Mental problem
-
తమలో తామే మాట్లాడుకుంటారు..
‘ప్రత్తిపాడుకు చెందిన రమేష్ ప్రతి రోజూ కూలిపనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండేళ్ల క్రితం అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి వెళ్లటం మానేశాడు. ఒంటరిగా గడపటం ప్రారంభించాడు. చివరకు స్నానం చేయటం, అన్నం తినటం మానివేసి గెడ్డం పెంచుకుని తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు గాలి సోకిందని భావించి భూతవైద్యుడికి వద్దకు తీసుకెళ్లి అంత్రాలు వేయించారు. ఫలితం లేకపోవడంతో చివరకు జీజీహెచ్ మానసిక వైద్యులను సంప్రదించారు. ఆరు నెలలుగా క్రమం తప్పకుండా నెలనెలా వైద్య పరీక్షలు చేయిస్తూ మందులు వాడుతూ ఉండటంతో ప్రస్తుతం అతను సాధారణ స్థితికి వచ్చాడు. నేడు ప్రపంచ స్క్రీజోఫ్రీనియా డే సందర్భంగా ప్రత్యేక కథనం.. గుంటూరు మెడికల్: చాలా మంది వైద్యంపై అవగాహన ఉండడం లేదు. మానసిక సమస్య వైద్యపరిధి కదానే అభిప్రాయం ఉంది. దీని తోడు వివిధ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు తొలుత భూత వైద్యులను సంప్రదించి చివరి స్థితిలో మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం చేయించటం వల్ల వారు సాధారణ స్థితికి అతి తక్కువ కాలంలోనే వస్తారు. లేదంటే దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతూ అది చూసి కుటుంబ సభ్యులు కూడా కృంగిపోవాల్సి వస్తుంది. వ్యాధి లక్షణాలు.. స్క్రీజోఫీనియా వ్యాధి మానసిక వ్యాధి. ఏ వయసులో వారికై నా వస్తోంది. జెనిటిక్ సమస్యల వలన, దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడికి గురవ్వటం, మెదడులో డోపమైన్ హార్మోన్ తేడా వలన వ్యాధి వస్తోంది. తల్లిదండ్రులకు మద్యం, పొగ తాగటం లాంటి వ్యసనాలు ఉంటే వారికి పుట్టే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారు తనలో తాను నవ్వుకోటం, కోపంతో అరవటం, తిట్టటం, కొట్టడం, మాటలో మార్పు, ప్రవర్తనలో తేడా, ఎవరో కనబడుతున్నట్లు, తనను ఎవరో పిలుస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేయటం, చెవిలో మాటలు వినిపిస్తున్నట్లు చెప్పటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ చేసే పనులు చేయకుండా మానివేయటం, పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉండటం, నిద్రపోకుండా, అన్నంతిన కుండా, స్నానం చేయకుండా ఉండటం, ఒంటరిగా గడపటం చేస్తుంటారు. ఇలాంటి వారిని స్క్రీజోఫ్రీనియా వ్యాధి గ్రస్తులుగా గుర్తించి తక్షణమే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. జీజీహెచ్‌లో ఉచిత వైద్యం జీజీహెచ్‌లో మానసిక వ్యాధులతో వైద్యం కోసం ప్రతిరోజూ 150 మందికి పైగా రోగులు వస్తుంటారు. వారిలో 20 నుంచి 30 మంది స్క్రీజోఫ్రీనియా వ్యాధి సోకిన వారే. జీజీహెచ్‌లో ఈ వ్యాధి గ్రస్తులకు ప్రతి రోజూ 21 నంబర్ ఓపీ గదిలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఈ వ్యాధికి చికిత్స ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తెరిగి నాటు మందులనువాడటం, భూత వైద్యులను సంప్రదించటం మాని వేసి మానసిక వైద్యులను సంప్రదించాలి. – వడ్డాది వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్ -
‘మతి’తప్పుతోంది! దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే పరేషాన్లో ఉంది..
