
డాక్టర్! మా చెల్లెలి వయస్సు 28 ఏళ్లు. డిగ్రీ పాసయ్యింది. ఐదేళ్లుగా మానసిక వ్యాధికి మందులు ఇప్పిస్తున్నాం. తనలో తాను నవ్వుకోవడం, గొణుక్కోవడం, ఎవరేది అంటున్నా తన గురించేననడం. చెవిలో ఎవరివో మాటలు వినబడుతున్నాయనడం... పనేమీ చేయదు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వైద్యం చేయించిన తర్వాత చాలా మెరుగైంది. కానీ పూర్తిగా మామూలు మనిషి కాలేదు. మా నాన్న లేరు. చెల్లికి పెళ్ళి చేయాలని అమ్మ తాపత్రయం. చెల్లి మానసిక స్థితి గురించి చెప్పకుండా చేస్తే తర్వాత సమస్యలొస్తాయని భయం. ఇలాంటి వారికి పెళ్ళి చెయ్యొచ్చంటారా? దీనికి పరిష్కారం ఉందా?
– ఉదయరాణి, హైదరాబాద్
మీరు చెప్పినదాన్ని బట్టి మీ చెల్లెలు...‘స్కిజోఫ్రీనియా’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా సంవత్సరాలపాటు డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కాకపోవచ్చు. షుగర్, బి.పి. లాగా స్కిజోఫ్రీనియాని కూడా మందులతో అదుపు చేయవచ్చే తప్ప, పూర్తిగా నయం చేయడం కష్టమే! ఇలాంటి వారికి కేవలం మందులే కాకుండా, కొంతకాలం ‘రిహాబిలిటేషన్’ సెంటర్‌లో ఉంచితే, ఆమె యాక్టివ్‌గా, నలుగురిలో కలిసేటట్లుగా తన పనులే కాకుండా, ఇంటిపని, వంటపని, పిల్లలను చూసుకోవడం లాంటి లక్షణాలు ఆమెలో పెంపోదించేట్లుగా శిక్షణ ఇస్తారు.
ఇలా చేసిన తర్వాతే అవతలివారికి విషయం చెప్పి వారు ఒప్పుకుంటే వివాహానికి అభ్యంతరం లేదు. చెప్పకుండా చేయడం అనర్థదాయకం. అన్ని విషయాలు చెబితే కొందరు ఒప్పుకోవచ్చు. అవసరమైతే డాక్టరు దగ్గరికి కూడా అవతలి పార్టీని తీసుకొచ్చి వారి అనుమానాలు నివృత్తి చేయడం మంచిది. అన్నీ చెప్పి వాళ్ల సమ్మతి మీద పెళ్లి చేసిన సందర్భాలలో భవిష్యత్తులో ఏమైనా తేడాలే వచ్చినప్పుడు ఒకవేళ వారు విడాకుల కేసు వేసినా కోర్టు అంత సులభంగా విడాకులు మంజూరు చేయదు.
ఎందుకంటే గతంలో ఒకరు తన భార్యకు స్కిజోఫ్రీనియా ఉంది కాబట్టి విడాకులివ్వాలని కోర్టుకెక్కాడు. అయితే స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చినంత మాత్రాన విడాకులు ఇవ్వలేం, కానీ ఆ వ్యాధి వలన ఆ భర్త, పిల్లలు, కుటుంబం ఏమేరకు నష్టపోయిందనే విషయాలను నిర్ధారించగలిగితేనే అలాంటి కేసుల విషయంలో విడాకులు ఇవ్వాలా, వద్దా... అనే దాన్ని నిర్ణయించవలసి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ జడ్జిమెంట్‌ను ఇప్పటికీ మన దేశంలో ప్రామాణికంగా పాటిస్తూ ఉన్నారు.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment