కనెక్షన్ లేదా రిలేషన్షిప్ అనగానే అందరికీ లవర్స్ లేదా కపుల్స్ గుర్తొస్తారు. వారి మధ్య వచ్చే సమస్యలే గుర్తొస్తాయి. కానీ స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో సంబంధం కూడా ముఖ్యం. అందుకే మన ‘కనెక్షన్ కార్నర్’లో ఇవన్నీ చర్చించుకుందాం.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ మూవీ చూశారా? అందులో అన్నాదమ్ములిద్దరూ రోజూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అన్నకు సమస్య వచ్చినప్పుడు తమ్ముడు అండగా నిలబడతాడు. అదే బంధాలకు ఉండే ప్రాధాన్యం. అయితే అన్ని సందర్భాల్లోనూ అలా సర్దుకుపోరు. కొన్నిసార్లు అన్నదమ్ముల మధ్య గొడవలు పెరిగి పెద్దవై పోలీస్ కేసుల వరకూ వెళ్లిన సందర్భాలు కూడా మనం వార్తల్లో చూస్తుంటాం. అలాంటి ఒక కేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం.
రోహిత్, సిద్ధార్థ్ అన్నదమ్ములు. 32 ఏళ్ల రోహిత్ స్వంత వ్యాపారం పెట్టి సక్సెస్ అయ్యాడు. 28 ఏళ్ల సిద్ధార్థ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వారి రిలేషన్షిప్ బాగా దెబ్బతింది. తరచుగా వాదనలు, అపార్థాలు, సెటైర్లు.
తానెంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టి 32 ఏళ్లకే సక్సెస్ సాధించినా, తనను ‘డబ్బు మనిషి’ అంటున్నాడని సిద్ధార్థ్ పై రోహిత్ కు కోపం. మరోవైపు తక్కువ సంపాదిస్తున్నాడని రోహిత్ కు తానంటే చిన్నచూపని సిద్ధార్థ్ కు బాధ. అలా ఇద్దరూ తరచూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. అవి చిలికిచిలికి గాలివానగా మారి ఇద్దరూ కొట్టుకునేవరకూ వెళ్లింది.
ఆ వయసుకొచ్చిన పిల్లలు కొట్టుకోవడం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థంకాక వారిద్దరినీ కౌన్సెలింగ్ కు వెళ్లమని అడిగారు. వాళ్లిద్దరూ అయిష్టంగానే వచ్చారు.
పరస్పర గౌరవం లేకపోవడమే సమస్య...
మొదటి సెషన్ లో వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడాను. పరస్పర గౌరవం లేకపోవడమే వారి సంఘర్షణకు మూలమని అర్థమైంది. అందుకే వారి విభేదాలు నిర్మాణాత్మకంగా కాకుండా వ్యక్తిగత దాడులుగా మారాయి.
👉 సోదరులిద్దరూ వారి కెరీర్ ఛాయిస్, వ్యక్తిగత నిర్ణయాలను తప్పుగా అంచనా వేసుకుంటూ, వారి పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటారు.
👉 ఏ ఒక్కరూ మరొకరి దృక్పథాన్ని వినకపోగా ఒకరి ఐడియాకు మరొకరు అంతరాయం కలిగిస్తున్నారు లేదా తిరస్కరిస్తున్నారు.
👉వారి సంభాషణలు తరచుగా సర్కాస్టిక్ కామెంట్స్ (వ్యంగ్య వ్యాఖ్యలు), నెగెటివ్ జడ్జ్ మెంట్స్ (ప్రతికూల తీర్పులు) గా మారి విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.
👉దీంతో వారిద్దరూ సరిగా కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నారు. తన సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడని అపార్థం చేసుకుంటున్నాడు. అతని వైఖరిని అంగీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
శ్రద్ధగా వినడమే తొలి అడుగు...
ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఎడమొహం పెడమొహంగా మారి విభేదాలను ఇంకా పెద్దవి చేసుకుంటారు. కానీ సోదరులిద్దరూ ఒకరి కెరీర్ ఛాయిస్, లైఫ్ స్టైల్, వాల్యూస్ ను అర్థం చేసుకోవడం, అభినందించడం అవసరం. ఆ మేరకు సెషన్స్ ప్లాన్ చేశాను.
👉ప్రారంభ సెషన్‌లలో ‘యాక్టివ్ లిజనింగ్’ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసాను. అంటే సోదరుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా వినాలి. అతని దృక్పథంతో విభేదించినప్పటికీ, అతని భావోద్వేగాలను అంగీకరించాలి. విమర్శలకు బదులుగా నిర్మాణాత్మక సూచనలివ్వాలి.
👉తర్వాత ‘ఐ ఫీల్‘ స్టేట్‌మెంట్ టెక్నిక్‌ని ఇచ్చాను. అంటే సోదరుడిని నిందించడానికి బదులుగా ‘నాకిలా అనిపించింది’, ‘నేను బాధపడ్డాను’ అని తన అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని మాత్రమే వ్యక్తపరచాలి. ఈ టెక్నిక్ వారు వాదించుకోకుండా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడింది.
👉 ఫైనాన్షియల్ సక్సెస్ సాధించడమే రోహిత్ లక్ష్యమైతే, అకడమిక్ గా టాప్ లో ఉండటమే సిద్ధార్థ్ లక్ష్యం. ఒకరి ఎంపికను మరొకరు అర్థం చేసుకునేలా చర్చించుకునేలా ప్రోత్సహించాను.
👉 వారిద్దరూ ఒకరి ఛాయిస్ ను మరొకరు ఎలా చూశారో వివరిస్తూ మనసువిప్పి లెటర్లు రాసుకోమన్నాను. ఇది వారి అభిప్రాయాలను రీఫ్రేమ్ చేసి, ఒకరినొకరు అభినందించుకునేలా చేసింది.
అలా పది సెషన్లలో రోహిత్, సిద్ధార్థ్ ఒకరినొకరు పూర్తిగా అర్థంచేసుకున్నారు. సర్కాజం, క్రిటిసిజం లేకుండా ఎలా కమ్యూనికేట్ చేయవచ్చో నేర్చుకున్నారు. ఒకరి ఛాయిస్ ఏదైనా దాన్ని గౌరవించాలని, నచ్చకపోతే తన అభిప్రాయాన్ని నిర్మాణాత్మంగా వివరించాలని అర్థం చేసుకున్నారు. చక్కగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమ కెరీర్ ఛాయిస్ ఏదైనా కుటుంబానికి అండగా నిలబడటం, తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ముఖ్యమని అర్థం చేసుకుని, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అది చూసి వారి తల్లిదండ్రులు సంతోషించారు.
సోదరులనే కాదు, టీనేజ్, కపుల్, వర్క్ రిలేషన్షిప్స్ లో పరస్పర గౌరవానికి కీలక పాత్ర. గౌరవం ఉండటమే కాదు, ఉన్నట్లు కనిపించాలి. లేదంటే రోహిత్, సిద్ధార్థ్ లా అపార్థాలు, గొడవలు తప్పవు. అందుకే తీర్పులివ్వకుండా వినడం, కమ్యూనికేషన్ ను మెరుగుపరచుకోవడం, గౌరవప్రదమైన సరిహద్దులను సెట్ చేసుకోవడం, తీర్పులను రీఫ్రేమ్ చేసుకోవడం అవసరం.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
www.psyvisesh.com
Comments
Please login to add a commentAdd a comment