జనవరిలో సీఐఐ సదస్సు... | CII seminar in January | Sakshi
Sakshi News home page

జనవరిలో సీఐఐ సదస్సు...

Published Fri, Nov 11 2016 1:21 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM

జనవరిలో సీఐఐ సదస్సు... - Sakshi

జనవరిలో సీఐఐ సదస్సు...

విశాఖలో నిర్వహిస్తాం: ముఖ్యమంత్రి
రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, అమిత్‌షాతో భేటీ    

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాల్లో 41 శాతం విజయవంతమైనట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే జనవరి 27, 28 తేదీల్లో విశాఖలోనే సీఐఐ పార్ట్‌నర్ షిప్ సమ్మిట్-2017 నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం ఇక్కడి ఉద్యోగ్ భవన్‌లోని వాణిజ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, సీఐఐ ఉపాధ్యక్షుడు రాకేష్ భార్తీ మిట్టల్‌లు కూడా పాల్గొన్నారు. గత ఏడాది 328 ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వాటి విలువ రూ.4,67,577 కోట్లని 1.60 లక్షల మందికి ఉపాధి లభించిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఐఐ వరసగా రెండోసారి పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తోందని నిర్మలాసీతారామన్ చెప్పారు.

అపోలో టైర్ల కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ద్విచక్ర వాహనాల టైర్లను, పికప్ ట్రక్కుల వాహనాల టైర్లను తయారు చేసేందుకు ఒక ప్లాంటును రూ. 525 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు  చంద్రబాబు, అపోలో టైర్స్ చైర్మన్ ఓంకార్ ఎస్ కన్వర్ సమక్షంలో ఏపీ ఉన్నతాధికారి కార్తికేయ మిశ్రా, అపోలో ప్రతినిధి సునమ్ సర్కార్ ఎంఓయూపై సంతకాలు చేశారు. కాగా సీఎం ఫిక్కీ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన ఉన్నత విద్యా సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు.  ఇలావుండగా బాబు గురువారం ఇక్కడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారు.

పెండింగ్ అంశాలపై చర్చించారు. చంద్రబాబు ఏపీ భవన్‌లో ఉన్న సమయంలో విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వచ్చి ఆయన్ను కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సీఎం భేటీ అయ్యారు. ఆయన వెంట స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నారు. వచ్చే ఫిబ్రవరిలో అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయన నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement