
కర్ణాటక: బెంగళూరులో హైప్రొఫైల్ పసికందు కిడ్నాప్ కేసులో దోషికి కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. వివరాలు.. సైకియాట్రిస్టుగా పనిచేసే బెంగళూరు విజయనగరవాసి డా.రశ్మి నిందితురాలు. 2020 మే 29న వాణివిలాస్ ఆసుపత్రిలో ఓ జంటకు పుట్టిన మగబిడ్డను కొన్ని గంటలలోపే రశ్మి అపహరించింది. వార్డు కాపలాదారు ద్వారా తల్లికి నిద్రమాత్రలు కలిపిన పాలను తాగించింది, ఆమె నిద్రలోకి జారుకోగానే శిశువును ఎత్తుకుని పరారైంది. తరువాత కొప్పళలో ఓ రైతు కుటుంబానికి అప్పగించింది. మీరు గతంలో సరోగసి కోసం ప్రయత్నించారు కదా, ఆ బిడ్డే ఈ శిశువు అని చెప్పి వారి నుంచి రూ. 14 లక్షలను వసూలు చేసింది.
ఏడాదిన్నర తరువాత ఆచూకీ
బాధితుల ఫిర్యాదు మేరకు బసవనగుడి, చామరాజపేటే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు ఏడాదిన్నర తరువాత చిన్నారి ఆచూకీని గుర్తించారు. కానీ అసలైన తల్లిదండ్రులు తామంటే, తామని రెండు జంటలు గొడవకు దిగాయి. దీంతో కోర్టు అనుతితో డీఎన్‌ఏ టెస్టులు చేయించి, బెంగళూరుకు చెందిన జంటే అసలైన తల్లిదండ్రులని నిర్ధారించారు. నిందితురాలు రశ్మిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్ వేశారు. సులభంగా డబ్బు సంపాదనకు ఈ పనికి పాల్పడినట్లు తెలిపింది. బుధవారం తుది విచారణ జరిపిన నగర సీసీహెచ్ 51వ కోర్టు, నిందితురాలు రశ్మి నేరం రుజువు కావడంతో పై మేరకు తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment