
కవిత హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కుమార్‌తో పెళ్లయి రెండేళ్లవుతోంది. కవిత కలుపుగోలు మనిషి, కుమార్ కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉంటాడు. దీంతో ‘నీ పని నువ్వు చూసుకోక అందరితో మాట్లాడతావెందుకు?’ అని దెప్పుతుంటాడు. చిన్న చిన్న పనులకు కూడా తప్పు పడుతుండేవాడు. ‘యు ఆర్ నాట్ రైట్. నీకేదో సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది, ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలువు’ అని తరచు అనేవాడు. కొన్నాళ్లకు కవిత కూడా కుమార్ మాటలు నిజమేనేమో అనుకోవడం మొదలుపెట్టింది. ‘నిజంగానే నాకేమైనా మానసిక సమస్య ఉందేమో, లేదంటే కుమార్ ఎందుకలా అంటాడు’ అని అనుకునేది.
తనకేదో సమస్య ఉందనే ఆలోచనలతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. నిరంతరం ఆందోళనగా ఉంటోంది. ఒంటరితనం, భయం, నిస్సహాయత. ఎవరితోనూ మాట్లాడాలనిపించడంలేదు. నిద్ర పట్టడంలేదు. తలనొప్పి, కడుపు నొప్పి, ఇతర శారీరక సమస్యలు. డాక్టర్ దగ్గరకు వెళ్లి అన్నిరకాల టెస్టులు చేయించుకుంది. శారీరకంగా ఎలాంటి సమస్య లేదని, ఒకసారి సైకాలజిస్ట్‌ను కలవమని సూచించారు. దాంతో కౌన్సెలింగ్ కోసం వచ్చింది. తన ఇంటి వాతావరణం గురించి, భర్త ప్రవర్తన గురించి వివరంగా చెప్పింది.
మెల్లగా మంటపెడతారు...
కవిత చెప్పిందంతా విన్నాక ఆమె గ్యాస్ లైటింగ్‌కు గురవుతుందని అర్థమైంది. మాటలు, ప్రవర్తన ద్వారా మరోవ్యక్తి భావోద్వేగాలను కంట్రోల్‌లో పెట్టుకోవడానికి కొందరు చేసే మానిప్యులేషన్‌ను ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. నార్సిసిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారిలో ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. కానీ తాము గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్న విషయాన్ని బాధితులు గుర్తించలేరు. అసలా దిశగా ఆలోచించలేరు. అందుకే భర్త మానిప్యులేషన్ గురించి కవితకేం చెప్పలేదు.
మూడునెలల్లో పరిష్కారం...
మొదట కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా తన ఆందోళన తగ్గించుకునేలా సహాయం అందించాను. ఆ తర్వాత గ్యాస్ లైటింగ్ గురించి, గ్యాస్ లైటర్ వాడే స్ట్రాటజీస్ గురించి వివరించాను. తాను గ్యాస్ లైటింగ్‌కు గురవుతున్నానని అప్పుడు అర్థం చేసుకుంది. తన బలాలు, సానుకూల లక్షణాలను గుర్తించి ఆత్మగౌరవంతో ప్రవర్తించేందుకు ఎక్సర్‌సైజ్‌లు నేర్పించాను. గ్యాస్ లైటింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో, ఒత్తిడిని, ఆందోళనను ఎలా మేనేజ్ చేసుకోవాలో వివరించాను.
స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోమని ప్రోత్సహించాను. క్రమేపీ కవిత తన కెరీర్ పై దృష్టి పెట్టింది. కుమార్ మాటలను పట్టించుకోవడం మానేసింది. కవిత ఇంతకు ముందులా లేదన్న విషయం అర్థం చేసుకున్న కుమార్ కూడా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. మూడు నెలల్లో సమస్య పరిష్కారమైంది.
గ్యాస్ లైటర్లు తరచూ వాడే వాక్యాలు
» నువ్వు ప్రతిదానికీ ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నావ్.
» అందుకే నీకెవ్వరూ ఫ్రెండ్స్ లేరు. · నీకోసమే అలా చేశాను.
» నీకోసం అంత చేస్తే నన్నే అనుమానిస్తావా?
» నేను నీకు చెప్పాను, గుర్తులేదా?
» అలా ఏం జరగలేదు, నువ్వే ఊహించుకుంటున్నావ్.
» నీపట్ల నాకెప్పుడూ నెగటివ్ ఒపీనియన్ లేదు. నువ్వే నన్ను నెగటివ్ గా చూస్తున్నావ్.
మాయ మాటలు నమ్మొద్దు
» గ్యాస్ లైటర్లతో వాదనలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మాటలే మీపై ప్రయోగిస్తారు.
» గ్యాస్ లైటర్లు చెప్పేదొకటి, చేసేదొకటి కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా, చేసే పనులపై దృష్టి పెట్టాలి.
» ‘నీకు పిచ్చి’ అని మిమ్మల్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి మాటలు పట్టించుకోకూడదు.
» ‘నేను చెప్పాను, నీకే గుర్తులేదు’ అనే మాటలు నమ్మకూడదు. మీకెంత వరకు గుర్తుందో అదే నిజమని గుర్తించాలి.
»గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్‌కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలు పట్టించుకోకూడదు.
» గ్యాస్ లైటర్‌తో ఉండే బంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించాలి.
» మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment