరూ అక్కడ మద్యం తాగారు. అనంతరం బాలిక విషయంలో రాజీ చేసుకుందామని చెప్పి నవీన్, అతడి సోదరుడు రాజాను తీసుకెళ్లారు. ముక్తినూతలపాడు సమీపంలో కల్వరి టెంపుల్ వద్దకు రాగానే అక్కడ కాపు కాసి ఉన్న అభిలాష్, బాలిక సోదరుడు, మరో నలుగురు ఇనుప రాడ్లు, కర్రలతో నవీన్, రాజాను చితక్కొట్టారు. నెత్తురోడుతున్న అతనిపై రామాంజనేయ చౌదరి మూత్రం పోశాడు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న రాజా తల్లికి సమాచారమిచి్చ, సమీపంలోని పొగాకు కూలీల సహాయంతో 108లో నవీన్‌ను జీజీహెచ్‌కు తరలించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం: ఎస్పీ ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మర్లపాడుకు చెందిన రాయపాటి అభిలాష్, ఒంగోలు గోపాల్ నగర్‌కు చెందిన అప్పనబోయిన జయశంకర్, ఇస్లాంపేటకు చెందిన షేక్ సాదిక్ గపూ ర్తో పాటు బాలిక సోదరుడు, అతని స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రామాంజనేయ చౌదరి, చాపల ప్రభు, ఏకాంబరం నరేంద్ర పరారీలో ఉన్నారని చెప్పారు. -
‘పగ పగ పగ’ మూవీ రివ్యూ
టైటిల్: పగపగపగ నటీనటులు: కోటి, అభిలాస్ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు నిర్మాత : సత్య నారాయణ సుంకర దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్ సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా ఎడిటర్ : పాపారావు విడుదల తేది: సెప్టెంబర్ 22,2022 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ చిత్రం కథంతా 1985,90,2006వ సంవత్సరంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే.. ప్రాణాలు పోయినా సరే డీల్ పూర్తి చేస్తారు. ఒక పోలీసు హత్య కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. కానీ అతని కొడుకు అభి(అభిలాష్)ని మాత్రం చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. దానిని తెరపై చూపించడంలో, ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌లో కథ అంతగా రక్తి కట్టించదు. కాలేజీ ఎపిసోడ్ సరదాగాసాగుతుంది. అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్ కాస్త జగదీష్ ప్రసాద్‌గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఉహకు భిన్నంగా, టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కెరీర్లో మొదటి సారి విలన్ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ పాత్రకు న్యాయం చేశాడు. విలన్‌గా, కూతురికి మంచి నాన్నగా అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించాడు.సీరియస్, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవాతో పాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటీ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Khelo India University Games 2021: స్విమ్మర్ అభిలాష్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో హైదరాబాద్ స్విమ్మర్ చల్లగాని అభిలాష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. బెంగళూరులో జరిగిన ఈ గేమ్స్‌లో అభిలాష్ 4ని. 19.86 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి అభిలాష్ జేఎన్టీయూ తరఫున పాల్గొన్నాడు. -
ఆటే అభిలాష!
కందుకూరు రూరల్: స్కూల్‌కు వెళ్లిన తన బిడ్డ చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవడంతో నాన్నకు కోపం వచ్చింది.కందుకూరులోని టీఆర్ఆర్కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో పిల్లాడి కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో టీఆర్ఆర్ కళాశాల క్రీడామైదానం నుంచి ఇంటికి వస్తున్న కుమారుడిని చూసి కోపంఆపుకోలేక రోడ్డుపైనే అతన్ని కొట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఇదే జరిగింది. దీంతో కుర్రాడు ‘నాన్నా నేను క్రికెట్ బాగా ఆడుతున్నాను. ఇదిగో పేపర్లో కూడా పడ్డాను’ అని పేపరు చూపించడంతో కుమారుని టాలెంట్ తండ్రికి అర్థం అయింది. దామవరపు అభిలాష్ క్రికెట్లో జాతీయ స్థాయికి ఎంపికై అందరి మనన్ననలు అందుకుంటున్నాడు. కందుకూరు బృందావనంలో నివాసం ఉంటున్న దామవరపు గోవింద్–వెంకటలక్ష్మిలకు నలుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయి. వీరిలో మూడో సంతానం అభిలాష్. వీరి స్వగ్రామం తిమ్మపాలెం. తాపీ మేస్త్రీగా తండ్రి పని చేస్తుంటాడు. తిమ్మపాలెం గ్రామీణ ప్రాంతం కావడంతో పిల్లలను చదివించుకోడానికి తొమ్మిదేళ్ల క్రితం కందుకూరు వచ్చారు. అభిలాష్ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విజ్ఞాన్విహార్లో చదివాడు. మూడో తరగతి చదువుతున్న సమయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు టీఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. అక్కడ అభిలాష్ బౌలింగ్ విధానం చూసి ఎంపిక చేశారు. తాను ఎంపికైన విషయాన్ని తండ్రికి చెప్పినా ఆటలు వద్దు.. క్రికెట్ వద్దు.. చదుకోరా అని మందలించాడు. అయినా అభిలాష్‌కు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని తగ్గలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు ఎంపికైన అభిలాష్‌ను పంపించాలని కోచ్ వచ్చి తల్లిదండ్రులను అడిగినా పంపించలేదు. రాష్ట్ర స్థాయి ఉత్తమ బౌలర్‌గా అవార్డు అందుకుంటున్న అభిలాష్ ఎక్కడకు వెళ్లినా బెస్ట్.. 6వ తరగతికి అభిలాష్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చేరాడు. 7వ తరగతిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్–12 జిల్లా ఎంపికలు నిర్వహించగా జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. కోచ్ సుధాకర్ తండ్రికి అవగాహన కల్పించి క్రికెట్ ఆడేలా చేశారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు సార్లు పాల్గొని ఒక సారి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా తరఫున నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐదు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది ఓవర్లు వేసి ఏడు వికెట్లు తీసుకున్నాడు. 38 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. రాష్ట్ర ఉత్తమ బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. అదే విధంగా ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు మహారాష్ట్రలోని కోప్రాగాన్ జరిగిన జాతీయ స్థాయి పోటీలో అభిలాష్ ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆడాడు. ఈ పోటీల్లో ఐదు మ్యాచ్‌లు ఆరు వికెట్లు, మూడు క్యాచ్‌లు, రెండు రన్ ఔట్లు, ఒక మేడిన్ ఓవర్ వేసి జాతీయ స్థాయిలో 14వ స్థానంలోకి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ బెస్ట్ బౌలర్‌గా, బెస్ట్ ఫర్మామెన్స్ ప్రశంసలు అందుకున్నాడు. ఇలా క్రికెట్లో జిల్లా స్థాయిలో కూడా అనేక మార్లు ఆడాడు. ఎక్కడైనా క్రికెట్ టోర్నమెంట్ పెట్టారంటే అభిలాష్‌ను పోటీపడి తీసుకుపోతుంటారు. అనేక పతకాలు, కప్పులు సాధించాడు ఈ బుడతడు. ఆర్థిక పరిస్థితులే సమస్య.. తండ్రి గోవిందయ్య బేల్దారీగా ఉంటూ ఇద్దరు కుమార్తెలు ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. ఇద్దరి కుమారులను కూడా చదివిస్తున్నాడు. భారం అయినప్పటికీ అభిలాష్ ప్రతిభను పక్కన పెట్టలేక తనకు ఇష్టమైన క్రికెట్లో ప్రోత్సహిస్తున్నాడు. ఒక జత షూ కొనాలంటే ’ 10,500 అవుతున్నాయి. మంచి బ్యాట్ కొనుగోలు చేయాలంటే రూ. 10వేలకు పైగానే ఉంటుంది. ఇలా క్రీడా దుస్తులు, బాల్, జిల్లా స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లాలంటే సొంత ఖర్చులతో వెళ్లాల్సిన పరిస్థితి. ‘ఏ మ్యాచ్‌కు వెళ్లిని వెంట వెళ్తాను. బాగా ప్రోత్సహిస్తున్నప్పటికీ ఆటకు కావాల్సిన పరికరాలు మాత్రం ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికి లక్ష రూపాయిల వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాల తరఫున హెచ్ఎం, ఉపాధ్యాయులు పది వేల రూపాయిలు జమ చేసి అభిలాష్‌కు అందజేస్తున్నాం’ అని హెచ్ఎం డి.అనూరాధ తెలిపారు. రంజీల్లో రాణించాలని ఉంది:దామవరపు అభిలాష్ క్రికెట్లో జాతీయ స్థాయి వరకు ఇప్పటికి రెండో సారి ఆడబోతున్నా. రంజీల్లో ఆడనే కోరిక ఉంది. మా కోచ్‌లు బాగా తర్ఫీదు ఇస్తున్నారు. మా నాన్న మొదటిలో క్రికెట్ ఆడద్దన్నా ఇప్పుడు బాగా ప్రోత్సహిస్తూ నా వెంటే ఉంటున్నాడు. నాకు ఎలాంటి లోటు లేకుండా క్రికెట్ దగ్గరుండి ఆడిస్తున్నాడు. -
ప్రాణం తీసిన బిల్లు వివాదం
ముషీరాబాద్: మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన అభిలాష్ హైదరాబాద్‌కు వచ్చి రాంనగర్లో ఉంటూ జొమాటో కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వంశీ ఇటీవల ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 24న రాంనగర్లో ఉంటున్న తమ స్నేహితుడు హరీష్ గదికి వెళ్లారు. వంశీ స్నేహితుడు చంద్రకాంత్ కూడా అక్కడికి రావడంతో నలుగురు కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా వంశీ పుట్టినరోజు విషయం గుర్తుకు రావడంతో అందరూ కలిసి రాంనగర్‌లోని ఓ బేకరీకి వెళ్లి కేక్ కట్‌చేశారు. అనంతరం మరో రెస్టారెంట్‌కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్‌కు వెళ్లి బిర్యాని తిన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ వచ్చినందున అదనంగా రూ.600 ఖర్చయ్యిందని అభిలాష్ అనడంతో మనస్తాపానికి లోనైన చంద్రకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వంశీ అభిలాష్‌తో వాగ్వాదానికి దిగడంతో అందరూ కలిసి అక్కడినుంచి హరీష్ గదికి వెళ్లిపోయారు. అక్కడ కూడా వాగ్వాదం కొనసాగడంతో అభిలాష్ వంశీపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికిలోనైన వంశీ అభిలాష్‌ను బలంగా నెట్టివేయడంతో తల నేలకు తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మిగతా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
భవిష్యత్‌లో తీసుకుంటా
అభిలాష్ వాడాడ హీరోగా, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. ‘రెయిన్ చెక్‘ అంటే ఇచ్చిన ఆఫర్‌ను భవిష్యత్‌లో తీసుకుంటాను అని అర్థం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండటం విశేషం. ఆకెళ్ల పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆఫీస్ నేపథ్యంలో నడిచే చిత్రమిది. లవ్ , అడ్వెంచర్, పెయిన్, ఫన్.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. మా నటీనటులు రియల్‌గా అడ్వెంచర్ చేయటం విశేషం. హాలీవుడ్ చిత్రాల సమర్పకులు ఆండీ కొహెన్కి మా సినిమా నచ్చడంతో అంతర్జాతీయ భాషలలో చిత్రీకరించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి ముందుకొచ్చారు’’ అన్నారు. ‘‘ప్రేమకు రెయిన్ చెక్’ నా తొలి సినిమా. కార్పొరేట్ లవ్‌స్టోరీ ఎవ్వరినీ డిజప్పాయింట్ చెయ్యదు’’ అన్నారు అభిలాష్. ‘‘శ్రీనివాస్‌గారు చాలా క్లారిటీగా ఈ సినిమా తీశారు. ప్రతి పాత్ర అందంగా ఉంటుంది. సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు కథానాయికలు ప్రియా, మౌనిక. సంగీత దర్శకుడు దీపక్ కిరణ్ పాల్గొన్నారు. -
మా కష్టాన్ని గుర్తించారు
‘‘నాది విజయనగరం దగ్గర సాలూర్. యూకేలో చదువుకున్నా. ముంబైలోని బ్యారిజాన్ యాక్టింగ్ స్కూల్లో ఆరు నెలలు శిక్షణ తీసుకున్నా. నటుడిగా నా తొలిచిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. చిన్నప్పటి నుంచి మహేశ్‌బాబుగారి సినిమాలు ఎక్కువగా చూస్తూ పెరిగాను’’ అని అభిలాష్ అన్నారు. అభిలాష్ మాడాడ, ప్రియ, తన్య హీరో హీరోయిన్లుగా స్టోన్ మీడియా ఫిల్మ్ పతాకంపై ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ప్రేమకు రెయిన్ చెక్’. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అభిలాష్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. రెయిన్ చెక్ అంటే భవిష్యత్తులో పూర్తయ్యే ప్రమాణం. మా అదృష్టం ఏంటంటే మా చిత్రనికి డైరెక్టర్, నిర్మాత ఒక్కరే కావడం. ‘ప్రేమకు రెయిన్ చెక్’ అన్నది ఆయన విజన్. అందుకు తగ్గట్టే బాగా తెరకెక్కించారు. నిర్మాత శరత్ మరార్‌గారికి మా సినిమా బాగా నచ్చడంతో సమర్పిస్తున్నారు. మా కష్టాన్ని గుర్తించారనిపించింది. ఎలాంటి పాత్ర అయినా న్యాయం చేయాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
సెప్టెంబర్ 7న ‘ప్రేమకు రెయిన్ చెక్’
పవన్ కల్యాణ్ హీరోగా గోపాల గోపాల, సర్థార్ గబ్బర్ సింగ్ చిత్రాలను తెరకెక్కించిన శరత్ మరార్ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ బ్యానర్ రూపొందిన సినిమా ‘ప్రేమకు రెయిన్ చెక్’. డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాకు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ దర్శకులు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. అభిలాష్, ప్రియా వడ్లమానిలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమాలో సుమన్, రఘు కారుమంచి, కిరీటీ దామరాజు, మౌనికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపక్ కిరణ్ సంగీతం, శరత్ గురువుగిరి సినిమాటోగ్రఫి సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకువస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
మంటల్లో ప్రేమ జంట
