
ఒకే రూపంతో అమ్మ గీసిన బొమ్మలు
అభిరుచులూ ఒకటేనంటున్న ట్విన్స్
తిరుపతి సిటీ: సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటూరని పెద్దలు చెబుతుంటారు. ఆ ఏడుగురు ఎవరో.. ఎక్కడుంటారో ఎవరికీ తెలియదు. కానీ అందులో ఒకే రూపం కలిగిన ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అదో గొప్ప అనుభూతే. తిరుపతిలో అలాంటి పిల్లలు వందల మంది ఉన్నారంటే నమ్మశక్యంగా లేదుకదూ. ఓ ప్రైవేటు సంస్థ ప్రతి ఏడాదీ కవలల దినోత్సవాన్ని తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తోంది. ట్విన్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఇచ్చిన వివరాల మేరకు కేవలం తిరుపతి జిల్లాలో కవలలు సుమారు 12 వేల పైచిలుకు ఉన్నారంటే ఆశ్చర్యకరమైన విషయమే.
ఇది మీకు తెలుసా?
ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 22న ప్రపంచ కవలల దినోత్సవం జరుపుకునేందుకు ఓ ప్రత్యేక సందర్భం ఉంది. ప్రపంచంలో మొదటి సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ దేశంలో 1976లో నిర్వహించారు. పోలెండ్‌లో మోజన్, ఆరన్ విల్‌కాక్స్ అనే కవలలు తాము నివసిస్తున్న ఊరుకి ట్విన్‌బర్గ్ అని పేరు పెట్టుకున్నారు. అనుబంధాన్ని విడవకూడదనే ఉద్దేశంతో ఒకే ఇంట్లోని అక్కాచెళ్లను పెళ్లి చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యాధితో ఇద్దరూ ఒకే రోజు అంటే ఫిబ్రవరి 22న మరణించారు. వారి గౌర వార్థం నాటి నుంచి ట్విన్స్‌డేని జరుపుకుంటున్నాయి.
నేడు తిరుపతిలో ఘనంగా ట్విన్స్‌డే
స్థానిక సీపీఎం కార్యాలయం వేదికగా ట్విన్స్ ఆర్గనైజేషన్ సంస్థ శనివారం అంతర్జాతీయ కవలల దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి తెలుగు కవల పిల్లలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న కవలలు హాజరుకానున్నారు.
అయోమయం అవుతుంటారు
మాది తిరుపతి. తల్లిదండ్రులకు మూడో సంతానంగా మేము జన్మించాం. ఒకే డ్రస్ వేసుకుంటాం. చిన్ననాటి నుంచి ఇద్దరం ఒకే తరగతిలో చదివాం. ప్రస్తుతం బెంగళూరులోని ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు మమ్ములను ఇప్పటికీ గుర్తించలేరు. కన్ప్యూజ్ అవుతుంటారు.
–హేమావతి, హేమలత, తిరుపతి
ఒకే ఆలోచనలు
మాది స్వస్థలం కడప. తిరుపతితో అనుబంధం ఎక్కువ. మాకు దాదాపు ఒకే రకమైన ఆలోచనలు, అలవాట్లు ఉంటాయి. మా జీవిన శైలి ఆసక్తికరంగా ఉంటుంది. మమ్మల్ని చూసి చాలా మంది పొల్చుకోలేక తికమక పడుతుంటారు. బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాం. సంస్థలోని ఉద్యోగులు మమ్ములను గుర్తించడంలో ఇబ్బంది పడుతుంటారు.
–రామ్, లక్ష్మణ్, తిరుపతి
తల్లిదండ్రులే గుర్తుపట్టలేరు
మేము మా తల్లిదండ్రులకు రెండో సంతానం. ఇద్దరం రూపంలోనూ, ఎత్తులోనూ ఒకటిగానే ఉంటాం. తల్లిదండ్రులు సైతం మమ్ముల్ని గుర్తుపట్టలేరు. ఏవైనా పనులు చెప్పడం, పిలవడంలో ఒకరికి చెప్పేవి మరొకరి చెబుతుంటే నవ్వొస్తుంది. మేము ఓ ప్రైవేటు పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాం.
–చరణశ్రీ, చరణ్యశ్రీ,తిరుపతి
అందరిచూపూ మాపైనే
తల్లిదండ్రులకు మేము నలుగురం కవలల. శృతి, ప్రీతి కవలుగా తొలి సంతానంలో జని్మంచాం. మరో ఇద్దరు సిరివెన్నెల, వివేక్ కవలలుగా రెండో సంతానంలో పుట్టాం. ముగ్గురు ఆడపిల్లలం ఒకే రూపంలో ఉంటాం. అమ్మ గీసిన అచ్చు బొమ్మలం. ఏదైనా ఫంక్షన్లకు వెళితే అందరి చూపు మాపైనే ఉంటుంది.
–శ్రుతి, ప్రీతి, సిరివెన్నెల, వివేక్, తిరుపతి
అదృష్టంగా భావిస్తున్నాం
మాది పీలేరు. తిరుపతిలోనే ప్రతి ఏడా దీ తిరుపతిలో జరిగే ట్విన్స్‌డేకి హాజరవుతుంటాం. మేము ఇద్దరం ఒకేసారి వస్తుంటే ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు సైతం తికమకపడుతారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాం. కలలుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం.
–హస్సేన్, హుస్సేన్, తిరుపతి
అభిరుచులు ఒక్కటే
వడమాలపేట మండలం, యనమలపాళ్యం గ్రామంలోని మధు, లత దంపతుల కవలలు ప్రగతి, ప్రనతి. వీరిద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఆటపాటల్లో, చదువుల్లో ఇద్దరూ ఒకేలా వ్యవహరిస్తారు. కొత్తవారు చూసినప్పుడు ఎవరి పేరు ఏమిటో గుర్తుపట్టలేని విధంగా ఉంటారు.
– ప్రగతి, ప్రణతి
ఇద్దరూ ఇద్దరే
చిల్లకూరు మండలం, కమ్మవారిపాళెంకు చెందిన మోరా నాగరాజు, ప్రనూనాలకు రెండో సంతానంగా ఇద్దరు మగ కవల పిలలు పుట్టారు. వీరు చిన్న నాటి నుంచి ఏది చేసినా ఒక్కటిగానే చేస్తుంటారు. వీరు చిల్లకూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు.
జోషి, జీవన్, కమ్మవారిపాళెం, చిల్లకూరు మండలం
గుర్తించాలంటే కాస్త టైమ్ పడుతుంది
మాది తిరుపతి. ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదోదవ తరగతి చదువుతున్నాం. ఒకే నిమిషం తేడాతో జని్మంచాం. తల్లిదండ్రులు మమ్ముల్ని గుర్తించినా బంధువులు, స్నేహితులు గుర్తించేందుకు కాస్త టైమ్ పడుతుంది. తదేకంగా గమనిస్తేనే గుర్తుపట్టగలరు.
–లక్ష్మీ అక్షయ, లక్ష్మీ ఐశ్వర్య, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment