నా వయస్సు 30. నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య తీవ్రమైన పోర్నోగ్రఫీ వ్యసనానికి గురయ్యాడు. ఇది మా కుటుంబ జీవితంతోపాటు అతని పనితీరునూ ప్రభావితం చేస్తోంది. అతను తన మొబైల్‌లో పోర్నో వీడియోలు స్క్రోల్ చేయడంలో గంటల తరబడి గడుపుతున్నాడు. నన్ను, మా ఇద్దరు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆస్‌లైన్ సెక్స్ చాట్‌లకు డబ్బు కూడా చెల్లిస్తున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఆయన బాస్‌తో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నా మీద కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మా వివాహబంధాన్ని ఎలా రక్షించుకోవాలో సలహా ఇవ్వగలరు.
– అరుణకుమారి, చెన్నై
మీ ఆందోళన మీ మాటల్లోనే అర్థమవుతోంది. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగించే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతనితో మాట్లాడే ప్రయత్నం (అతన్ని నిందించేటట్లు లేకుండా) చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ అతని చర్యలు మీపైన, మీ పిల్లలపైనా ఎంత ప్రభావం చూపుతున్నాయో వివరంగా మాట్లాడి చూడండి. ఒక మంచి సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సలహాతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇతర చికిత్సా విధానాలతో అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు.
ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడం వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలుంటాయి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి, మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ సమస్యల నుండి ధైర్యంగా సమర్థంగా బయటపడేందుకు వ్యక్తిగత కౌన్సెలింగ్ సహాయపడుతుంది. ఇక ఆయన ఈ వ్యసనం నుండి బయట పడటం, మీరు ఆ పరిస్థితుల ప్రభావం నుంచి కోలుకోవడం చాలా సమయం ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి.
ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడడానికి నమ్మకమైన బంధుమిత్రులు లేదా నిపుణుల సహకారం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ భర్త తన వ్యసనాన్ని అంగీకరించడానికి లేదా దాని నుంచి బయట పడడానికి ఇష్టపడకపోతే మీరు మీ శ్రేయస్సు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయనిపుణుడిని సంప్రదించడం అవసరం కావచ్చు.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ:
sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment