పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు | JAC demand of southern states to central govt on Delimitation | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు

Published Sun, Mar 23 2025 4:34 AM | Last Updated on Sun, Mar 23 2025 4:39 AM

JAC demand of southern states to central govt on Delimitation

తమిళనాడు సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి, భగవంత్‌ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, కేటీఆర్, టీఆర్‌ బాలు

అప్పటిదాకా లోక్‌సభ స్థానాల సంఖ్య యథాతథంగా ఉండాలి 

కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ డిమాండ్, ఏకగ్రీవ తీర్మానం 

చెన్నైలో తొలి భేటీ.. ముగ్గురు సీఎంలు, 14 పార్టీల నేతలు హాజరు

అందరి ఆమోదంతో, పారదర్శకంగా మాత్రమే పునర్విభజన 

ముందుగా అన్ని రాష్ట్రాలు,పార్టీలతో చర్చించి ఒప్పించాలి 

జనాభాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదికగా తీసుకోరాదు 

దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా రాజ్యాంగ సవరణలు 

పునర్విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీల్లో తీర్మానాలు,కేంద్రానికి అందజేత 

ప్రధాని మోదీకి ఉమ్మడిగా విజ్ఞాపన పత్రాలివ్వనున్న ఎంపీలు   

హైదరాబాద్‌లో జేఏసీ రెండో భేటీ, భారీ బహిరంగ సభ

సాక్షి, చెన్నై: జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది. 

స్టాలిన్‌ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. 

కేంద్రం చేపట్టే ఎలాంటి డీలిమిటేషన్‌ ప్రక్రియపై అయినా ముందుగా భాగస్వామ్య పక్షాలన్నింటితోనూ చర్చించాల్సిందేనని జేఏసీ సభ్యులు కుండబద్దలు కొట్టారు. ‘‘అందరి భాగస్వామ్యంతో మాత్రమే డీలిమిటేషన్‌ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో కచ్చితంగా సంప్రదింపులు జరపాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. లోక్‌సభ స్థానాల పునర్విభజన మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచేలా ఉండాలి’’అని పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన తీర్మానాన్ని జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

‘‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని 42, 84, 87వ రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా విషయంలో స్థిరీకరణ సాధించాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అందుకే 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ధారించిన లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యపై పరిమితిని మరో 25 ఏళ్లపాటు పొడిగించాలి. 

రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకూడదు. జనాభా నియంత్రణ చర్యలతో జనాభాను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి’’అని తీర్మానంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను లెక్కచేయకుండా కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తే కలిసికట్టుగా అడ్డుకోవడానికి ఎంపీలతో కూడిన కోర్‌ కమిటీ ద్వారా సమన్వయం చేసుకోవాలని, ఆ మేరకు వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. 

‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌’కు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయానికొచ్చారు. గతంలో జరిగిన డీలిమిటేషన్‌ ప్రక్రియల చరిత్ర, వాటి ఉద్దేశం, ప్రతిపాదిత పునర్విభజన వల్ల తలెత్తే విపరిణామాలపై తమ రాష్ట్రాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే దీనిపై ఇప్పటికే సోషల్‌ మీడియాలో ప్రచారం ప్రారంభించింది.  

సమావేశంలో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి, భగవంత్‌మాన్, కేటీఆర్, డీకే శివకుమార్, సురేశ్‌రెడ్డి, వద్దిరాజు, వినోద్‌కుమార్, మహేశ్‌గౌడ్, మల్లు రవి తదితరులు   

దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు: విజయన్‌ 
ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిదేనని విజయన్‌ తేల్చిచెప్పారు. జనాభా తగ్గించినందుకు ఇస్తున్న బహుమానం ఇదేనా అని మండిపడ్డారు. పునర్విభజనపై ముందుకెళ్లే ముందు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు.  ‘‘ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే లోక్‌సభ సీట్లు ఉత్తరాదిన పెరిగి దక్షిణాదిన తగ్గుతాయి. తద్వారా బీజేపీ లాభపడుతుంది. 

స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే బీజేపీ ఆలోచన’’అని మండిపడ్డారు. జేఏసీ సమావేశం అనంతరం విజయన్‌ ‘ఎక్స్‌’లో పలు పోస్టులు చేశారు. దేశ సమాఖ్య వ్యవస్థపై సంఘ్‌ పరివార్‌ బహిరంగ యుద్ధం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.  

సమాఖ్య ప్రజాస్వామ్యానికి ముప్పు: డీకే 
కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దేశ సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని డీకే శివకుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంచేస్తున్న రాజకీయ దాడిగా అభివరి్ణంచారు. ‘‘సమా­ఖ్య నిర్మాణం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకర్తలు నిర్మించిన సమాఖ్య ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేయొద్దు’’అని కేంద్రానికి సూచించారు. 

‘‘ఆధిపత్యాన్ని అంగీకరించడమా? తిరుగుబాటు చేయడమా? ప్రగతిశీల రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రెండే అవకాశాలున్నాయి. మేం తిరుగుబాటునే ఎంచుకున్నాం’’అని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. జాతీయ వేదికపై దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు.   
 
అన్ని పార్టీలతో చర్చించాలి: నవీన్‌ పట్నాయక్‌ 
పార్లమెంట్‌లో, అసెంబ్లీల్లో ఎన్ని స్థానాలు ఉండాలో నిర్ణయించడానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జేఏసీ భేటీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. డీమిలిటేషన్‌పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 

జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, ప్రజల హక్కులను కేంద్రం కాపాడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అనేది అత్యంత కీలకమైన జాతీయ అజెండా అని నవీన్‌ వివరించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. బీజేడీ తరఫున మాజీ మంత్రి సంజయ్‌ దాస్, మాజీ ఎంపీ అమర్‌ పట్నాయక్‌ భేటీలో పాల్గొన్నారు.

మన ఆమోదం లేకుండానే చట్టాలు: స్టాలిన్‌  
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్‌ చెప్పారు. పునర్విభజన పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. 

కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే పలు రాష్ట్రాలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గరాదు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేస్తే పార్లమెంట్‌లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. మన ఆమోదం లేకుండానే చట్టాలు రూపొందితే మన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. 

సామాజిక న్యాయం దెబ్బతింటుంది’’అని ఉద్ఘాటించారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు. ఈ జేఏసీ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్‌ అన్నారు. ఈ భేటీని ‘జేఏసీ ఫర్‌ ఫెయిర్‌ డీలిమిటేషన్‌’గా పిలుద్దామని ప్రతిపాదించారు. జేఏసీ రెండో భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండో భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నేతలు ఏకాభిప్రాయానికి వచి్చనట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement