
నాకు పెళ్ళయి 3 నెలలు అవుతోంది. నా భార్య బాగా చదువుకుంది. ఉద్యోగం చేస్తుంది. పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండొచ్చు అని ఇద్దరం ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళి సమయంలో మా అత్త, మామ వాళ్ళు ఇష్టపూర్వకంగానే నాకు కొంత కట్నం కూడా ఇచ్చారు. పెళ్ళైన ఒక నెల వరకూ చాలా బాగుంది. కానీ అంతలోనే బాగా మారిపోయింది. ప్రతిదానికి అలక, ఏ విషయాన్నైనా సాగదీయడం, నా జీతం నీకు ఇవ్వను, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాననడం, మా అమ్మానాన్నకు డబ్బులు ఇవ్వొద్దు అనడం, వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు అని తరచూ గొడవలు చేయడం, గొడవ అయిన ప్రతిసారి తన కట్నం డబ్బులు తనకు ఇచ్చేయమని రచ్చ చేస్తుంది.
గంటలు గంటలు మేకప్ వేసుకోవడం, తయారయి ఫోటోలు దిగడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తెలియని వాళ్ళతో కూడా గంటలు గంటలు చాటింగ్ చేయడం... వద్దంటే ఏడుస్తోంది. తల గోడకేసి కొట్టుకుంటుంది. మమ్మల్ని బెదిరించడం కోసం తనకు తానే చిన్న చిన్న గాయాలు చేసుకుంటుంది. నేను తనతో ఎంతోమంచి జీవితాన్ని ఊహించుకున్నాను. నా కలల ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నన్ను ఈ సమస్య నుంచి బయటకు తీసుకువచ్చే సలహా ఇవ్వగలరు.
– ఆదినారాయణ, హైదరాబాద్
ముందుగా మీరు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. అలాగే కలహాలు లేని కాపురాలు కూడా ఉండవు. తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వ లక్షణాలు, పెరిగిన వాతావరణం ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అతిగా అలగడం, మొండితనం, ఓర్వలేనితనం, తరచు మానసిక సంయమనం కోల్పోవడం, విపరీతమైన కోపం, తమని తాము గాయపరచుకోవడం అనేవి సాధారణంగా ‘బార్డర్‌లైన్ పర్సనాలిటీ’ అనే ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళలో చూస్తాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఇతరులతో అంత సులభంగా సర్దుకుపోలేరు.
తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఒకరకంగా కంట్రోల్ చేయాలని అనుకుంటారు. మీ అత్తమామల సహాయం తీసుకుని మీ భార్యాభర్తలిద్దరూ, మంచి సైకియాట్రిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్‌ని సంప్రదించండి. మీ ఇద్దరితో వివరంగా మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు మానసిక వైద్యులు అందిస్తారు. ఆమె మనస్తత్వాన్ని ముందు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
తన పరిస్థితి గురించి మీకు అవగాహన వస్తే, తనతో ఎలా మసులుకోవాలో తెలిసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరూ మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా కౌన్సెలింగ్ తీసుకుంటే మంచిది. మీరు తొందరపడి ఎలాంటి తీవ్ర నిర్ణయమూ తీసుకోకండి. మీ బంధాన్ని తెంచుకోవటం సులభం కావచ్చు. దాన్ని జాగ్రత్తగా పదికాలాల పాటు నిలబెట్టుకోవాలంటే ఇరువైపుల నుండి కొంత సర్దుబాటు, సహనం, నిరీక్షణ, త్యాగం అవసరం. మీరు విడాకులు తీసుకున్నా ఇంతకంటే మంచి జీవిత భాగస్వామి దొరుకుతుందన్న గ్యారెంటీ కూడా ఉండకపోవచ్చు. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment