జూడాల సమ్మె ఉధృతం
- రోడ్డుపై బైఠాయింపు
- దున్నపోతుకు వినతిపత్రం
గాంధీ ఆస్పత్రి : తమ న్యాయమైన సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని జూనియర్ డాక్టర్‌లు చేపట్టిన సమ్మె మరింత ఉధృతమైంది. గురువారం గాంధీ ఆస్పత్రిలో జూడాలు సాధారణ విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం దున్నపోతును డీఎంఈగా అలంకరించి వినతిపత్రం అందించారు. డీఎంఈ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు.
అక్కడి నుంచి హఠాత్తుగా సికింద్రాబాద్-ముషీరాబాద్ ప్రధాన రహదారిపైకి చేరుకున్న జూడాలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిలకలగూడ ఇన్‌చార్జి సీఐ అర్జునయ్య జూనియర్ డాక్టర్లతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. ఆందోళన కార్యక్రమాల్లో జూడాల సంఘం నాయకులు అభిలాష్, క్రాంతిచైతన్య, నాగార్జున, భాను, ఇమ్రాన్, సంతోష్, ఆదిత్య, సాయికుమార్, మనోజ్, భాస్కర్, రంజిత్, భవ్య, అలేఖ్య, అర్చన తదితరులు పాల్గొన్నారు.
నిరాహార దీక్ష
సుల్తాన్‌బజార్: కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో జూడాలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి, డీఎంఈకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మానవహారం నిర్వహించేందుకు ప్రయత్నించగా సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాస్ వారిని అడ్డుకున్నారు. దీంతో నిరాహార దీక్షను కొనసాగించారు. అనంతరం డీఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు.