ఆటే అభిలాష! | School Student Abhilash Talent in Cricket Prakasam | Sakshi
Sakshi News home page

ఆటే అభిలాష!

Published Thu, Mar 5 2020 12:45 PM | Last Updated on Thu, Mar 5 2020 12:45 PM

School Student Abhilash Talent in Cricket Prakasam - Sakshi

క్రికెట్‌ సాధనలో అభిలాష్‌ ,అభిలాష్‌ సాధించిన కప్పులు

కందుకూరు రూరల్‌: స్కూల్‌కు వెళ్లిన తన బిడ్డ చీకటి పడుతున్నా ఇంటికి రాకపోవడంతో నాన్నకు కోపం వచ్చింది.కందుకూరులోని టీఆర్‌ఆర్‌కళాశాల, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో పిల్లాడి కోసం వెతుకుతున్నాడు. అదే సమయంలో టీఆర్‌ఆర్‌ కళాశాల క్రీడామైదానం నుంచి ఇంటికి వస్తున్న కుమారుడిని చూసి కోపంఆపుకోలేక రోడ్డుపైనే అతన్ని కొట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఇదే జరిగింది. దీంతో కుర్రాడు ‘నాన్నా నేను క్రికెట్‌ బాగా ఆడుతున్నాను. ఇదిగో పేపర్‌లో కూడా పడ్డాను’ అని పేపరు చూపించడంతో కుమారుని టాలెంట్‌ తండ్రికి అర్థం అయింది. దామవరపు అభిలాష్‌ క్రికెట్‌లో జాతీయ స్థాయికి ఎంపికై అందరి మనన్ననలు అందుకుంటున్నాడు.

కందుకూరు బృందావనంలో నివాసం ఉంటున్న దామవరపు గోవింద్‌–వెంకటలక్ష్మిలకు నలుగురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయి. వీరిలో మూడో సంతానం అభిలాష్‌. వీరి స్వగ్రామం తిమ్మపాలెం. తాపీ మేస్త్రీగా తండ్రి పని చేస్తుంటాడు. తిమ్మపాలెం గ్రామీణ ప్రాంతం కావడంతో పిల్లలను చదివించుకోడానికి తొమ్మిదేళ్ల క్రితం కందుకూరు వచ్చారు. అభిలాష్‌ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విజ్ఞాన్‌విహార్‌లో చదివాడు. మూడో తరగతి చదువుతున్న సమయంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ వారు టీఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్‌ ఎంపికలు నిర్వహించారు. అక్కడ అభిలాష్‌ బౌలింగ్‌ విధానం చూసి ఎంపిక చేశారు. తాను ఎంపికైన విషయాన్ని తండ్రికి చెప్పినా ఆటలు వద్దు.. క్రికెట్‌ వద్దు.. చదుకోరా అని మందలించాడు. అయినా అభిలాష్‌కు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని తగ్గలేదు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు ఎంపికైన అభిలాష్‌ను పంపించాలని కోచ్‌ వచ్చి తల్లిదండ్రులను అడిగినా పంపించలేదు.

రాష్ట్ర స్థాయి ఉత్తమ బౌలర్‌గా అవార్డు అందుకుంటున్న అభిలాష్‌
ఎక్కడకు వెళ్లినా బెస్ట్‌..
6వ తరగతికి అభిలాష్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో చేరాడు. 7వ తరగతిలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ అండర్‌–12 జిల్లా ఎంపికలు నిర్వహించగా జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. కోచ్‌ సుధాకర్‌ తండ్రికి అవగాహన కల్పించి క్రికెట్‌ ఆడేలా చేశారు. జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఆ తర్వాత స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు సార్లు పాల్గొని ఒక సారి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా తరఫున నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఐదు మ్యాచ్‌లు ఆడి తొమ్మిది ఓవర్లు వేసి ఏడు వికెట్లు తీసుకున్నాడు. 38 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. రాష్ట్ర ఉత్తమ బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. అదే విధంగా ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు మహారాష్ట్రలోని కోప్రాగాన్‌ జరిగిన జాతీయ స్థాయి పోటీలో అభిలాష్‌ ఆంధ్రప్రదేశ్‌ జట్టులో ఆడాడు. ఈ పోటీల్లో ఐదు మ్యాచ్‌లు ఆరు వికెట్లు, మూడు క్యాచ్‌లు, రెండు రన్‌ ఔట్లు, ఒక మేడిన్‌ ఓవర్‌ వేసి జాతీయ స్థాయిలో 14వ స్థానంలోకి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌ బెస్ట్‌ బౌలర్‌గా, బెస్ట్‌ ఫర్మామెన్స్‌ ప్రశంసలు అందుకున్నాడు. ఇలా క్రికెట్‌లో జిల్లా స్థాయిలో కూడా అనేక మార్లు ఆడాడు. ఎక్కడైనా క్రికెట్‌ టోర్నమెంట్‌ పెట్టారంటే అభిలాష్‌ను పోటీపడి తీసుకుపోతుంటారు. అనేక పతకాలు, కప్పులు సాధించాడు ఈ బుడతడు.

ఆర్థిక పరిస్థితులే సమస్య..
తండ్రి గోవిందయ్య బేల్దారీగా ఉంటూ ఇద్దరు కుమార్తెలు ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు. ఇద్దరి కుమారులను కూడా చదివిస్తున్నాడు. భారం అయినప్పటికీ అభిలాష్‌ ప్రతిభను పక్కన పెట్టలేక తనకు ఇష్టమైన క్రికెట్‌లో ప్రోత్సహిస్తున్నాడు. ఒక జత షూ కొనాలంటే ’ 10,500 అవుతున్నాయి. మంచి బ్యాట్‌ కొనుగోలు చేయాలంటే రూ. 10వేలకు పైగానే ఉంటుంది. ఇలా క్రీడా దుస్తులు, బాల్, జిల్లా స్థాయి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్లాలంటే సొంత ఖర్చులతో వెళ్లాల్సిన పరిస్థితి. ‘ఏ మ్యాచ్‌కు వెళ్లిని వెంట వెళ్తాను. బాగా ప్రోత్సహిస్తున్నప్పటికీ ఆటకు కావాల్సిన పరికరాలు మాత్రం ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇప్పటికి లక్ష రూపాయిల వరకు ఖర్చు చేశాం. ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు పాఠశాల తరఫున హెచ్‌ఎం, ఉపాధ్యాయులు పది వేల రూపాయిలు జమ చేసి అభిలాష్‌కు అందజేస్తున్నాం’ అని హెచ్‌ఎం డి.అనూరాధ తెలిపారు.

రంజీల్లో రాణించాలని ఉంది:దామవరపు అభిలాష్‌
క్రికెట్‌లో జాతీయ స్థాయి వరకు ఇప్పటికి రెండో సారి ఆడబోతున్నా. రంజీల్లో ఆడనే కోరిక ఉంది.  మా కోచ్‌లు బాగా తర్ఫీదు ఇస్తున్నారు. మా నాన్న మొదటిలో క్రికెట్‌ ఆడద్దన్నా ఇప్పుడు బాగా ప్రోత్సహిస్తూ నా వెంటే ఉంటున్నాడు. నాకు ఎలాంటి లోటు లేకుండా క్రికెట్‌ దగ్గరుండి ఆడిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement