మన(సు)లో మాట
మా పెళ్ళయి పదేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. మొదట్లో కొంతకాలం బాగున్నాం కానీ, తర్వాత నుంచి నా భర్తకు అనుమానం జబ్బు పట్టుకుని నన్ను మానసికంగా వేధిస్తున్నాడు. ప్రతివాళ్లతోనూ నాకు సంబంధం అంటగట్టి అనరాని మాటలతో చిత్రవధ చేస్తున్నాడు. సినిమాలకు, ఫంక్షన్‌లకు వెళ్ళినపుడు ఈ బాధ మరీ ఎక్కువవుతోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వగలరు.
– ఒక సోదరి, తెనాలి
మీరనుభవిస్తున్న మానసిక క్షోభను అర్థం చేసుకోగలను. వాస్తవం గాకున్నా... ఎలాంటి ఆధారం లేకున్నా ఇలా భార్యాభర్తలు ఒకరినొకరి శీలాన్ని శంకించే మానసిక రుగ్మతను ‘డెల్యూజనల్ డిజాస్ట్టర్ లేదా కాంజుగల్ ΄ారనోయియా’ అంటారు. మిగతా అన్ని విషయాల్లో వీరు మామూలుగానే ఉంటారు. ఏవేవో ఊహించుకుని ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనవుతూ, కేవలం జీవిత భాగస్వామిని మాత్రమే ఇలా అనుమానిస్తూ, వేధిస్తూ ఉంటారు. మానసిక రుగ్మత ఉందంటే ఒప్పుకోరు. మీరు మీ బంధువులు, ఇతర పెద్దల సహకారంతో ఆయన్ని ఏదో ఒక విధంగా ఒప్పించి, వైద్యుల దగ్గరకు వెళ్లగలిగితే, ‘యాంటీ సైకోటిక్స్’అనే మందులు, కౌన్సెలింగ్ ద్వారా చికిత్స చేసి, ఈ అనుమానాల ఊబి నుంచి పూర్తిగా బయటపడేస్తారు. మళ్ళీ మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలరు.
మా చుట్టాలబ్బాయి చిన్నప్పటినుంచి చదువులో టాప్! రెండు పీహెచ్‌డీలు చేశాడు. ఒక పెద్ద కంపెనీలో మంచి జీతంతో ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇటీవల ఉన్నట్టుండి అతని ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. ఎవ్వరితోనూ మాట్లాడడు. ఒక్కడూ గదిలో తలుపులు వేసుకుని కూచుంటాడు. రోజుల తరబడి స్నానం చేయడు. తన లో తాను నవ్వుకోవడం... మాట్లాడుకోవడం. మా బంధువులందరూ చదువు ఎక్కువ అవడం వల్ల ఈ పిచ్చి వచ్చిందంటున్నారు. నిజమేనా?
– కుమార్, కర్నూలు
చదువుకు, తెలివితేటలకు, మానసిక జబ్బు రావడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. ఎక్కువ చదివిన వారందరికీ మెంటల్ రావాలని లేదు. అలాగే తెలివితేటలు లేనివారికి, ఎక్కువ చదువుకోనివారికీ మానసిక జబ్బులు రావని ఏమీ లేదు. మానసిక వ్యాధులకు వారసత్వ కారణాలు కొన్నయితే, పరిస్థితుల ప్రభావం, దిగ్భ్రాంతి కలిగించే సంఘటనలు జరగడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం, తీవ్రమైన ఒత్తిడులకు గురికావడం వంటివి ఇతర కారణాలు. ఆలస్యం చేయకుండా అతణ్ణి ఒకసారి సైకియాట్రిస్ట్‌కు చూపించమని చెప్పండి. స్కిజోఫ్రినియా అనే మానసిక జబ్బుకు లోను కావడం వల్ల వారికి మీరు పేర్కొన్న లక్షణాలుండే అవకాశం ఉంది. తొలిదశలోనే గుర్తించి, సరయిన చికిత్స చేయిస్తే, తొందరగా కోలుకుని తిరిగి మంచి జీవితాన్ని గడపగలడు.
– డా. ఇండ్ల విశాల్ రెడ్డి
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment