ఒంగోలు టౌన్: గిరిజన యువకుడిని చితక బాది, అతడి మీద మూత్రం పోస్తూ సెల్‌ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించిన కేసులో ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి పరారయ్యాడు. మిగతా నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 19వ తేదీన ఈ సంఘటన జరగ్గా, వారు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టారు. రామాంజనేయ చౌదరి నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా ఒంగోలు పరిసరాల్లోనే ఒక ప్రతిపక్ష నాయకుడి రక్షణలో ఉన్నట్లు సమాచారం.
ఆ నాయకుడి సలహా మేరకు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భాగంగా వీడియోను లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన ప్రధాన నిందితుడు మన్నే రామాంజనేయ చౌదరి, బాధితుడైన మోటా నవీన్‌పై పలు కేసులున్నాయి.ఇద్దరూ దొంగతనాలు, రాబరీ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. డబ్బు పంపకాల్లో వీరి మధ్య విభేదాలున్నాయి.
నవీన్ కొద్దికాలంగా ఓ మైనర్ బాలికను వేధించడం మొదలెట్టాడు. ఆ బాలికను ఓసారి కిడ్నాప్ చేశాడు. దీంతో నవీన్‌పై పోక్సో కేసు నమోదైంది. ఆ బాలికను అభిలాష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, నవీన్ ఆ బాలికను వేధిస్తుండడంతో ఆమె సోదరుడు ఈ విషయాన్ని అభిలాష్ కు చెప్పాడు. నవీన్‌కు గుణపాఠం చెప్పాలని రామాంజనేయ చౌదరితో కలిసి వారు పథకం రచించారు.
గత నెల 19న ప్రభు, నరేంద్ర ఉరఫ్ టిల్లుతో కలిసి రామాంజనేయ చౌదరి నవీన్ ఇంటికి వెళ్లాడు. అందరూ అక్కడ మద్యం తాగారు. అనంతరం బాలిక విషయంలో రాజీ చేసుకుందామని చెప్పి నవీన్, అతడి సోదరుడు రాజాను తీసుకెళ్లారు. ముక్తినూతలపాడు సమీపంలో కల్వరి టెంపుల్ వద్దకు రాగానే అక్కడ కాపు కాసి ఉన్న అభిలాష్, బాలిక సోదరుడు, మరో నలుగురు ఇనుప రాడ్లు, కర్రలతో నవీన్, రాజాను చితక్కొట్టారు.
నెత్తురోడుతున్న అతనిపై రామాంజనేయ చౌదరి మూత్రం పోశాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వారి నుంచి తప్పించుకున్న రాజా తల్లికి సమాచారమిచి్చ, సమీపంలోని పొగాకు కూలీల సహాయంతో 108లో నవీన్‌ను జీజీహెచ్‌కు తరలించారు.
ఆరుగురు నిందితులను అరెస్టు చేశాం: ఎస్పీ
ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మర్లపాడుకు చెందిన రాయపాటి అభిలాష్, ఒంగోలు గోపాల్ నగర్‌కు చెందిన అప్పనబోయిన జయశంకర్, ఇస్లాంపేటకు చెందిన షేక్ సాదిక్ గపూ ర్‌తో పాటు బాలిక సోదరుడు, అతని స్నేహితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రామాంజనేయ చౌదరి, చాపల ప్రభు, ఏకాంబరం నరేంద్ర పరారీలో ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment