బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తాజ్‌బంజారా హోటల్‌కు ఓ వ్యాపారి లక్షల్లో బిల్లు ఎగ్గొట్టి పరారయ్యాడు. తాజ్‌బంజారా హోటల్ జీఎం హితేంద్రశర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. విశాఖపట్నం వినాయకటెంపుల్ సమీపంలోని కిర్లంపుడి లేఅవుట్‌లో ఉన్న సాగర్ దీప అపార్ట్‌మెంట్స్‌లో నివసించే అక్కింశెట్టి శంకర్ నారాయణ్ గతేడాది ఏప్రిల్ 4న తాజ్‌బంజారా హోటల్‌కు వచ్చి తాను ఏడాదిపాటు వ్యాపారనిమిత్తం ఇక్కడ బస చేయడానికి ఉంటున్నానని ఒకేగదిని దీర్ఘకాలిక ప్రాతిపదికన కేటాయించాల్సిందిగా కోరాడు. దీంతో గతేడాది ఏప్రిల్ 4న ఆయనకు హోటల్‌లో రూమ్ నెంబర్ 405 కేటాయించారు. మధ్యలో రూ.13.62 లక్షలు బిల్లు చెల్లించాడు. దీంతో హోటల్ నిర్వాహకులను నమ్మిస్తూ తర్వాత బిల్లులు వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత ఏప్రిల్ 15వ తేదీన ఆయన గదికి తాళం వేసి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా రాకపోవడంతో నిర్వాహకులు సంప్రదిస్తూ వచ్చారు. మొత్తం 102 రోజులకుగాను హోటల్ బిల్లు రూ. 25,96,693 కాగా అందులో రూ. 13,62,149 చెల్లించాడు. మిగతా రూ. 12,34,544 బాకీ పడ్డాడు. ఈ మొత్తాన్ని చెల్లించకుండానే గది విడిచి పరారయ్యాడు. జూన్ 26వ తేదీన ఆయనకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది.దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment