
మా పెళ్ళయి 15 సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మొదటి నుంచి మా ఆయన నన్నెంతో ప్రేమించేవారు. కానీ ఇటీవల 2 సంవత్సరాల నుండి అనుమానంతో వేధిస్తున్నాడు. ప్రత చిన్న విషయానికీ ఆయనకు నాపైన అనుమానమే! చివరకు నా అన్నా తమ్ముడితో మాట్లాడినా అనుమానమే! ఒకప్పుడు తరచు సినిమాకో, హోటల్‌కో తీసుకెళ్ళే ఆయన, ఇపుడు అవన్నీ పూర్తిగా మానేశారు. నన్ను ఒక విధంగా హౌస్ అరెస్ట్ చేసి, బయట లోకమే లేకుండా చేశారు. చివరకు ఇంట్లో మగ దేవుళ్ళ పటాలు కూడా తీసివేసి, పూజలు కూడా చేసుకోనివ్వడం లేదు. ప్రమాణంగా చెప్తున్నాను. నాకసలు అలాంటి ఆలోచనలే లేవు. ఈ విషయాలు ఎవరితో చెప్పుకోలేక ఆయన బాధలు పడలేక ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తోంది. నన్ను బయటకు కదలనివ్వడం లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపిస్తారనే ఆశిస్తున్నాను.
– ఒక సోదరి విజయవాడ
జ. మీ మనోవేదనను అర్థం చేసుకున్నాను. మగవారినే కాదు, మగ దేవుళ్ళను కూడా చూడొద్దు, పూజించొద్దు అనే స్థాయికి వెళ్ళాడంటే అది ఖచ్చితంగా మానసిక జబ్బే! ‘డెల్యూజనల్ డిసాస్టర్’ లేదా ‘΄ారనాయిడ్ సైకోసిస్’ అనే ఈ తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు లేదా వారసత్వంగా కూడా కొందరికి ఇలాంటి మానసిక జబ్బు వచ్చే అవకాశముంది.
ఇలాంటి ప్రవర్తన కూడా ఒక మానసిక రుగ్మతేనన్న విషయం తెలియక కొందరు మానసిక వ్యాధి అంటే ‘పిచ్చి’ పట్టిందని అంటారనే భయంతో బయటకు చెప్పుకోలేకపోవడం లేదా ఆ వ్యక్తి డాక్టరు దగ్గరకు చికిత్సకు వచ్చేందుకు సహకరించకపోవడం వల్ల జబ్బు ముదిరిపోయి, తీవ్రస్థాయికి వెళ్ళే ప్రమాదముంది. మీ దగ్గరి బంధువుల సహాయం తీసుకొని, ఏదో ఒకవిధంగా ఒకసారి మీరు హాస్పిటల్‌కి రాగలిగితే పూర్తి వివరాలు తీసుకుని, ఇలాంటి వారికి ఎలాంటి వైద్యం చేయాలో మీతో వివరంగా చర్చించడానికి వీలవుతుంది. కొత్త మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం ప్రకారం అయన ఒప్పుకోకపోయినా వైద్యం చేసే అవకాశముంది. ఆలస్యం చేయకుండా ముందుకెళ్ళండి!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com