Paga Paga Paga Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Paga Paga Paga Review: ‘పగ పగ పగ’ మూవీ రివ్యూ

Published Thu, Sep 22 2022 5:21 PM | Last Updated on Thu, Sep 22 2022 5:58 PM

Paga Paga Paga Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: పగపగపగ
నటీనటులు: కోటి, అభిలాస్‌ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు
నిర్మాత :  సత్య నారాయణ సుంకర
దర్శకత్వం :  రవి శ్రీ దుర్గా ప్రసాద్
సంగీతం :  కోటి
సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా
ఎడిటర్ :  పాపారావు
విడుదల తేది: సెప్టెంబర్‌ 22,2022

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
ఈ చిత్రం కథంతా 1985,90,2006వ సంవత్సరంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్‌(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్‌ కిల్లర్స్‌. ఒక్కసారి డీల్‌ కుదుర్చుకుంటే.. ప్రాణాలు పోయినా సరే డీల్‌ పూర్తి చేస్తారు. ఒక పోలీసు హత్య కేసులో కృష్ణ అరెస్ట్‌ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్‌ ప్రసాద్‌గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్త అవుతాడు.

కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. కానీ అతని కొడుకు అభి(అభిలాష్‌)ని మాత్రం చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. జగదీష్‌ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్‌ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్‌ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ డీల్‌ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్‌ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్‌ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా ఉన్నా.. దానిని తెరపై చూపించడంలో, ప్రేక్షకుడికి కనెక్ట్‌ చేయడంలో కాస్త తడబడ్డాడు.

ఫస్టాఫ్‌లో కథ అంతగా రక్తి కట్టించదు. కాలేజీ ఎపిసోడ్‌ సరదాగాసాగుతుంది. అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్‌ కాస్త జగదీష్‌ ప్రసాద్‌గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. కాంట్రాక్ట్‌ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్‌ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్‌ మాత్రం ఉహకు భిన్నంగా, టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటుంది. 

ఎవరెలా చేశారంటే..
కెరీర్‌లో మొదటి సారి విలన్‌ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్‌ జగదీష్‌ ప్రసాద్‌ పాత్రకు న్యాయం చేశాడు. విలన్‌గా, కూతురికి మంచి నాన్నగా అదరగొట్టేశాడు. హీరో అభిలాష్‌కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించాడు.సీరియస్‌, కామెడీ సీన్స్‌తో పాటు యాక్షన్‌ ఎడిసోడ్స్‌లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవాతో పాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటీ సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement