హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గాంధీ నర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ... గాంధీ ఆస్పత్రి కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది చేపట్టిన సమ్మె మూడవ రోజైన బుధవారం కూడా కొనసాగింది. ఆస్పత్రి ప్రధాన భవనం ఎదుట బైఠాయించి ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఫ్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామిమేరకే తెలంగాణలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులంతా ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించారని గుర్తు చేశారు.
ఎన్నికల్లో గెలిచి సుమారు పదినెలల గడుస్తున్నా పర్మినెంట్ విషయం మర్చిపోవడం దారుణమన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ హస్పిటల్ అవుట్‌సోర్సింగ్ నర్సింగ్‌స్టాఫ్ సమ్మె కమిటీ ప్రతినిధులు మేఘమాల, ఉపేంద్రగౌడ్, మధులత,ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది సమ్మెతో వైద్యసేవలకు విఘాతం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపారు.