స్క్రిజోఫ్రీనియాడే పోస్టర్
‘ప్రత్తిపాడుకు చెందిన రమేష్ ప్రతి రోజూ కూలిపనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. రెండేళ్ల క్రితం అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పనికి వెళ్లటం మానేశాడు. ఒంటరిగా గడపటం ప్రారంభించాడు. చివరకు స్నానం చేయటం, అన్నం తినటం మానివేసి గెడ్డం పెంచుకుని తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు గాలి సోకిందని భావించి భూతవైద్యుడికి వద్దకు తీసుకెళ్లి అంత్రాలు వేయించారు. ఫలితం లేకపోవడంతో చివరకు జీజీహెచ్ మానసిక వైద్యులను సంప్రదించారు. ఆరు నెలలుగా క్రమం తప్పకుండా నెలనెలా వైద్య పరీక్షలు చేయిస్తూ మందులు వాడుతూ ఉండటంతో ప్రస్తుతం అతను సాధారణ స్థితికి వచ్చాడు. నేడు ప్రపంచ స్క్రీజోఫ్రీనియా డే సందర్భంగా ప్రత్యేక కథనం..
గుంటూరు మెడికల్: చాలా మంది వైద్యంపై అవగాహన ఉండడం లేదు. మానసిక సమస్య వైద్యపరిధి కదానే అభిప్రాయం ఉంది. దీని తోడు వివిధ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు తొలుత భూత వైద్యులను సంప్రదించి చివరి స్థితిలో మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు. మానసిక వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం చేయించటం వల్ల వారు సాధారణ స్థితికి అతి తక్కువ కాలంలోనే వస్తారు. లేదంటే దీర్ఘకాలం వ్యాధితో బాధపడుతూ అది చూసి కుటుంబ సభ్యులు కూడా కృంగిపోవాల్సి వస్తుంది.
వ్యాధి లక్షణాలు..
స్క్రీజోఫీనియా వ్యాధి మానసిక వ్యాధి. ఏ వయసులో వారికై నా వస్తోంది. జెనిటిక్ సమస్యల వలన, దీర్ఘకాలంగా మానసిక ఒత్తిడికి గురవ్వటం, మెదడులో డోపమైన్ హార్మోన్ తేడా వలన వ్యాధి వస్తోంది. తల్లిదండ్రులకు మద్యం, పొగ తాగటం లాంటి వ్యసనాలు ఉంటే వారికి పుట్టే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సోకిన వారు తనలో తాను నవ్వుకోటం, కోపంతో అరవటం, తిట్టటం, కొట్టడం, మాటలో మార్పు, ప్రవర్తనలో తేడా, ఎవరో కనబడుతున్నట్లు, తనను ఎవరో పిలుస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేయటం, చెవిలో మాటలు వినిపిస్తున్నట్లు చెప్పటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ చేసే పనులు చేయకుండా మానివేయటం, పిలిచినా పలకకుండా ఏదో ఆలోచనలో పరధ్యానంగా ఉండటం, నిద్రపోకుండా, అన్నంతిన కుండా, స్నానం చేయకుండా ఉండటం, ఒంటరిగా గడపటం చేస్తుంటారు. ఇలాంటి వారిని స్క్రీజోఫ్రీనియా వ్యాధి గ్రస్తులుగా గుర్తించి తక్షణమే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి.
జీజీహెచ్‌లో ఉచిత వైద్యం
జీజీహెచ్‌లో మానసిక వ్యాధులతో వైద్యం కోసం ప్రతిరోజూ 150 మందికి పైగా రోగులు వస్తుంటారు. వారిలో 20 నుంచి 30 మంది స్క్రీజోఫ్రీనియా వ్యాధి సోకిన వారే. జీజీహెచ్‌లో ఈ వ్యాధి గ్రస్తులకు ప్రతి రోజూ 21 నంబర్ ఓపీ గదిలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఈ వ్యాధికి చికిత్స ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తెరిగి నాటు మందులనువాడటం, భూత వైద్యులను సంప్రదించటం మాని వేసి మానసిక వైద్యులను సంప్రదించాలి.
– వడ్డాది వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment