
ఢిల్లీలో మీడియాతో సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో రాష్ట్రంలో ‘ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్’ బిల్లును తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియాతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో అనేక భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు.
ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలకు సంబంధించినవే అన్నారు. భూముల కంప్యూటరీకరణలో సరైన విధానం లేక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏలో చేర్చారని.. అటవీ భూములను అధికారులతో కలిసి ఆక్రమించారని ఆరోపించారు. గుజరాత్‌లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు విజయవంతంగా అమలవుతోందని, దాని అమలును ఏపీలో కూడా అనుమతించాలని కోరినట్లు చెప్పారు.
డీలిమిటేషన్ నిరంతర ప్రక్రియ
నియోజకవర్గాల పునర్విభజన అనేది నిరంతర ప్రక్రియ అని.. దీనిపై సమయానుకూలంగా స్పందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో జనాభా నియంత్రణను ప్రోత్సహించానని, ఇప్పుడు జనాభాను పెంచాలనే విషయం అర్థమై పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
పోలవరం 2027 కల్లా పూర్తి
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల బకాయిలను వదిలిపెట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు తెలిపినట్లు చంద్రబాబు చెప్పారు. రాయలసీమ వంటి కరువు ప్రాంతాలకు నీరందించేందుకు.. సముద్రంలో కలిసే జలాలను వినియోగించుకుంటామని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలవరంను 2027 కల్లా పూర్తి చేస్తామని తెలిపారు.
189 కి.మీ. మేర అమరావతి ఔటర్
ఎనిమిది లైన్‌లతో 189 కి.మీ. మేర అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. శ్రీశైలం ఆలయం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు రోడ్డును విస్తరించాలని, వినుకొండ–అమరావతి తదితర ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు.
డీపీఆర్‌లు సిద్ధం చేసిన తర్వాత టెండర్లు పిలుస్తామని గడ్కరీ చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మిర్చి క్వింటాకు రూ.11,781 మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకొందన్నారు. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల సర్దుబాటుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment