Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? | Dr Indla Vishal Reddy's Suggestions And Precautions For Major Depressive Disorder | Sakshi
Sakshi News home page

Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?

Published Thu, Aug 29 2024 9:10 AM | Last Updated on Thu, Aug 29 2024 9:10 AM

Dr Indla Vishal Reddy's Suggestions And Precautions For Major Depressive Disorder

మన(సు)లో మాట

నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్‌ ఆలోచనలతో నిండి, మైండ్‌ మొద్దుబారి, బ్లాంక్‌గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్‌ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురం

మీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.

డిప్రెషన్‌ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్‌ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.

మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్‌లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్‌. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్‌ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్‌ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండ

టీనేజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్‌ డిజార్డర్‌ లేదా అపోజిషనల్‌ డిఫియెంట్‌ డిజార్డర్‌ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. 

అంతేకాకుండా స్మోకింగ్‌ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్‌ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్‌ బిహేవియర్‌ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.


– డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

ఇవి చదవండి: సిటీ కాప్స్‌.. గుడ్‌ మార్నింగ్‌ హైదరాబాద్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement