
కవిత, నరేందర్ లకు పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఉద్యోగం. అన్యోన్యంగా ఉంటారు. ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకుంటారు. వీకెండ్ పార్టీలు, ఫ్యామిలీ మీట్స్, టూర్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు.
కానీ నెలకో, రెణ్నెళ్లకోసారి గొడవ గ్యారంటీ. చిన్న మాట పట్టింపులతో మొదలై తిట్టుకుని, కొట్టుకునే వరకూ వెళ్తోంది. వీళ్ల గొడవలు చూసి పిల్లలు భయపడుతున్నారు. కలిసుండి ఇలా రోజూ కొట్టుకునేకంటే విడిపోవడమే బెటరని నిర్ణయించుకున్నారు. మ్యూచువల్ డైవోర్స్ కోసం లాయర్ను కూడా సంప్రదించారు. కోర్టుకు వెళ్లకముందు ఒకసారి మేరిటల్ కౌన్సెలింగ్ కు వెళ్లమని ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడని వచ్చారు.
కవిత, నరేందర్ లతో కలివిడిగానూ, విడివిడిగానూ మాట్లాడాక వాళ్ల మధ్య physical intimacy (శారీరక సాన్నిహిత్యం) తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. కవిత శాలరీ ఎంతో కూడా నరేందర్ కు తెలియదు. అడిగినా చెప్పదు. ‘‘ఇంటి ఖర్చులకు నా షేర్ నేను ఇస్తున్నా కదా. నా శాలరీ గురించి నీకెందుకు? డామినేట్ చేయాలని చూస్తున్నావా?’’ అంటూ గొడవ పడుతుంది.
నరేందర్ శాలరీ ఏం చేస్తున్నాడో కవితకు తెలియదు. శాలరీ అంతా ఏం చేస్తున్నావ్? అని అడిగితే ‘‘నేనేదో చేస్తున్నా నీకెందుకు? నీ శాలరీ గురించి నాకు చెప్పనప్పుడు, నా శాలరీ గురించి అడిగే రైట్ నీకు లేదు’’ అని గొడవపడతాడు.
ఇలాంటి గొడవలు వాళ్లకు మామూలే. ఇన్ని గొడవల మధ్యా వాళ్లకున్న సుగుణమేంటంటే... పగలెన్ని గొడవలున్నా రాత్రికి ఒకటైతే అన్ని గొడవలూ సర్దుకుంటాయని బలంగా నమ్ముతారు, ఆచరిస్తారు. కానీ మేరిటల్ రిలేషన్షిప్ బలపడాలంటే, నిలబడాలంటే ఫిజికల్ ఇంటిమసీ ఒక్కటే చాలదని, ఇంకా చాలా కావాలని వాళ్లకు తెలియదు. అందువల్ల ఆ దిశగా వాళ్లెలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా చిన్నచిన్న విషయాలకే పెద్దపెద్ద గొవలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, విడాకుల ప్రయత్నాలు.
జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇలా అనేకమందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం కూడా ఉంటుంది. కానీ బంధాలు బలపడాలంటే అదొక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. వాటిగురించి ఈరోజు తెలుసుకుందాం.
Types of Intimacy
Physical Intimacy: చేతులు పట్టుకోవడం, ముద్దులు పెట్టుకకోవడం, హగ్ చేసుకోవడం వంటివి ఫిజికల్ ఇంటిమసీకి ఉదాహరణలు. అయితే కవిత దీన్ని బహిరంగంగా ప్రదర్శిస్తుంది, నరేందర్ కు అది నచ్చదు. ఫిజికల్ ఇంటిమసీ బెడ్రూమ్ కే పరిమితం కావాలనేది అతని ఫిలాసఫీ.
Emotional Intimacy: ఆఫీస్ లో ఆరోజు ఏం జరిగింది? పని ఒత్తిడి ఎలా ఉంది? ఏమైనా ఆందోళనగా ఉందా? భయమేస్తుందా? ఇలాంటి ఎమోషనల్ విషయాలను మాట్లాడుకోండం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవిత, నరేందర్ ల మధ్య ఇది శూన్యం.
Intellectual Intimacy: చదివిన పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మాట్లాడుకోవడం, వారి ఆలోచనలు, అనుభవాలు పంచుకోవడం, చర్చించుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. కవితకు ఫిక్షన్ బుక్స్ అంటే ప్రాణం, నరేందర్ కు అసలు బుక్స్ అంటేనే చిరాకు. ఎప్పుడూ టీవీలో ప్రవచనాలు వింటూ ఉంటాడు.
Experiential Intimacy: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలిసి పనిచేయడం, సమయాన్ని గడపడం ముఖ్యం. కవిత, నరేందర్ ల మధ్య ఇది ఫర్వాలేదు. ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకుంటారు.
Spiritual Intimacy: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను పార్టనర్ తో చర్చించడమే స్పిరిచ్యువల్ ఇంటిమసీ. నరేందర్ పరమ భక్తుడు, కవిత ఆర్జీవీ రామూయిజం ఫాలోయర్. ఇది చాలు కదా గొడవలు పడటానికి.
ఆత్మీయతకు ఆటంకాలు
ప్రతి రిలేషన్ లోనూ విభేదాలుంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం.
కోపం, చిరాకు, అపనమ్మకంతో పార్టనర్ నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఇంటిమసీని దెబ్బతీస్తుంది.
మితిమీరిన పని, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కూడా దంపతుల మధ్య ఇంటిమసీని దూరం చేస్తుంది.
పార్టనర్ తో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఇంటిమసీని పెంపొందించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతే అది మీ ఇంటిమసీని దెబ్బతీస్తుంది.
కొన్నిసార్లు, కొంతమంది గతానుభవాలు, గాయాల వల్ల పార్టనర్ తో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే fear of intimacy అంటారు. కవితలో ఇది కనిపించింది.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే అన్ని రకాల ఇంటిమసీలు ఉండేలా చూసుకోవడం అవసరం. కవిత, నరేందర్ లకు వారి ఇంటిమసీల మధ్య విభేదాలు వివరించడంతోపాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ఎక్సర్ సైజ్ లు చేయించాను. కొద్ది సెషనల్లోనే వారి మధ్య నిజమైన సాన్నిహిత్యం పెరిగింది. వారిప్పుడు సంతోషంగా జీవిస్తున్నారు.
ఇలా చేయండి...
మీ జీవితంలోనూ సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి.
ఫిజికల్ ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకుని మాట్లాడుకోవడం, హగ్ చేసుకోవడం ఫిజికల్ ఇంటిమసీని పెంపొందిస్తాయి.
మీ పార్టనర్ చెప్పే మాటలు వినడానికి, మీ ఆలోచనలు పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమయం పెంచుకోవడం ఎమోషనల్ ఇంటిమసీని పెంచుతుంది.
భోజనం చేస్తున్నప్పుడు లేదా మీ పార్టనర్ తో కలిసి టీవీ చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్ దూరంగా ఉంచండి.
ఇద్దరూ కలిసి కొత్త విషయాలను అనుభవించడం సరదాగా ఉంటుంది. అందుకే మీరిద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి.
కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం ఇంటలెక్చువల్ ఇంటిమసీని పెంపొందిస్తుంది.
మీకు నమ్మకమున్నా లేకపోయినా పార్టనర్ విశ్వాసాలను గౌరవిస్తూ అప్పుడప్పుడూ స్పిరిచ్యువల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com