వివరాలు వెల్లడిస్తున్న సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: ఒకే ప్రాంతానికి చెందిన వారిద్దరూ స్నేహితులు. కూలీ, చిరుద్యోగి అయిన వారు ఆ సంపాదనతో తృప్తి చెందలేదు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు స్నాచింగ్స్ చేయాలని పథకం పన్నారు. కేవలం రూ.8 వేలు చెల్లిస్తే ఫైనాన్స్‌లో వాహనం వస్తుండటంతో దానిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రెండు కిస్తీలు చెల్లించే లోగా మూడు స్నాచింగ్స్ చేశారు. వీరి వ్యవహారాన్ని కనిపెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా, జరాసాగరం, కాకరవాడకు చెందిన రవి నగరానికి వలసవచ్చి సూరారంలో ఉంటున్నాడు. మెదక్ జిల్లా, నర్సాపూర్ సమీపంలోని రెడ్డిపల్లికి చెందిన ఆంజనేయులు సైతం అదే ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డాడు. నిరక్షరాస్యుడైన రవి కూలీ పనులు చేస్తుండగా కొద్దిగా చదువుకున్న ఆంజనేయులు సూరారంలోని ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తూ పేరు మార్చుకుని అంజన్‌గా చెలామణి అవుతున్నాడు. ఒకే ప్రాంతంలో ఉంటున్న వీరు తరచూ కలుసుకుంటూ ఉండేవారు.
తమకు వచ్చే ఆదాయంతో తృప్తి చెందని ఇరువురూ తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? అనే అంశంపై తరచు చర్చలు జరిపైవారు. నగరంలో స్నాచింగ్స్ చేస్తే తేలిగ్గా, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉందని రవి సలహా ఇచ్చాడు. దీనికి అంజన్ కూడా అంగీకరించడంతో ఆ నేరాలు చేయాలంటే ద్విచక్ర వాహనం ఉండాలని వారు భావించారు. అది కొనే స్థోమత లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించారు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అతి తక్కువ మొత్తం చెల్లించినా ఫైనాన్స్‌పై బైకులు ఇస్తున్నట్లు తెలియడంతో సదరు సంస్థను సంప్రదించిన వీరు రూ.8 వేలు చెల్లించి రెండు నెలల క్రితం బజాజ్ పల్సర్ బైక్ ఖరీదు చేశారు. దీనిపై తిరుగుతూ నగరంలోని అనేక ప్రాంతాల్లో రెక్కీలు చేశారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్లో ఒంటరి వారిని గుర్తించి టార్గెట్‌గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి సందర్భంలోనూ అంజన్ హెల్మెట్ పెట్టుకుని వాహనం నడుపుతుండగా వెనుక కూర్చునే రవి స్నాచింగ్స్ చేసేవాడు. ఇలా ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 17 (ఆదివారం) మధ్య ఎస్సార్‌నగర్‌లో ఒకటి, సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రెండు స్నాచింగ్స్ చేశారు.
ఇలా తస్కరించిన పది తులాల బంగారాన్ని విక్రయించేందుకు నగరంలో సంచరిస్తున్నారు. ఈ చోరీలపై దృష్టి పెట్టిన పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్‌రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుళ్లు సి.ప్రదీప్ సాగర్, జి.వినయ్ యాదవ్, ఎ.సత్యనారాయణ, కె.నయన్ దర్యాప్తు చేపట్టారు. ఎస్సార్ నగర్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరించి అధ్యయనం చేశారు. ఫలితంగా స్నాచర్లకు సంబంధించిన కీలక ఆధారాలు చిక్కడంతో నగర వ్యాప్తంగా వలపన్నారు. చోరీ సొత్తును విక్రయించడానికి సోమవారం నగరానికి వచ్చిన వీరి కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 10 తులాల బంగారం, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును ఎస్సార్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
ప్రైవేట్ సంస్థదే పాపం...
ఈ ఇద్దరూ స్నాచర్లుగా మారడానికి ప్రధాన కారణం తక్కువ డౌన్ పేమెంట్‌తో బైక్ ఖరీదు చేసే అవకాశం ఉండటమే. కేవలం రూ.8 వేలు కట్టించుకుని మిగిలిన మొత్తం ఫైనాన్స్ ఇస్తూ ఓ ప్రైవేట్ సంస్థ వీరికి పల్సర్ వాహనం ఇచ్చింది. దీంతో రెండు కిస్తీలు చెల్లించేలోపే మూడు స్నాచింగ్స్ చేశారు. ఈ సంస్థలు సైతం బ్యాంకుల తరహాలో కనీసం 25 శాతం చెల్లిస్తే తప్ప వాహనాలు ఇవ్వకూడదు. అలాగే నగరానికి చెందిన ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నేనుసైతం ప్రాజెక్టు కింద సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. అలా చేస్తే నేరాలు నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తీసుకురావడం కూడా సాధ్యమవుతాయి.– నగర పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment