సారిక 28 ఏళ్ల మార్కెటింగ్ ప్రొఫెషనల్. లీల తన చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చదువుకున్నారు. లీలపై సారికకు మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇటీవలి కాలంలో లీలతో మాట్లాడిన ప్రతిసారీ సారిక తీవ్ర ఎమోషనల్ స్ట్రెస్ ను అనుభవిస్తోంది. ఆ విషయం లీలతో చెప్పలేక, తన స్నేహాన్ని వదల్లేక, తనలో తానే బాధపడుతోంది.
సారిక తన ఆఫీసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినప్పుడు లీల ఆమెపై అసూయను వ్యక్తం చేసింది. ‘‘నువ్వెలా సక్సెసవుతున్నావో నాకు తెలియదా ఏంటి’’ అంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడూ తన సమస్యల గురించే మాట్లాడుతూ ఉంటుంది. వాటిని పరిష్కరించుకునేందుకు సారికను ఉపయోగించుకుంటోంది. ఎప్పుడైనా పని ఒత్తిడిలో ఉంటి పట్టించుకోకపోతే ‘‘కాస్త సక్సెస్ రాగానే నీకు కళ్లు నెత్తికెక్కాయే. నన్నసలు పట్టించుకోవడం లేదు, నా మాటే వినడం లేదు’’ అంటూ సూటిపోటి మాటలు మాట్లాడుతోంది. తాను ఎంత చేసినా లీల అలా మాట్లాడుతుండటంతో సారిక బాధపడుతోంది. లీలతో స్నేహం కొనసాగించాలా, వదిలేసుకోవాలో అర్థం కావడంలేదు.
ఈ నేపథ్యంలో ‘కనెక్షన్ కార్నర్’ కాలమ్ తన దృష్టికి వచ్చింది. అన్ని ఆర్టికల్స్ చదివాక, తన సమస్యకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీసుకు వచ్చి, తన సమస్య మొత్తం వివరించింది.
‘‘నేనెంత పాజిటివ్ గా ఉండాలని ప్రయత్నించినా నావల్ల కావడంలేదు సర్. లీలతో ఫ్రెండ్షిప్ టాక్సిక్ గా మారింది. నేను నిజంగానే తనతో సరిగా ఉండటంలేదేమోనని గిల్టీ ఫీలింగ్ వస్తోంది. నా మెంటల్ హెల్త్ దెబ్బతింటోంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
సారిక కష్టాలివీ...
⇒ లీలను కలిసిన ప్రతిసారీ తన సమస్యల చిట్టా విప్పుతుంది. వాటిని వినీవినీ సారిక మానసికంగా అలసిపోతుంది.
⇒ సారిక సలహాలు పాటించకపోగా అవసరానికి తనకు సహాయపడటంలేదంటూ లీల పదే పదే మాట్లాడటం వల్ల సారిక అపరాధభావానికి లోనవుతోంది. అందువల్ల ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింటోంది.
⇒ సారిక తన ఆఫీసు విషయాలు లేదా తన సక్సెస్ గురించి చెప్పినప్పుడు ఏమాత్రం పట్టించుకోకపోగా, అది ఎవరైనా సాధిస్తారంటూ తక్కువ చేసి మాట్లాడుతోంది.
⇒ సారిక సక్సెస్ పట్ల లీల ఆనందపడకపోగా అసూయను వ్యక్తం చేస్తోంది. అది సారికను నిరుత్సాహపరుస్తోంది.
మొత్తంగా చెప్పాలంటే లీల టాక్సిక్ ఫ్రెండ్షిప్ వల్ల సారిక మానసికంగా బాధపడుతోంది. అందుకే లీలతో స్నేహాన్ని కొనసాగించాలా, వద్దా అనే ఆలోచనలో పడింది.
టాక్సిక్ స్నేహాలను వదిలించుకోవాలి...
ఒక వ్యక్తి సంతోషంగా జీవించడంలో స్నేహాలది ప్రధాన పాత్ర. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని స్నేహాలు విషపూరితంగా ఉంటాయి. వాటివల్ల లాభం లేకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అలాంటి స్నేహాలను వీలైనంత దూరంగా ఉండటం లేదా త్వరగా వదిలించుకోవడం మంచిది. కొనసాగించక తప్పనిసరి పరిస్థితులుంటే ఆ మేరకు మనసును సిద్ధం చేసుకోవాలి. సారిక సమస్యను అర్థం చేసుకున్నాక ఆమెకు కౌన్సెలింగ్ ప్రారంభించాను.
⇒ ఏరోజుకారోజు తన ఫీలింగ్స్ ను డైరీలో రాయడం ద్వారా తన స్నేహాల్లో ఏవి సంతోషాన్నిస్తున్నాయో, ఏవి బాధపెడుతున్నాయో సారిక తెలుసుకుంది.
⇒ లీల కాల్ చేసిన ప్రతిసారీ పనులు పక్కన పెట్టి మరీ వెళ్లాల్సిన అవసరం లేదని సారిక తెలుసుకుంది. వారానికి ఒకసారి, 15 నిమిషాలు మాత్రమే కలవాలని నిర్ణయించుకుంది.
⇒ తన గిల్టీ ఫీలింగ్ ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు నిర్దేశించిన ఎక్సర్సైజ్ లను ప్రాక్టీస్ చేసింది.
⇒ మెడిటేషన్ ద్వారా తన మానసిక స్థితిని అదుపులో ఉంచుకొనడం ప్రారంభించింది.
⇒ రోజూ వ్యాయామం, యోగా చేయడం ద్వారా ఆందోళనకు పగ్గాలు వేయగలిగింది.
⇒ తనను సమర్థించే, ప్రోత్సహించే స్నేహితుల సంఖ్యను పెంచుకుంది.
⇒ లీల మాటల్లోని నెగెటివిటీని అధిగమించడం నేర్చుకుంది.
⇒ రోజూ పాజిటివ్ అఫర్మేషన్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా భావోద్వేగాలపై అదుపు సాధించగలిగింది.
అలా సారిక కేవలం నాలుగు సెషన్లలోనే తన సమస్యను అధిగమించింది. లీలతో స్నేహం తెంపేసుకోకుండానే, ఆమె మాటల్లోని నెగెటివిటీని పక్కన పెట్టేయడం నేర్చుకుంది. ఫలితంగా మానసికంగా ప్రశాంతంగా ఉండి, తన కెరీర్ పై మరింత దృష్టి సారించి, మరింత సక్సెస్ సాధించగలిగింది. మీకూ అలాంటి స్నేహాలుంటే వీలైనంత వరకూ తగ్గించుకోండి. అది మీ మానసిక ఆరోగ్యానికి ముఖ్యం.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment