సాక్షి ఎక్స్‌లెన్స్
గత ఏడాది విభిన్న రంగాల్లో ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శించిన విజయవంతమైన వ్యక్తులను గుర్తించి సత్కరించేందుకు సాక్షి మీడియా గ్రూప్.. ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2014’ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు నిర్వహించింది. నగరంలోని తాజ్ బంజారా హోటల్ ఇందుకు వేదికైంది. అవార్డులకు సంబంధించిన నామినేషన్ల వడపోత ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు పాపులర్ కేటగిరీలుగా స్పోర్ట్స్, టీవీ సీరియల్స్, సినిమా రంగాలకు సంబంధించి తమకు అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. వీటిలో ఒక్కో కేటగిరీ నుంచి ఫైనలిస్ట్‌లుగా కొందరిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి విజేతలను ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. యంగ్ అఛీవర్ ఇన్ సోషల్ సర్వీస్ కేటగిరీ నుంచి ఐదుగురిని టాప్ ఫైనలిస్ట్‌లుగా ఎంపిక చేశారు. ఈ విభాగంలో తుది విజేతను జ్యూరీయే స్వయంగా ఎంపిక చేస్తుంది. మొదటి రోజు ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ఎంపిక కమిటీకి జ్యూరీ సభ్యులుగా సినీ, క్రీడా రంగ ప్రముఖులు రావి కొండలరావు, గీతాంజలి, అల్లాణి శ్రీధర్, పూర్ణిమారావు, ఎన్.ముఖేష్‌కుమార్, విక్టర్ అమల్‌రాజ్, నాటక రంగ ప్రముఖులు గుమ్మడి గోపాలకృష్ణ, నృత్యకారిణి స్వాతి సోమనాథ్ వ్యవహరించారు.
రెండో రోజు..
రెండో రోజు గురువారం బెస్ట్ మూవీ, బెస్ట్ మేల్-ఫిమేల్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫిమేల్-మేల్ సింగర్ల కేటగిరీలకు ఫైనలిస్ట్‌లను సెలక్ట్ చేశారు. ఈ ప్రక్రియకు జ్యూరీ సభ్యులుగా సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ్, చంద్రబోస్, కవిత, రాశి, సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్, సామాజిక ప్రముఖులు గోరటి వెంకన్న, దేవి వ్యవహరించారు. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి పర్యవేక్షించారు.
సంతోషంగా ఉంది: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన వారిని సత్కరించేందుకు సాక్షి మీడియా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ తరహా సెలక్షన్స్ సినీఫీల్డ్‌లో సాధారణమే. అయితే ఓ మీడియా సంస్థ ఇంత జెన్యూన్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం
సంతోషంగా ఉంది.
మరెందరికో స్ఫూర్తి: నటి కవిత
ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సాక్షి మీడియాకు ధన్యవాదాలు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా ఇందులో పాలుపంచుకుంటున్నా. ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తి నివ్వాలని కోరుకుంటున్నా.
కొత్తగా అనిపించింది: సంగీత దర్శకుడు రాధాకృష్ణన్
ఇలాంటి అవార్డ్ ప్రోగ్రామ్స్ బాలీవుడ్లో ఎక్కువ. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సాక్షి నుంచి నాకు కాల్ రాగానే కొత్తగా అనిపించింది. ఇటువంటికార్యక్రమాలు కొత్త స్ఫూర్తి నింపుతాయి.
గొప్ప ఆలోచన: సినీ గేయ రచయిత చంద్రబోస్
కేవలం సినిమా నటీనటులు, గాయనీగాయకులు అని కాకుండా.. స్పోర్ట్స్ పర్సన్స్, సీరియల్స్, సామాజిక సేవకులు.. ఇలా పలు రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు సాక్షికి కృతజ్ఞతలు.
ప్రేక్షకులే నిర్ణేతలు: సినీ నటి రాశి
ఎవరు ది బెస్ట్ అని నిర్ణయించడం అంత సులభమైన విషయం కాదు. సరైన న్యాయనిర్ణేతలు మాత్రం టీవీల ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్లే. సాక్షి చేపట్టిన ఎక్స్‌లెన్స్ ఈవెంట్లో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది.
ఫ్యూచర్లో..: సామాజిక కార్యకర్త దేవి
సాక్షి చేస్తున్న ఈ ప్రయత్నం బాగుంది. షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీస్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుండేది. మంచి కథ, కథనం ఉండి పెద్దగా పేరు రాని మంచి మూవీస్ అనేకం ఉంటాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టి ఉంటే.. న్యూ టాలెంట్స్‌ను ప్రోత్సహించినట్టుండేది.
ఫ్యూచర్లో ఆ కోణంలో ఆలోచిస్తే బాగుంటుంది.