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్‌సిటీ: ముషీరాబాద్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అభిలాష్, సంయుక్త కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదువుతున్న వీరిద్దరూ శుక్రవారం ముషిరాబాద్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో గానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. రూములో ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియురాలు సంయుక్త ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందగా.. తీవ్రగాయాలపాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
-
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తేజ(35), ఆమె తమ్ముడు అభిలాష్(30) నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో ఉన్న తమ తల్లికి సాయంగా ఉన్నారు. గురువారం ఉదయం వారు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తేజ అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన అభిలాష్‌ను వెంటనే 108లో సింహపురి ఆస్పత్రికి తరలించారు. నార్త్ ట్రాఫిక్ ఎస్సై కొండయ్య ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యు ఒడికి చిన్నారి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో కర్ణాటక గుట్టకొడికేపల్లికి చెందిన అభిలాష్ (4) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు చనిపోయాడంటూ తల్లిదండ్రులు రవి, గాయిత్రీ ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరయ్యారు. అభిలాష్‌కు తీవ్ర జ్వరం ఉందని వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పరీక్షలు చేసి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి మరో డాక్టర్‌కు బాధ్యత అప్పగించి వెళ్లారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందటంతో వైద్య సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వైద్యులు నిర్లక్ష్యం చేయడంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరకుని వైద్యులతో గొడవకు దిగారు. ఇంతలో డాక్టర్ వెంకటరమణ అక్కడికి చేరుకుని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. బెంగళూరుకు వెళ్లాలని సూచించాలి కదా వైద్యులను బంధువులు నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐలు మహమ్మద్‌బాష, ట్రాఫిక్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకుని బాధితులకు సర్ది చెప్పారు. -
కన్నీటికథ...తీరని వ్యధ
దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం మోతె గ్రామానికి చెందిన మాదాసు నాగ రాములుకు దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన మహేశ్వరితో 21 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి భరత్(17), అభిలాష్(14) సంతానం. చిన్నారులిద్దరూ అందరిలాగే ఆడుతూ, పాడుతూ బడికి వెళ్తుంటే రాములు, మహేశ్వరి దంపతులు సంబరపడిపోయారు. మనమిద్దరం..మనకిద్దరంటూ ఆనందంలో మునిగిపోయారు. వచ్చేకొద్దిపాటి డబ్బుతోనే ఈ చిన్న కుంటుంబం ఏ చింతా లేకుండా సాగేది. వీరిని చూసి ఆ విధికి కన్నుకుట్టింది. భరత్ మూడో తరగతి చదువుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి బక్కచిక్కిపోయాడు...సరిగ్గా అదే సమయంలో అతని తమ్ముడు అభిలాష్ కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆందోళన చెందిన రాములు, మహేశ్వరిలు చిన్నారులిద్దరినీ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పిల్లలను పరీక్షించిన వైద్యులు ఇలాంటి వ్యాధులు అధికంగా మేనరికంతోనే వస్తుంటాయని నిర్ధారించారు. అయితే తమది మేనరికం కాదని నాగ రాములు, మహేశ్వరిలు చెప్పడంతో వైద్యులు సీడీ ఎఫ్డీ(సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ఫ్రింట్ అండ్ డయాగ్సిసీస్)లో భరత్, అభిలాష్‌లకు పరీక్షలు నిర్వహించారు. ఇరువురికీ కండరాలక్షీణత వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. ఇలాంటి వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుందని, ఈ వ్యాధి వచ్చిన వారు జన్యులోపం మూలంగా రోజురోజుకూ నరాలు చచ్చుబడిపోవడంతో కండరాలు క్షీణిస్తూ జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వైద్యులు తెలిపారు. దీంతో హతాశయులైన నాగరాములు, మహేశ్వరి మేమేం పాపం చేశామురా దేవుండా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అంతటితో ఆగిపోకుండా తమ కంటి పాపలను కాపాడుకునేందుకు అలోపతి, హోమియోపతి..ఇలా ఎవరు ఏ సలహా ఇస్తే ఈ వైద్యం అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చిక్కిశల్యమై..తల్లిదండ్రులకు భారమై రోజురోజుకూ చిన్నారులిద్దరూ చిక్కిపోతుండడం.. వారి వైద్యం కోసం వేలకువేలు వెచ్చించడం భారంగా మారడంతో నాగరాములు, మహేశ్వరిలు తమ మకాంను దుబ్బాక మండల కేంద్రానికి మార్చారు. నాగరాములు చిన్నపాటి కొట్టు పెట్టుకుని ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతుండగా, మహేశ్వరి బీడీలు చుడుతూ భర్తకు ఆసరాగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో కూడా తమ చిన్నారులిద్దరికీ వైద్యం చేయిస్తూ స్థానిక ఆదర్శ విద్యాలయంలో ఆరో తరగతి వరకు చదివించారు. అయితే రానురానూ పిల్లలు పూర్తిగా నడవలేని పరిస్థితికి రావడంతో వారి చదువులకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం భరత్, అభిలాష్‌లు కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలోకి చేరుకోవడంతో తల్లిదండ్రులే అన్నీ తామై వారికి సపర్యలు చేస్తున్నారు. సాయం చేయాలనుకునేవారు నాగరాములు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అకౌంట్ నంబర్: 62295798781, చీకోడ్ బ్రాంచ్, దుబ్బాక మండలం. ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్‌బీహెచ్‌వై 0021551 లేదా చిన్నారుల తండ్రి నాగరాములు ఫోన్ నంబర్: 9848875766లో సంప్రదించవచ్చు. -
జూడాల సమ్మె ఉధృతం
రోడ్డుపై బైఠాయింపు దున్నపోతుకు వినతిపత్రం గాంధీ ఆస్పత్రి : తమ న్యాయమైన సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మరింత ఉధృతమైంది. గురువారం గాంధీ ఆస్పత్రిలో జూడాలు సాధారణ విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం దున్నపోతును డీఎంఈగా అలంకరించి వినతిపత్రం అందించారు. డీఎంఈ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి హఠాత్తుగా సికింద్రాబాద్-ముషీరాబాద్ ప్రధాన రహదారిపైకి చేరుకున్న జూడాలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలకలగూడ ఇన్చార్జి సీఐ అర్జునయ్య జూనియర్ డాక్టర్లతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. ఆందోళన కార్యక్రమాల్లో జూడాల సంఘం నాయకులు అభిలాష్, క్రాంతిచైతన్య, నాగార్జున, భాను, ఇమ్రాన్, సంతోష్, ఆదిత్య, సాయికుమార్, మనోజ్, భాస్కర్, రంజిత్, భవ్య, అలేఖ్య, అర్చన తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష సుల్తాన్‌బజార్: కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో జూడాలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి, డీఎంఈకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించగా సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ వారిని అడ్డుకున్నారు. దీంతో నిరాహార దీక్షను కొనసాగించారు. అనంతరం డీఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. -
అభాగ్యులనుఅక్కున చేర్చుకునే చేతులు
పుట్టుకతో మనిషికి కొన్ని బంధాలు ఏర్పడుతాయి. కానీ పుడుతూనే కొందరికి అన్ని బంధాలూ తెగిపోతాయి. జన్మనిస్తూ తల్లి మరణిస్తుంది. కళ్లు తెరిచేలోపే కన్న తల్లిదండ్రుల్ని మృత్యువు లాక్కెళ్లిపోతుంది. కారణాలు ఏవైతేనేం... పసిగుడ్డుగా ఉన్నప్పుడే బతుకు కుప్పతొట్టి పాలవుతుంది. అలాంటివారికి తమకంటూ చెప్పుకోవడానికి ఏ బంధం ఉంటుంది? ఏ బాంధవ్యం ఒడిలో చేర్చుకుని, గుండెల్లో పొదువుకుని పెంచుతుంది? ఈ ఆలోచన ఒక వ్యక్తిని వేలాదిమందికి తండ్రిని చేసింది. అతడి నీడలో వారి జీవితాలకు పునాది వేసింది! ‘‘నాన్నా... నాకు నాన్న లేడా?’’... ఆ ప్రశ్న వింటూనే అదోలా అయిపోయింది విద్యాకర్ మనసు. ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూండిపోయారు. ఆయన మనసులో ఏముందో అర్థం చేసుకోలేని చిన్నారి అభిలాష్ ఏడుస్తూ నిలబడ్డాడు. ‘‘చెప్పండి నాన్నా... నాకు నాన్న లేడా?’’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా. అతడిని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నారు విద్యాకర్. నీకు నాన్న లేడని ఆ చిన్నారికి చెప్పలేరాయన. ఎందుకంటే అతడు తననే తండ్రి అనుకుంటున్నాడు. ఉన్నాడు అని కూడా చెప్పలేడు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఆ బాబు తండ్రెవరో తనకు కూడా తెలియదు కాబట్టి! మార్చి 27, 1994. చెన్నైలోని అన్నానగర్‌లో ఉండే విద్యాకర్కి ఓ ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది వింటూనే విద్యాకర్ హడావుడిగా స్కూటర్ వేసుకుని బయలుదేరారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన గుర్తుల ఆధారంగా ఓ కుప్పతొట్టి దగ్గరకు చేరుకున్నారు. అక్కడి దృశ్యం చూసి ఆయన మనసు కరిగి నీరయ్యింది. కుప్ప తొట్టిలో... కళ్లు కూడా తెరవని ఒక పసికందు పడివుంది. చీమలు కుడుతుంటే గుక్కపట్టి ఏడుస్తోంది. ఒళ్లంతా దద్దుర్లతో ఎర్రగా కందిపోయింది. విద్యాకర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగెత్తారు. తక్షణ చికిత్స చేయించి ఆ శిశువును కాపాడారు. తర్వాత బాబుని తీసుకుని ఇంటికి వెళ్లారు. అభిలాష్ అని పేరుపెట్టి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అతడే అభిలాష్. ఊహ తెలిసేనాటికి తాను ఎవరి చేతుల్లో ఉన్నాడో అతడే తండ్రి అనుకున్నాడు అభిలాష్. బడిలో చేరిన తరువాత తెలిసింది తన అప్లికేషన్ ఫామ్‌లో తండ్రి అనే కాలమ్ ఖాళీగా ఉంది అని. అది తట్టుకోలేకపోయాడు. నేరుగా వెళ్లి తను నాన్నా అని పిలిచే విద్యాకర్‌ని నిలదీశాడు. తర్వాత మెల్లగా నిజం తెలుసుకున్నాడు. నాన్న కాని ఆ నాన్నకు పాదాభివందనం చేశాడు. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉంటాడు. కుప్పతొట్టిలో దొరికిన తనకు కొడుకు స్థానాన్ని ఇచ్చిన విద్యాకర్ రుణం తీర్చుకోలేనంటాడు కన్నీళ్లతో. ప్రస్తుతం ఐఏఎస్ పరీక్షకు ప్రిపేరవు తున్నాడు అభిలాష్. నిజానికి అతడే కాదు. అతడిలా విద్యాకర్ ప్రేమలో తడిసి విరబూసిన కుసుమాలు చాలానే ఉన్నాయి. ఆ గుబాళింపు తెలియాలంటే... చెన్నైలో ఉన్న ‘ఉదవుమ్ కరంగళ్’కు వెళ్లాలి. అది ప్రేమ ప్రపంచం... కన్నవాళ్లే ఒక్కోసారి పిల్లలను విసు క్కుంటూ ఉంటారు. కానీ ‘ఉదవుమ్ కరంగళ్’లో ఉండే ఏ చిన్నారినీ విద్యాకర్ ఒక్కసారి కూడా విసుక్కుని ఉండరు. వాళ్లని చూస్తేనే ఆయన మనసులో ప్రేమ పొంగి పొరలుతుంది. ఎక్కడెక్కడినుంచో ఆ పిల్లలను తీసుకొచ్చా రాయన. తల్లిదండ్రుల్ని కోల్పోయినవాళ్లు, కుప్పతొట్టి లోనో రోడ్డు పక్కనో దారుణమైన స్థితిలో పడివుండి పసికందులుగా దొరికిన వాళ్లు... ఎక్కడ ఓ చిన్నారి కనిపించినా అక్కున చేర్చు కుంటారాయన. వారి కోసమే ‘ఉదవుమ్ కరంగళ్’ను స్థాపించారు. విద్యాకర్ పుట్టింది మంగుళూరులో. పద మూడేళ్ల వయసులో అనుకోకుండా రామకృష్ణ అనే వ్యక్తిని ఓ ప్రమాదం నుంచి కాపాడారు. ఆ తరువాత ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. ఓసారి ఆయనను కలుసుకోవడానికి చెన్నై కూడా వెళ్లారు. అప్పుడే ఆయనకు సమాజం కోసం బతకడమంటే ఏంటో తెలిసింది తొలిసారి. రామకృష్ణ సమాజ సేవ చేసేవారు. ఆయనను చూసి స్ఫూర్తిపొందిన విద్యాకర్... స్థానికంగా కుష్టురోగుల కోసం పనిచేసే ఓ ఎన్జీవోలో చేరారు. సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆ క్రమంలో ఓరోజు... ఒక రిక్షా కార్మికుడు ఒక పసిబిడ్డను తీసుకుని విద్యాకర్ దగ్గరకు వచ్చాడు. సినిమా హాల్లో దొరికిందని చెప్పి, విద్యాకర్కు అప్పగించి వెళ్లిపోయాడు. ఆ బిడ్డకు ఓ నీడ కల్పించాలని చాలా ప్రయత్నించారు విద్యాకర్. కానీ ఎవరూ సహకరించలేదు. దాంతో ఆయన మనసు కదిలిపోయింది. దిక్కులేని బిడ్డను సాకేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు, ఇలాంటి పిల్లలందరి పరిస్థితి ఏంటి? అని ఆలోచించిన ఆయన ‘ఉదవుమ్ కరంగళ్ (సాయం చేసే చేతులు)’కు పునాది వేశారు. నాటి నుంచి తన సంస్థ ద్వారా ఎందరో చిన్నారులను అక్కున చేర్చుకున్నారు విద్యాకర్. వాళ్లంతా తనను ‘నాన్నా’ అని పిలుస్తుంటే ఆయన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఆయన చేతులు వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. - సమీర నేలపూడి ‘ఉదవుమ్ కరంగళ్’ను 1983లో స్థాపించారు విద్యాకర్. మొదట అనాథ శిశువుల సంరక్షణ కోసమే పెట్టినా... తరువాత సంస్థను పలు సేవా కార్యక్రమాల దిశగా విస్తరించారాయన. వృద్ధులకు ఆసరా కల్పిస్తున్నారు. మానసిక వికలాంగులను చేరదీసి చికిత్స చేయిస్తున్నారు. ఎయిడ్ వ్యాధిగ్రస్తులను కూడా చేరదీస్తున్నారు. వీరందరికీ ఆవాసం కల్పించేందుకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు విద్యాకర్. ప్రస్తుతం ఈ స్వచ్ఛంద సంస్థలో ఎనిమిది వందలకు పైగా మానసిక వికలాంగులు, నాలుగు వందల మందికి పైగా ఎయిడ్స వ్యాధిగ్రస్తులు, యాభై మందికి పైగా వృద్ధులు ఉన్నారు. అదే విధంగా ఆరు వందల మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వీరిలో నెల రోజుల నుంచి ఇరవయ్యేళ్ల వయసు ఉన్నవారి వరకూ ఉన్నారు. అందరూ విద్యాకర్‌ని ‘పప్పా (నాన్నా)’ అనే పిలుస్తారు. ఎవరూ అనాథలుగా ఫీలవకూడదన్న ఉద్దేశంతోనే అలా పిలవడం అలవాటు చేశారు విద్యాకర్. అందరికీ చదువు చెప్పిస్తున్నారు. అది కూడా ఎవరికి నచ్చిన కోర్సు వాళ్లు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఆ మంచి మనసే ఆయనను అందరికీ ఆప్తుడిగా మార్చింది. ఆయన ఖ్యాతిని విదేశాల వారు సైతం గుర్తించేలా చేసింది!