
ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి. ఏ పునాదుల ఆధారంగా మానవ సంబంధాలు నిర్మితం అవుతున్నాయి... కాలక్రమంలో ఎలాంటి కారణాలు మానవ సంబంధాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఎలాంటి వ్యవహారాలు నైతిక విలువలను పరిహాసం పాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చకు దారితీసే సంగతులు. వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న భర్తను చంపేసే భార్యలు, కన్న పిల్లలను చంపేసే తల్లులు, అదేమాదిరి పురుషులు మనకు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఆ వివాహేతర సంబంధం కంటె వారికి ఏదీ ఎక్కువ కాదేమో అనే అభిప్రాయం కలుగుతుంటుంది. ఇలాంటి వార్తలు చూసినప్పుడు.
తాజాగా ఒకేరోజు దినపత్రికల్లో కనిపించిన నాలుగు వేర్వేరు వార్తలు గమనించినప్పుడు.. అసలు మానవసంబంధాలు ఎంత దారుణంగా పతనం అవుతున్నాయో కదా.. అనే అనుమానం కలుగుతుంది. అనుబంధాల్లో నైతికత అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా మారిపోతున్నది కదా అని కూడా భయమేస్తుంది. ముందు ఆ నాలుగు ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఉదాహరణ 1 :
వైవాహిక బంధంలో కొనసాగుతున్న మహిళ, మరొక ప్రియుడితో శారీరక సంబంధం కలిగి ఉంటే అది నైతికతకు సంబంధించిన విషయమే తప్ప, నేరం కాదు అని దిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పైగా ‘భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలానికి చెందిన భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని కూడా వ్యాఖ్యానించింది.
ఉదాహరణ 2 :
ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో రాహుల్ అనే వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. మరో పదిరోజుల్లో పెళ్లి. ఈలోగా ఆ అమ్మాయి తల్లి స్వప్న.. కాబోయే అల్లుడితో కలిసి పారిపోయింది. వారి కుటుంబీకులు పోలీసు కేసు పెట్టారు. అప్పటికే నేపాల్ సరిహద్దుల దాకా పారిపోయిన వారు.. కేసు సంగతి తెలిసి తిరిగివచ్చారు. కానీ స్వప్న మాత్రం.. కాబోయే అల్లుడితోనే జీవితం పంచుకుంటానని భర్త తనకు వద్దని ఇంకా మొండిపట్టుపడుతోంది.
ఉదాహరణ 3 :
ఉత్తరప్రదేశ్ లోని బదాయూపట్టణంలో మరో ఉదంతం జరిగింది. మమత అనే 43 ఏళ్ల మహిళ ఇంట్లో డబ్బు నగలు తీసుకుని తన కుమార్తెకు మామ అయిన శైలేంద్రతో కలిసి పారిపోయింది. వరుసకు అన్నయ్య అయ్యే అతనితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ప్రస్తుతం పరారయ్యారు.
ఉదాహరణ 4 :
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ఫూర్ అనే ఏపీఎస్పీ కానిస్టేబుల్ మంగళగిరిలో నివాసం ఉంటాడు. అతనికి స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె కుమార్తెతో కలిసి నంద్యాల శివార్లలో నివాసం ఉంటోంది. నాలుగురోజుల సెలవుమీద ఆమె ఇంటికి వచ్చిన ఫరూక్ ఆమె కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై గొడవ అయింది. కుమార్తె స్నేహితుడితో కూడా గొడవ అయింది. దీంతో ఆ యువకుడు, మరోనలుగురు కలిసి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఫరూక్ ను హత్య చేశారు.
మానవ సంబంధాల గురించి చాలా మంది పెద్దలు చాలా చాలా ఆదర్శాలను, నీతులను వల్లెవేస్తూ ఉంటారు. కానీ.. మానవ సంబంధాల్లో ఉండే చేదు వాస్తవాన్ని చాలా నిష్కర్షగా చెప్పాడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని తేల్చేశాడు. సమాజంలో చాలా వ్యవహారాలను భిన్నమైన కోణంలో చూడగలిగిన ప్రతిసారీ మార్క్స్ చెప్పినది అక్షర సత్యం అని అనిపిస్తుంది.
కానీ పైన చెప్పుకున్న నాలుగు ఉదాహరణలు గమనిస్తే.. మానవ బుద్ధుల్ని నడిపిస్తున్నది సెక్స్ సంబంధాలేనా? అనే అనుమానం మనకు కలుగుతుంది. 497 అధికరణం రద్దయిపోయింది తను చేసిన పనిని నేరం అని ఏ కోర్టు చెప్పజాలదు గనుక.. ఓ వివాహిత.. భర్తకు తెలిసినా నిర్భయంగా తన ప్రియుడితో బంధాన్ని కొనసాగించింది. కూతురుకు కాబోయే భర్తతో.. ముందే లేచిపోయింది మరో తల్లి. వరుసకు అన్నయ్యతో అదే ఘోరానికి తెగబడింది మరో ఇల్లాలు. ఏపీఎస్పీ కానిస్టేబులు ఏకంగా తల్లితో వివాహేతర సంబంధంలో ఉంటూ కూతురులాంటి అమ్మాయిపై అత్యాచారానికి తెగబడి హతమయ్యాడు. ఇలాంటి దారుణమైన బుద్ధులు ఎలా వ్యాప్తిలోకి వస్తున్నాయి.
నేరాలు జరిగినప్పుడు.. చంపిన వారిని ముక్కలు చేసి ఆచూకీ తెలియకుండా మార్చేస్తున్నప్పుడు.. అలాంటి దారుణాలు చూసి ఓటీటీ సినిమాలు మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయని మనం నీతులు వల్లిస్తుంటాం. కానీ.. ఇలాంటి ఘటనలు ఎలా ప్రభావితం అవుతున్నాయి. నైతిక విలువల పట్ల ప్రజల్లో కనీసస్పృహ లేకపోతుండడమే ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నదనే అభిప్రాయం కలుగుతోంది. పరిష్కారం అంతుచిక్కని సమస్య లాగా సమాజ గతిని ఈ పరిణామాలు దిగజారుస్తున్నాయి.
...ఎం. రాజ్యలక్ష్మి