టీనేజ్ సైకాలజీ..
మీ ఇంట్లో టీనేజర్లు ఉన్నారా? వాళ్లతో డీల్ చేయడం కష్టమనిపిస్తోందా? ‘అయ్యో, వాళ్లతో వేగలేక చస్తున్నాం’ అంటున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే.
నిజంగానే టీనేజర్లను డీల్ చేయడం ఒక ప్రత్యేకమైన, సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. ఎందుకంటే టీనేజ్ అనేది అనేకానేక ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ మార్పులు జరిగే సమయం. అందుకే ఆ వయసులో చాలా దుడుకుగా, దూకుడుగా ఉంటారు. ఎవరే సలహా ఇచ్చినా పట్టించుకోరు. ఎదురు మాట్లాడతారు. అందువల్లే ఈ వయసు పిల్లలతో తల్లిదండ్రులకు తరచు గొడవలు అవుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే ఈ దశలో జరిగే మార్పులను అర్థం చేసుకోవడం, ఆ అవగాహనతో మార్గనిర్దేశం చేయడం అవసరం.
మెదడులో అల్లకల్లోలం..
టీనేజర్‌ను అర్థం చేసుకోవాలంటే ముందుగా వారిలో జరిగే మార్పులను అర్థం చేసుకోవాలి. శారీరక మార్పులంటే కంటికి కనిపిస్తాయి. కానీ మెదడులో జరిగే మార్పులు కనిపించవుగా! నిజానికి అవే టీనేజర్ల ప్రవర్తనలోని విపరీతాలకు కారణం. టీనేజ్‌లో మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు వేగాలతో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రణాళిక, భావోద్వేగాల నియంత్రణ, నిర్ణయాలు తీసుకునే శక్తికి బాధ్యత వహించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ (మెదడులో ముందుభాగం) టీనేజ్‌లో పూర్తిగా అభివృద్ధి చెందదు. దీనికి విరుద్ధంగా భావోద్వేగాలను, ఎమోషన్స్, రివార్డ్స్‌ను నియంత్రించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది.
పూర్తిగా అభివృద్ధి చెందని ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అతిగా స్పందించే లింబిక్ సిస్టమ్ కలసి టీనేజర్ల ప్రవర్తనలో, భావోద్వేగాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. అందువల్లనే టీనేజర్లు ఇంపల్సివ్, రిస్కీ, ఎమోషనల్ ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. తరచుగా కొత్త అనుభవాలను వెతకడానికి, రిస్క్స్ తీసుకోవడానికి, షార్ట్ టర్మ్ రివార్డ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
భావోద్వేగ నియంత్రణ కష్టం..
ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల టీనేజర్లు మూడ్ స్వింగ్స్, ఎమోషనల్ రియాక్షన్స్, ఒత్తిడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. మరోవైపు భయం, ఆందోళనను ప్రాసెస్ చేసే అమిగ్డలా చురుగ్గా ఉంటుంది. అది టీనేజర్లకు ఎదురయ్యే సవాళ్లు, బెదిరింపులకు అతిగా స్పందించేలా చేస్తుంది. ఇది భావోద్వేగ అస్థిరతకు కారణమవుతుంది. టీనేజర్ల మూడీనెస్, రెబలియస్‌నెస్‌కు కారణాలివే అని అర్థం చేసుకోవడం వల్ల వారిపై ముద్రలు వేయకుండా, వారిని చక్కగా డీల్ చేసేందుకు వీలవుతుంది.
భావోద్వేగాలతో నిర్ణయాలు..
ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థ మధ్య పరస్పర చర్య టీనేజర్ల నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తార్కికంగా ఆలోచించి, పర్యవసానాలను అర్థం చేసుకోగలిగినప్పటికీ వారి నిర్ణయాలు తరచుగా ఫ్రెండ్స్ ప్రభావంతో ఎమోషనల్‌గా మారతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే తక్షణం సోషల్ రివార్డ్ అందుకోవడమే ముఖ్యమవుతుంది.
డోపమైన్ ప్రభావం..
టీనేజర్ల ప్రవర్తనలో మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆనందం, బహుమతితో అనుసంధానమైన డోపమైన్ గణనీయమైన మార్పులకు లోనవుతుంది. ఇది గుర్తింపు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, కొత్త అనుభవాల కోసం పరుగుపెట్టేలా చేస్తుంది. ఇదే డోపమైన్ వ్యసనాలు, ప్రమాదకర ప్రవర్తనలకూ కారణమవుతుంది. అందువల్ల ఈ వయసులో క్రీడలు, సృజనాత్మకత, సామాజిక పరిచయాలు అవసరం.
టీనేజర్‌తో ఇలా ప్రవర్తించాలి..
– మీ టీనేజర్ మెదడు అభివృద్ధి చెందుతూ ఉందని, అది హఠాత్ప్రవర్తనకు, మానసిక కల్లోలానికి కారణం కావచ్చని గుర్తించాలి. అందుకే ఓపికగా, సానుభూతితో అర్థం చేసుకోవాలి.
– టీనేజర్స్ స్వేచ్ఛను కోరుకుంటారు, అది అవసరం కూడా. అయితే వారితో చర్చించి దానికి హద్దులను
సెట్ చేయాలి.
– ఎమోషన్స్‌ను ఎలా ప్రదర్శించాలో.. ఒత్తిడి, కోపం, నిరాశను ఎలా ఎదుర్కోవాలో మీ ప్రవర్తన ద్వారా మీ టీనేజర్‌కు చూపించాలి.
– ఆలోచనలను పంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. తానేం చెప్పినా జడ్జ్ చేయకుండా ఉంటారనే భరోసా ఇవ్వాలి.
– టీనేజర్లలో రిస్క్ టేకింగ్ ఉంటుంది. అయితే అది సురక్షితమైన వాతావరణంలో ఉండేలా ప్రోత్సహించాలి.
– స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారిలో సానుకూల ప్రభావం ఉన్నవారితో స్నేహాన్ని ప్రోత్సహించాలి.
– తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కలిగించాలి. మార్గనిర్దేశం చేయాలి.
– తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి స్వేచ్ఛను ఇవ్వాలి. గైడెన్స్, సపోర్ట్ ఉండాలి.
– టీనేజర్‌ను పెంచడం సవాళ్లతో కూడుకున్న పని. అందువల్ల సెల్ఫ్ కేర్ పై దృష్టిపెట్టాలి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోలి.
– మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ ప్రభావం గురించి చర్చించాలి. స్క్రీన్ టైమ్, సోషల్ మీడియా వినియోగంపై పరిమితులను సెట్ చేయాలి.
– సైకాలజిస్ట్ విశేష్
ఇవి చదవండి: మెదడు.. మోకాల్లోకి..
Comments
Please login to add a commentAdd a comment