కంచర్ల యాదగిరిరెడ్డి మీకేమైనా మెంటలా? అని ఎవరైనా అన్నారంటే.. ఒంటికాలిపై లేస్తాం.. చెడామడా తిట్టేస్తాం.. కానీ ఈ భూమ్మీద ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు తెలుసా? భయం, ఒంటరితనం, మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటివన్నీ మానసిక సమస్యలేనని.. తగిన చికిత్స, సాయం అందకపోతే ఇవి శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఎందరికి తెలుసు? మానసిక సమస్యల సంక్షోభం కొత్తేమీకాదుగానీ.. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఇది మరింత జటిలమైపోయింది! నిమిషానికో ఆత్మహత్య, మత్తుమందుల విచ్చలవిడి వాడకంతో లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మానసిక సమస్యల మహాభూతంపై సమగ్ర కథనాలు మీకోసం.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇదో పాత సినిమా డైలాగ్. కానీ మానసిక సమస్యల విషయానికొస్తే దేశం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువవుతున్న ఈ తరుణంలో అందులో వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు బాధితుల్లో ఎక్కువ మంది పేదదేశాలకు చెందిన వారే కావడం.. వీరిలో 75 శాతం మంది తమ జీవితకాలంలో దీనికి చికిత్స పొందలేని పరిస్థితి ఉండటం గమనార్హం. మానసిక సమస్యల్లో సగం మేర లేత వయసులోనే మనిషిని చుట్టేస్తాయని, స్పష్టంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆ ఘర్షణ ప్రభావం ఎందరు పసిమనసులపై పడి ఉంటుందో ఊహించుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? భూమ్మీద ఇలాంటి ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, మరికొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా 16 కోట్ల మందికిపైగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి మానవతా సాయం అందాల్సిన అవసరముందని ఒక అంచనా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 93శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాలు చాలా తక్కువ. ఆరోగ్య బడ్జెట్లో రెండు శాతానికి మించి నిధులు ఈ విభాగంపై ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా రానున్న పదేళ్లలో కేవలం కుంగుబాటు (డిప్రెషన్) అనే మానసిక సమస్యను పరిష్కరించేందుకే బోలెడంత వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మానసిక సమస్య అంటే? మనలో చాలా మందికి అసలు మానసిక సమస్య అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. బాధపడటం కూడా మానసిక సమస్యేనా? అని కుంగుబాటు, ఆందోళన వంటివాటిని తేలిక చేస్తూంటారు. దీనివల్ల చికిత్సగానీ, మాట సాయం అవసరమనిగానీ గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. మానసిక సమస్య అంటే ఏమిటనేది సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. మన మానసిక ఆరోగ్యం దైనందిన జీవితం, ఇతరులతో మన సంబంధాలను మాత్రమేకాదు భౌతిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేయగలదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మన దైనందిన జీవితం, ఇతరులతో సంబంధాలు, శరీరక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు, మంచి ఆహారం, మంచి జీవనశైలి ద్వారా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించినట్టే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరూ అతీతులు కారు! మానసిక సమస్యల్లో బోలెడన్ని రకాలున్నాయి. అవి ఫలానా వారికే వస్తాయి. కొందరికి రానే రావు అన్న వెసులుబాటు ఏమీ ఉండదు. వయసు, స్త్రీపురుషులు, ఆదాయం, జాతి వంటి వాటన్నింటికి అతీతంగా ఎవరికైనా మానసిక సమస్యలు రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు వంటివన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయాలు. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యల లెక్క ఇదీ.. ►35 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య ►8,00,000.. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపు ►20,63,52,50,00,00,000 రూపాయలు.. మానసిక సమస్యల కారణంగా ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం(ఉత్పాదకత తగ్గడం, అనారోగ్యం వంటి కారణాలతో..) ►రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువగా మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతోంది. ►మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువ! -
మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు
అమితాబ్ మనవరాలు 23 ఏళ్ల నవ్య నవేలి నందా తీవ్రమైన యాంగ్జయిటీతో బాధ పడుతున్నట్టు చెప్పింది. అమితాబ్ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్ల కుమార్తె అయిన నవ్య నవేలీ గత సంవత్సరమే న్యూయార్క్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వచ్చింది. ఈమెకు అగస్త్య అనే తమ్ముడు ఉన్నాడు. ఇటీవల నవ్య నవేలి తన సహ భాగస్వామ్యంతో ‘ఆరా’ అనే హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించింది. దాని కోసమని విడుదల చేసిన వీడియోలో తన మానసిక సమస్య గురించి, దానికి తీసుకుంటున్న వైద్యం గురించి మాట్లాడింది. ‘గతంలో నేను చాలా నెగెటివ్ మనుషుల మధ్య ఉండేదాన్ని. వారెప్పుడు నెగెటివిటీనే మాట్లాడేవాళ్లు. కారణాలు తెలియదు నేను చాలాసార్లు మానసికంగా లోలోపల అడుగు వరకూ చాలా దెబ్బ తిన్నాను. తీవ్రమైన యాంగ్జయిటీ నన్ను వేధించేది. ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒక అటాక్లాగా వచ్చేది. ఆ సమయంలో దానిని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేది కాదు. బయటి విషయాలు ఏవో ఒకటి ట్రిగర్ చేయడం వల్ల అలా జరుగుతుంది అనుకునేదాన్ని. ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా అలాగే జరిగేది. ఇది చాలా భరింపలేని విషయం’ అందామె. ‘మొదట్లో నేను దీని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకున్నాను. కాని మాట్లాడితేనే సగం పరిష్కారం. అలాగై వైద్య సహాయం తీసుకోవడం మరో సగం పరిష్కారం. కొందరు తమ మానసిక సమస్యకు సహాయం అవసరం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. యాంగ్జయిటీకి మూలం బయట ఉండదు. ఎనభై శాతం మన బుర్రలోనే ఉంటుంది. అక్కడి నుంచే యాంగ్జయిటీ మొదలవుతుంది. మొదట మన మనసును, శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే కొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతాం’ అందామె. ‘యాంగ్జయిటీ నుంచి బయటపడటానికి థెరపిస్ట్‌ను కలుస్తున్నాను. వారానికి ఒక గంట అతనితో మాట్లాడుతున్నాను. మాట్లాడేకొద్దీ నాకు ధైర్యం వస్తోంది. యాంగ్జయిటీ నన్నేమీ చేయదనే నమ్మకం కలుగుతోంది. అలాగే మన చుట్టు మనల్ని కంఫర్ట్‌గా సంతోషంగా ఉంచే మనుషులుండేలా చూసుకోవాలని కూడా తెలుసుకున్నాను’ అని చెప్పిందామె. అమితాబ్ ప్రియమైన మనవరాలు నవ్య. ఆమె యుక్త వయసుకు రాగానే స్త్రీ ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలను గురించి, సంఘపరమైన సవాళ్ల గురించి మాట్లాడుతూ అమితాబ్ ఆమెకు రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఒక పురోగామి విషయంగా చెప్పుకున్నారు. మానసిక సమస్యలకు స్త్రీ పొందాల్సిన వైద్య సహాయాన్ని ఈ వీడియో నొక్కి చెబుతోంది. నవ్య నవేలి నందా; తల్లి శ్వేతతో నవ్య -
గోడకి తలబాదుకున్న నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాలంటూ శర్మ తరఫున అతని లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. స్కిజోఫేర్నియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ పిటిషన్లో పేర్కొనడంతో ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వెల్లడించాలని తీహార్ జైలు అధికారుల్ని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఆదేశించారు. ఉరిశిక్ష విధించిన దగ్గర్నుంచి వినయ్ శర్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అసహనంగా సెల్లోనే పచార్లు చేస్తున్నట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వినయ్ శర్మ ఆదివారం మధ్యాహ్నం తీహార్ జైలులో తనను ఉంచిన గదిలో తల గోడకేసి బాదుకోవడంతో గాయాలయ్యాయి. వెంటనే అతనికి అక్కడికక్కడే తీహార్ జైలు వైద్యులే చికిత్స అందించినట్టు అధికారులు చెప్పారు. ఆ గాయాలు ఏమంత పెద్దవి కావని వారు వెల్లడించారు. అయితే శర్మ తరఫు లాయర్ మాత్రం క్లయింట్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని, తన తల్లిని కూడా గుర్తించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వినయ్ శర్మ కుటుంబ సభ్యుల కోరిక మేరకు లాయర్ తీహార్ జైలుకి వెళితే తలకి గాయాలు, కుడి భుజానికి ఫ్రాక్చర్ అయి కట్టుతో కనిపించాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందంటూ లాయర్ తాను దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు తీహార్ జైలు అధికారులు స్పందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. -
నిద్ర పట్టడం లేదా? అయితే మేల్కోండి...
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర... అంతకు మించి మనిషి జన్మకు కావలసినవేంటి? మిగిలినవన్నీ తిండి, నిద్ర తర్వాతే కదా! పూట గడిచే స్థాయిలో కాస్త సంపాదన ఉంటే చాలు, ఏదోలా కడుపుకింత తిండి తిని బతకొచ్చు. మరి నిద్ర సంగతి అలా కాదు కదా! డబ్బు ఖర్చుపెడితే బజారులో దొరికే సరుకేమీ కాదది. శరీరం అలసి సొలసినప్పుడు, మనసుకు చీకూ చింతా లేనప్పుడు కదా ఎవరైనా ఆదమరిచి నిద్రపోగలరు. ఆకలి బాధల కారణంగా నిద్రకు దూరమయ్యే నిరుపేదలు కొందరైతే, ఆధునిక జీవితం తెచ్చిపెట్టిన మాయదారి మానసిక సమస్య కారణంగా నిద్ర కరువైన వారు ఇంకొందరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జనాభాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వారంతా నిద్రలేమి ఫలితంగా తలెత్తే రకరకాల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే వారిలో చాలామంది అకాల మరణాల పాలవుతున్నారు. నిద్రలేమికి కారణాలు... నిద్రలేమికి దారితీసే కారణాలు చాలానే ఉన్నా, ఒక్కోసారి ఎలాంటి కారణాలూ లేకుండా తనంతట తానుగానే తలెత్తే సమస్య ఇది. అయితే, కొన్నిసార్లు ఇతర సమస్యల పర్యవసానంగా కూడా నిద్రలేమి తలెత్తుతుంది. ఇతర శారీరక, మానసిక సమస్యల వల్ల నిద్రలేమి తలెత్తే సందర్భాల్లో ఆ సమస్యలు తీరిపోగానే నిద్రలేమి కూడా నయమైపోతుంది. డిప్రెషన్, విపరీతమైన మానసిక ఒత్తిడి, భరించలేని నొప్పి, గుండెజబ్బులు, ఎసిడిటీ, ౖహె æబీపీ, మెనోపాజ్ వంటి సమస్యలు ప్రశాంతంగా నిద్ర పట్టనివ్వవు. శారీరక, మానసిక సమస్యలే కాకుండా జీవనశైలి కారణాల వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతూ ఉంటుంది. కెఫీన్ ఉండే కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ వంటివి అతిగా తాగడం, మోతాదుకు మించి మద్యం సేవించడం, పొగతాగడం, మాదకద్రవ్యాల వాడకం వంటి అలవాట్లు, నైట్ షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడం, ఎలాంటి వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి టీవీలకు, కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి వృథా కాలక్షేపం చేయడం, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాలు కూడా నిద్రలేమికి దారితీస్తాయి. ఇక వృద్ధాప్యంలో పడినప్పుడు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. నిద్రలేమితో బాధపడే వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరవయ్యేళ్లకు పైబడ్డ వయసు గలవారిలో దాదాపు 40–60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. శారీరక, మానసిక సమస్యలకు పర్యవసానంగా నిద్రలేమితో బాధపడే వారిని మినహాయిస్తే, పెద్దగా ఎలాంటి కారణం లేకుండానే నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య దాదాపు ఆరు శాతం వరకు ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్లీప్ రీసెర్చ్ సొసైటీస్ వంటి సంస్థలు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం నిద్రలేమితో బాధపడుతున్న వారు సంపన్న దేశాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను, నిరుపేద దేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. కాయకష్టం చేసుకునేవారితో పోలిస్తే ఎక్కువగా విద్యార్థులు, మేధోపరమైన వృత్తులు, ఉద్యోగాలు చేసేవారు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమి లక్షణాలు పక్క మీదకు చేరుకున్నా ఒక పట్టాన నిద్రపట్టదు. చాలా ప్రయాస తర్వాత నిద్రపట్టినా, అర్ధంతరంగా ఏ అర్ధరాత్రి వేళలోనో మెలకువ వస్తుంది. అలా మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టడం గగనమే అవుతుంది. ఉదయం చాలా తొందరగా మెలకువ వచ్చేస్తుంది. మేలుకున్న తర్వాత చాలా నిస్సత్తువగా అనిపిస్తుంది. పగటి వేళ మగత మగతగా ఉంటుంది. పని మీద దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. శారీరక వ్యాధులు, మానసిక వ్యాధులు ఏవీ లేకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, దానిని ప్రాథమిక నిద్రలేమి (ప్రైమరీ ఇన్సోమ్నియా) అంటారు. ఉబ్బసం, ఎసిడిటీ, హై బీపీ, అలెర్జీలు, గాయాలు, శస్త్రచికిత్సల కారణంగా తలెత్తే నొప్పి, కేన్సర్, కీళ్లనొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, భయం, ఆందోళన, డిప్రెషన్ వంటి శారీరక, మానసిక సమస్యలు నిద్రను దూరం చేస్తాయి. రకరకాల శారీరక, మానసిక కారణాలతో తలెత్తే నిద్రలేమిని సెకండరీ ఇన్సోమ్నియా అంటారు. కెఫీన్, ఆల్కహాల్ మితిమీరి వాడటం, కొన్ని రకాల ఔషధాలు, మాదకద్రవ్యాలు, గురక వంటివి కూడా సెకండరీ ఇన్సోమ్నియాకు కారణమవుతుంటాయి. ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో తలెత్తే అభద్రతా భావం, సన్నిహితుల మరణం, శక్తికి మించిన పని ఒత్తిడి, తరచుగా నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, పరీక్షల భయం, సుదూర విమాన ప్రయాణాల కారణంగా ఏర్పడే జెట్లాగ్ వంటి పరిస్థితులు కూడా ప్రశాంతమైన నిద్రను కరువు చేస్తాయి. జీవితంలోని ఏదో ఒక దశలో కొద్దికాలం మాత్రమే కనిపించే నిద్రలేమి లక్షణాలను ‘అక్యూట్ ఇన్సోమ్నియా’ అంటారు. తాత్కాలికంగా కనిపించే ఇలాంటి నిద్రలేమికి వైద్య చికిత్స అవసరం ఉండదు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి దానంతట అదే సర్దుకుంటుంది. నెల్లాళ్లకు మించి నిద్రలేమి లక్షణాలు కొనసాగుతున్నట్లయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిందే. నిద్రలేమి అనర్థాలు చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు దారితీసే ప్రధాన కారణాల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్రలేమితో బాధపడే డ్రైవర్లు ట్రాఫిక్‌పై సరిగా దృష్టి సారించలేక ప్రమాదాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. మన దేశంలో ఈ దిశగా గణాంకాల సేకరణ, శాస్త్రీయమైన అధ్యయనాలు ప్రత్యేకంగా ఏవీ జరగలేదు. అయితే, అమెరికా వంటి అగ్రదేశాలు రోడ్డు ప్రమాదాల వెనుక నిద్రలేమి కోణంపై ప్రత్యేక అధ్యయనాలు జరిపించి, నివారణ చర్యలు కూడా చేపడుతున్నాయి. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడేవారు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల హైబీపీ, టైప్–2 డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం, మూర్ఛ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల డిప్రెషన్, ఆందోళన, నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిల్లడం, జ్ఞాపకశక్తి తగ్గడం, విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి మందగించడం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాదు. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుర్దాయాన్ని కూడా హరించేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్రపోయే వారితో పోలిస్తే నిద్రలేమితో బాధపడేవారు 12 శాతం ఎక్కువగా అకాల మరణాల పాలయ్యే అవకాశాలు ఉంటాయని ఇటీవలి అధ్యయనాల్లో నిపుణులు తేల్చారు. మంచి నిద్రకు మేలైన చిట్కాలు దీర్ఘకాలిక నిద్రలేమికి వైద్య చికిత్స తప్ప ప్రత్యామ్నాయాలేవీ లేవు గాని, తాత్కాలికంగా కనిపించే అక్యూట్ ఇన్‌సోమ్నియాను చిన్న చిన్న చిట్కాలతో తేలికగానే అధిగమించవచ్చు. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. తాత్కాలిక నిద్రలేమిని అధిగమించడానికి నిపుణులు చెబుతున్న సూచనలు ఇవి... ప్రతిరోజూ రాత్రివేళ నిర్దిష్ట సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి. నిద్ర వస్తున్నా, లేకున్నా నిర్ణీత వేళకు పక్క మీదకు చేరుకోండి. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో సీరియస్ విషయాలపై సుదీర్ఘ చర్చలు లేదా వాదులాటలు సాగించడం వంటి పనులు మానుకోండి. రాత్రిపూట కడుపు కిక్కిరిసిపోయినట్లుగా అతిగా భోంచేయకండి. భుక్తాయాసం మితిమీరితే నిద్రపట్టడం కష్టమవుతుంది. నిద్రలేమి ఇబ్బంది పెడుతున్నట్లయితే, పగటి వేళ నిద్రపోవద్దు. పగటి నిద్ర వల్ల రాత్రి నిద్ర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం గంట ముందు టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటివి చూడటం ఆపేయండి. అత్యవసరమైతే తప్ప మొబైల్ ఫోన్‌ను కూడా ఆ సమయంలో ఉపయోగించవద్దు. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగండి. తేలికగా నిద్రలోకి జారుకుంటారు నిద్రకు ఉపక్రమించడానికి ముందు ఏదైనా పుస్తకం చదవడం, ఆహ్లాదభరితమైన సంగీతం వినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి పనులు తేలికగా నిద్రపట్టేలా చేస్తాయి. నిద్రపోయే సమయంలో ఇంట్లో రణగొణ శబ్దాలేవీ వినిపించకుండా చూసుకోండి. ఇంటి చుట్టుపక్కల నుంచి వచ్చే శబ్దాలు ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇయర్ ప్లగ్స్ వాడటం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. బెడ్రూమ్లో బెడ్‌లైట్ మినహా మరేమీ వెలిగించి ఉంచకండి. మితిమీరిన వెలుతురు నిద్రను దూరం చేస్తుంది. అలాగే, బెడ్రూమ్లో నల్లులు, బొద్దింకలు, దోమలు వంటి కీటకాల బాధ లేకుండా చూసుకోండి. అరోమా థెరపీ, లైట్ థెరపీ వంటి పద్ధతులు ప్రాథమిక స్థాయిలోని నిద్రలేమిని నయం చేయడంలో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి బాధిస్తుంటే... ఒక్కోసారి ఎన్ని చిట్కాలు పాటించినా ఉపయోగం ఉండకపోవచ్చు. నాలుగు వారాలకు మించి నిద్రలేమి సమస్య బాధిస్తున్నట్లయితే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. వైద్యుల పర్యవేక్షణలో కొన్నాళ్లు నిద్రమాత్రలు వాడాల్సి ఉంటుంది. నిద్రమాత్రల వాడకంలో సొంత వైద్యాలేవీ చేసుకోకండి. మీ సమస్యకు ఎలాంటి నిద్రమాత్రలను ఎన్నాళ్లు వాడాలో నిపుణులైన వైద్యులు మాత్రమే నిర్ధారించగలరు. మీ నిద్రలేమికి శారీరక సమస్యలేవైనా కారణమైతే, ఆ సమస్యలకు తగిన వైద్యం అందిస్తారు. మానసిక సమస్యలేవైనా కారణమైతే, వాటి నివారణకు తగిన కౌన్సెలింగ్ ఇస్తారు. తీవ్రమైన దీర్ఘకాలిక మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే సమగ్ర చికిత్సను అందిస్తారు. నిద్రలేమి... కొన్ని నిజాలు... నిద్రలేమిని అమెరికా వంటి అగ్రరాజ్యాలు ప్రజారోగ్య సమస్యగా ఇప్పటికే గుర్తించాయి. అయితే, భారత్‌లో మాత్రం ఈ విషయమై అలాంటి చర్యలేవీ మొదలు కాలేదు. ఆయువును హరించేసే నిద్రలేమిపై నిర్లక్ష్యం తగదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న నిద్రలేమి సమస్య గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు... ∙ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది నిద్రలేమి బాధితులే. ∙డిప్రెషన్‌తో బాధపడేవారిలో 90 శాతం మంది నిద్రలేమిని ఎదుర్కొంటున్నారు. ∙నిద్రలేమితో బాధపడేవారిలో 35 శాతం మంది వంశపారంపర్యంగా ఈ సమస్యతో బాధపడేవారే. ∙అమెరికాలో దాదాపు కోటి మంది నిద్రలేమి బాధితులు వైద్యులు సూచించిన నిద్రమాత్రలపై ఆధారపడుతున్నారు. ∙దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడేవారు ఇతరుల కంటే 27 శాతం ఎక్కువగా స్థూలకాయం బారిన పడే అవకాశాలు ఉంటాయి. ∙ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దాదాపు 15 కోట్ల మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙నిద్రలేమి బాధితులు బంగ్లాదేశ్‌లో అత్యధికంగా ఉన్నారు. బంగ్లాదేశ్ జనాభాలోని పురుషుల్లో 23.6 శాతం మంది, మహిళల్లో 43.9 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙వియత్నాంలో 37.6 శాతం మంది మహిళలు, 28.5 శాతం మంది పురుషులు నిద్రలేమితో బాధపడుతున్నారు. ∙దక్షిణాఫ్రికాలో 31.3 శాతం మంది మహిళలు, 27.2 శాతం మంది పురుషులు నిద్రలేమి బాధితులు. ∙నిద్రలేమి బాధితుల సంఖ్యలో భారత్, ఇండోనేసియాలే కాస్తంత నయంగా ఉన్నాయి. భారత్‌లో 6.5 శాతం మంది మహిళలు, 4.3 శాతం మంది పురుషులు నిద్రలేమితో బాధపడుతుంటే, ఇండోనేసియాలో 3.9 శాతం మంది పురుషులు, 4.6 శాతం మంది మహిళలు నిద్రలేమి బాధితులు ఉన్నారు. -
అతడు హానికారక తండ్రి
రాబోవు చిత్రం అమ్మాయిలు మానసిక సమస్యలతో పోరాటంలో విజయ సాధించగలరు అని ఇటీవల విడుదలైన ‘డియర్ జిందగీ’ సినిమా నిరూపిస్తే శారీరక బలం పురుషులతో సమానంగా ప్రదర్శించగలరు అని నిరూపించడానికి రేపు శుక్రవారం ‘దంగల్’ వస్తోంది. ‘దంగల్’ అంటే ‘గోదా’ అని ‘కుస్తీ పోటీ’ అని అర్థాలున్నాయి. ఈ కథ నిజజీవిత సంఘటనలతో ప్రభావితమై తీశారని తెలిసిందే. హర్యాణాకు చెందిన మహావీర్ ఫోగట్ అనే మల్లయోధుడు అంతర్జాతీయ పోటీలలో గోల్డ్‌మెడల్ సాధించలనుకున్నాడు. అది సాధించలేకపోయాడు. తన కుమార్తెలకు కుస్తీ యుద్ధం నేర్పించి ఆ కలను నెరవేర్చుకున్నాడు. అతని కుమార్తెలు గీతా ఫోగట్, బబిత కుమారి కామన్వెల్త్ పోటీలలో పతకాలు సాధించారు. గీతా ఫోగట్ అయితే ఒలంపిక్స్ యోగ్యత పొందిన తొలి భారతీయ మహిళా మల్లయోధగా రికార్డు సాధించింది. ఈ విషయాన్ని సినిమాగా మలిస్తే బాగుంటుందని ఆలోచన చేసిన డిస్నీ స్టూడియో ఇది వరకే ‘చిల్లర్ పార్టీ’, ‘భూత్నాథ్ రిటర్న్ ్స’ సినిమాలు తీసిన దర్శకుడు నితిష్ తివారీని కథ తయారు చేయమంది. నితిష్ తివారి దీనిని జాక్‌పాట్‌గా భావించి కథ మీద కూర్చున్నాడు. పదేళ్ల తర్వాత అనుకొని... కథ పూర్తయ్యాక దీనిని మొదటగా ఆమిర్ ఖాన్‌కు వినిపించాడు డిస్నీ స్టూడియో తరఫున నితిష్ తివారీ. ఆమిర్‌కు వెంటనే నచ్చేసింది. అప్పుడతడు ‘ధూమ్ 3’ షూటింగ్ ముగించి ‘పికె’ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. ఈ కథ వినగానే చాలా బాగుంది, కాని ఇది చేయాలంటే నాకు ఇంకాస్త వయసు రావాలి, మరికాస్త ముసలివాణ్ణి కావాలి ఒక పదేళ్లు ఆగి చేద్దాం అన్నాడు ఆమిర్ ఖాన్. కాని ఆరునెలల తర్వాత ఏమనుకున్నాడో ఏమో మళ్లీ కథ విని తానే చేస్తానని ముందుకొచ్చాడు. దానికి ఎంత కష్టపడ్డాడో ఎన్ని కేజీల బరువు పెరిగాడో మళ్లీ తగ్గి ఎలా మామూలు మనిషి అయ్యాడో అవన్నీ పత్రికల్లో అందరూ చూస్తూనే ఉన్నారు. హానికారక్ బాపు ఈ సినిమాలో తన నెరవేరని కలను తనకు పుట్టబోయేవాడు నెరవేర్చాలని అనుకుంటాడు ఆమిర్‌ఖాన్. కాని భార్య కాన్పు వెంట కాన్పులో వరుసగా నలుగురు ఆడపిల్లలను ప్రసవిస్తుంది. ఆడపిల్లలంటే ప్రేమే అయినా వాళ్లు కుస్తీకి పనికి రారు కదా అని బాధపడతాడు. అయితే వీధి కొట్లాటల్లో తన ఇద్దరు కూతుళ్లు అబ్బాయిలను చితకబాదటం చూసి ‘వీళ్లిద్దరూ కుస్తీకి పనికొస్తారు. బంగారు పతకం బంగారు పతకమే... అది అబ్బాయి తెస్తే ఏమిటి అమ్మాయి తెస్తే ఏమిటి’... అని వాళ్లకు కుస్తీలో శిక్షణ ప్రారంభిస్తాడు. కాని ఆ ఇద్దరి అమ్మాయిలకు ఇది చాలా కష్టమైన పని. పైగా అది తిను ఇది తినకు అలా పరిగెత్తు ఇలా ఎక్సర్సైజ్ చెయ్ అని తండ్రి విసిగిస్తుంటే ‘హానికారక్ బాపు’ అని తిట్టుకుంటారు. అంటే తండ్రి తమ పాలిట హానికారకంగా తయారయ్యాడు అని అర్థం. దంగల్ ప్రోమోలలో ఈ హానికారక్ బాపు అనే పాట ఉన్న ప్రోమో పెద్ద హిట్ అయ్యింది కూడా. ఆడవాళ్లకు జేజేలు బాలీవుడ్లో ఆడవాళ్ల సై్థర్యానికి వ్యక్తిత్వానికి విలువనిచ్చే సినిమాలు వరుసగా వస్తున్నాయి. ‘సాలా ఖడూస్’, ‘పింక్’, ‘డియర్ జిందగీ’... ఇప్పుడు ‘దంగల్’. మంచి కథ ఉంటే బాక్సాఫీస్ దగ్గర కూడా లేడీస్ ఫస్ట్ అని నిరూపిస్తున్న సినిమాలు ఇవి. -
మైండ్ చిక్కితే బాడీ మెక్కుతుంది
చిక్కడమంటే సన్నబడడమే కాదు, చిక్కుల్లో పడడం కూడా! మనిషికి రకరకాల కష్టాలు. కాదనుకుంటే ఒకటీ ఉండదు. అంతా మైండ్ గేమ్! ఊబకాయం కూడా బాడీ ప్రాబ్లమ్ కాదట. దొంగది... మైండే! నిశాహారం?! ఈ మాట వింటే... ఎవరికైనా మైండు తిరుగుద్ది. అది కూడా రాత్రి పూట! చీకటిలో ఏం తిన్నా ఎవరికీ కనబడదనుకుంటాం కదూ... కానీ రీసెర్చి వాళ్లు మనల్ని పట్టేశారు... నిశాహారం అంటే... రాత్రి పూట బొక్కే జబ్బని! బిఈడి?! డిగ్రీ కాదండోయ్... ఇది కూడా బొక్కుడు జబ్బే. ఎక్కువ తింటే వచ్చే మా‘లావు’ డిగ్రీ. మమ్మీ డాడీ దగ్గర లేకపోతే తిండిలో పేరెంట్స్‌ను చూసుకుంటున్నారట. పిల్లలు దగ్గర లేకపోతే ఫుడ్డులో బిడ్డల్ని చూసుకుంటున్నారట. చెప్పాను కదా... అంతా మైండ్ గేమ్., ఇప్పటి దాకా తిండి ఎక్కువ తినడం వల్లో... పని తక్కువ చేయడం వల్లో లావవుతున్నాం అనుకున్నాం కాదా! వెరీ సిల్లీ... అంతా మైండ్ ఎంగిలి. బరువు పెరగడానికి కారణం... జీవక్రియలు తగ్గడమో, జన్యుసమస్యలు పెరగడమో కాదు. మానసిక సమస్యలే. హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక రుగ్మతలు బరువును పెంచేస్తాయని తెలిసిందే. కానీ మానసిక సమస్యలతోనూ బరువు పెరిగిపోతారా? ఇలా మంచం పట్టడానికి కారణం మానసిక కారణాల వల్ల కంచం పట్టడమే అంటున్నారు నిపుణులు. దాంతోపాటు నిశాహారం కూడా. ఇదేదో నిషా కలిగించే ఆహారం కాదు. నిశిరాత్రివేళ నిద్రపట్టక అదేపనిగా తినడం. దీనికీ మానసిక సమస్యలే కారణమని చెబుతున్నారు. ఊరకే ఉంటే ఊరిపోయి ఊబకాయం రావడం మామూలే. కానీ మనసులో అలజడి రేకెత్తించే సమస్యలతోనూ స్థూలకాయం వస్తుందంటున్న నిపుణుల మాటలను మనసుపెట్టి వినండి... మనోభారంతో శరీరమూ భారం! దిగులుగా ఉన్నప్పుడు కొందరు ఊరట కోసం అతిగా తినేస్తుంటారు. ఆగ్రహంతో పళ్లు కొరకడానికి బదులు పంటికింద పటపటలాడించడానికి ఏదో ఒకటి నమిలేస్తుంటారు మరికొందరు. ఆందోళనతో అవసరానికి మించి కంచాల కొద్దీ లాగిస్తుంటారు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో గమనించకుండా తినేస్తుంటారు. ఇలాంటివారు ఒళ్లు కదపడానికి పెద్దగా ఇష్టపడరు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు గానీ, కూర్చుని తింటే శరీరం కొండలా పెరుగుతుంది. కొండలా పెరుగుతున్న శరీరాన్ని చూసుకుంటే, మరింత దిగులు కమ్ముకుంటుంది. నలుగురిలోనూ మెలగడానికి సంకోచం కలుగుతుంది. మళ్లీ ఆ దిగులు నుంచి ఊరట పొందడానికి మళ్లీ మళ్లీ తిండినే ఆశ్రయిస్తారు. ఇదంతా ఒక విషవలయంలా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. బీఈడీ... డిగ్రీ కాదు, డిజార్డర్! మానసిక సమస్యల నుంచి బయటపడలేక తినడాన్ని అలవాటుగా చేసుకుంటే, కొన్నాళ్లకు పరిస్థితి మరింత జటిలమవుతుంది. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో పట్టించుకోకుండా అనాలోచితంగా తినేస్తూపోతే, ఈ అలవాటు క్రమంగా ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ (బీఈడీ)గా మారుతుంది. ఈ ‘బెడ్’ బాధితులకు కాసింత తీరిక దొరకడమే తరువాయి... మనసు తిండి మీదకు మళ్లుతుంది. ఎవరికైనా కనీసం వారానికి రెండు రోజులు, వరుసగా ఆరునెలలు అతిగా తినడమే అలవాటుగా కొనసాగితే, అలాంటి వారిని బీఈడీ బాధితులుగానే పరిగణించాలి. మొత్తం జనాభాలో ఇలాంటివారు రెండు శాతం వరకు ఉంటారు. స్థూలకాయుల్లో దాదాపు 25 శాతం మేరకు బీఈడీ బాధితులే. ఇలాంటివారు చురుగ్గా పనులు చేసుకోవడం కంటే, చాలావరకు కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకే ఇష్టపడతారు. బద్ధకంగా గడిపే దినచర్య ఫలితంగా స్థూలకాయులుగా మారుతారు. - ఇన్పుట్స్: డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ చక్కెరపై తీపి ‘ఎగస్ట్రా’ నిద్రలేమి, దిగులు, ఆందోళనలతో బాధపడే వారికి మెదడులోని సంతృప్తి కేంద్రం సక్రమంగా పనిచేయదు. దీనివల్ల ఏం తిన్నా, ఎంత తిన్నా వారికి తొందరగా సంతృప్తి కలగదు. అలాంటి వారి మెదడులోని ఆకలి కేంద్రం చక్కెరల కోసం ఆరాటపడుతుంది. అందుకే వారు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు లేదా తక్షణమే చక్కెరలుగా రూపాంతరం చెందే చిప్స్, సమోసాలు, మిర్చీ బజ్జీలు వంటివీ, పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తినేస్తూ ఉంటారు. చక్కెరపై అదుపులేని మోహమే వారిని చక్కెరవ్యాధి బారిన పడేలా చేస్తుంది. ఆకలి ఎరుగని తిండి ఆకలి రుచి ఎరుగదని అంటారు గానీ, ఇలాంటి తిండి తినే మానసిక రుగ్మత ఉన్న వారిలో వారి తిండి ఆకలి ఎరుగదు. భావోద్వేగాలకు విపరీతంగా లోనయ్యేవారిలో కొందరు, అవాంఛిత భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి తిండిని ఆశ్రయిస్తారు. దుఃఖం, సంతోషం, ఉత్సాహం, ఆందోళన... ఇలా ఎలాంటి భావోద్వేగం కలిగినా, దానిని అణచుకోవడానికి ఏదో ఒకటి తినేస్తారు. ఇంకొందరైతే, ఆహారాన్ని పారవేయడం ఇష్టంలేక ఆకలిగా లేకున్నా తింటారు. రకరకాల కారణాల వల్ల అభద్రతాభావంతో బాధపడేవారు సురక్షితంగా ఉన్నామనే భావన కోసం ఆకలి లేకున్నా తింటారు. ప్లేటులతో తమ చుట్టూ సురక్షితమైన కోటలు కట్టుకుంటున్నామన్న అపోహతో అన్నహితవును పెంచుతారు. ఆరోగ్యహితవు మరుస్తారు. ఎలా అధిగమించవచ్చు? మానసిక సమస్యల వల్ల అతిగా తినే అలవాటును అధిగమించడం కాస్త కష్టమే అయినా, కొంత ప్రయత్నంతో దీనిని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏం తింటున్నామో శ్రద్ధగా గమనించాలి. అతిగా తినడం అలవాటుగా మారి స్థూలకాయానికి దారితీస్తుంది. తినే పదార్థాలపై, వాటి పరిమాణంపై కాస్త శ్రద్ధపెడితే ఈ పరిస్థితిని తేలికగా అధిగమించవచ్చు.ఏ పరిస్థితుల్లో మనసు తిండి వైపు మళ్లుతుందో జాగ్రత్తగా చూడాలి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మానసికంగా ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తినడం బదులు పెయింటింగ్, సంగీతం వంటి హాబీలకు సమయాన్ని కేటాయించడం మంచిది. ఏమీ తోచకపోతే ఆరుబయట అలా కాసేపు నడక సాగించడం ద్వారా కూడా ఒత్తిడిని జయించవచ్చు.వ్యాయామం చేయడం కాస్త కఠినమైన పరిష్కారం లాగే కనిపిస్తుంది గానీ, స్థూలకాయంతో పాటు ఒత్తిడిని జయించడానికి వ్యాయామానికి మించినది లేదు. స్థూలకాయం నుంచి బయటపడాలనుకునే వారు ముందుగా మిర్చీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. సరైన పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి అనిపించదు. ఫలితంగా తిండి పరిమాణం తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది. పిల్లలతో గడపండి! పిల్లలు సహజంగా తల్లిదండ్రుల ప్రేమాభిమానాల కోసం ఆరాటపడుతుంటారు. తల్లిదండ్రులు ఎక్కువసేపు వారితో గడపడం అవసరం. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు అసాధారణమైన పనివేళల కారణంగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉండదు. దాంతో పిల్లలు వారిపై బెంగ పెట్టుకుని, క్రమంగా డిప్రెషన్లోకి కూరుకుపోతారు. ఇలాంటి పిల్లలు తిండి ద్వారా ఊరట వెదుక్కొనే ప్రయత్నంలో చిన్న వయసులోనే స్థూలకాయులుగా మారుతారు. ఒంటరితనంలో మానసికంగా కూరుకుపోయిన ఇలాంటి పిల్లలు కాస్త ఎదిగాక మద్యానికి, మాదకద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అవీ ఇవీ... స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా ప్రాచీనకాలంలోనే గుర్తించారు.ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా భావించేవారు. ప్రాచీన భారతీయ వైద్యుడు, శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే స్థూలకాయం వల్ల మధుమేహం, గుండెజబ్బులు వస్తాయని గుర్తించాడు. మధ్యయుగాల వరకు స్థూలకాయాన్ని సంపన్నులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగానే పరిగణించేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇది సామాన్యుల సమస్యగా కూడా మారింది. స్థూలకాయం సమస్య మనుషులకు మాత్రమే పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెంపుడు జంతువులకూ ఈ సమస్య ఉంది. అక్కడ 23-41 శాతం శునకాలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. వీళ్లు... హుషారు కోసం నిశాచర భోజనం చేస్తారు! ఎవరైనా విపరీతంగా తినేస్తుంటే వారి తిండిని ‘దెయ్యం తిండి’గా అభివర్ణించడం పరిపాటి. పిశాచాలు మేల్కొనే నిశివేళ ఇలాంటి వారిలో దెయ్యంలా భోజనతాపం మేల్కొందా అనిపిస్తుంది. బీఈడీ బాధితులకు, భోజన నిశాచరులకు పెద్దగా తేడా కనిపించదు. అయితే, భోజన నిశాచరులు రాత్రివేళల్లో అతిగా తింటారు. ఏ రాత్రివేళో మెలకువ వస్తే, వంటింట్లో తిండి కోసం వెదుకులాడతారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉండే ఏ చిరుతిళ్లో తిననిదే వీరికి ప్రశాంతంగా ఉండదు. రాత్రివేళల్లో ఇలా అతిగా తినడాన్ని మానసిక వైద్యులు ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ (ఎన్ఈఎస్)గా గుర్తించారు. రోజువారీ తీసుకునే ఆహారంలో 35 శాతం కంటే ఎక్కువ కేలరీలు గల ఆహారాన్ని రాత్రివేళల్లో తీసుకునే అలవాటు ఉంటే, దానిని నైట్ ఈటింగ్ సిండ్రోమ్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. ఉదయం దాదాపు ఖాళీ కడుపుతో ఉండటం, రాత్రివేళ అతిగా తినడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలన్నీ ఎన్ఈఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి వారికి ఉదయం వేళలో ఆకలి తక్కువగా, రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో దాదాపు ఒక శాతం, స్థూలకాయుల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి వారు ఉంటారు.