అభిలాష్ (ఫైల్)
ముషీరాబాద్: మద్యం మత్తులో నలుగురు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హన్మకొండకు చెందిన అభిలాష్ హైదరాబాద్‌కు వచ్చి రాంనగర్‌లో ఉంటూ జొమాటో కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అతడి స్నేహితుడు వంశీ ఇటీవల ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఈ నెల 24న రాంనగర్‌లో ఉంటున్న తమ స్నేహితుడు హరీష్ గదికి వెళ్లారు. వంశీ స్నేహితుడు చంద్రకాంత్ కూడా అక్కడికి రావడంతో నలుగురు కలిసి మద్యం తాగారు. ఈ సందర్భంగా వంశీ పుట్టినరోజు విషయం గుర్తుకు రావడంతో అందరూ కలిసి రాంనగర్‌లోని ఓ బేకరీకి వెళ్లి కేక్ కట్‌చేశారు. అనంతరం మరో రెస్టారెంట్‌కు వెళ్లి మరోసారి మద్యం తాగారు.
ఆ తర్వాత నారాయణగూడలోని ఓ హోటల్‌కు వెళ్లి బిర్యాని తిన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ వచ్చినందున అదనంగా రూ.600 ఖర్చయ్యిందని అభిలాష్ అనడంతో మనస్తాపానికి లోనైన చంద్రకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో వంశీ అభిలాష్‌తో వాగ్వాదానికి దిగడంతో అందరూ కలిసి అక్కడినుంచి హరీష్ గదికి వెళ్లిపోయారు. అక్కడ కూడా వాగ్వాదం కొనసాగడంతో అభిలాష్ వంశీపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికిలోనైన వంశీ అభిలాష్‌ను బలంగా నెట్టివేయడంతో తల నేలకు తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. రెండు రోజుల చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మిగతా ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment