
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాలంటూ శర్మ తరఫున అతని లాయర్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఢిల్లీ కోర్టు విచారణ చేపట్టింది. స్కిజోఫేర్నియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడంటూ పిటిషన్‌లో పేర్కొనడంతో ఎలాంటి వైద్యం అందిస్తున్నారో వెల్లడించాలని తీహార్ జైలు అధికారుల్ని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ఆదేశించారు. ఉరిశిక్ష విధించిన దగ్గర్నుంచి వినయ్ శర్మ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. అసహనంగా సెల్‌లోనే పచార్లు చేస్తున్నట్టు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు.
మానసికంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వినయ్ శర్మ ఆదివారం మధ్యాహ్నం తీహార్ జైలులో తనను ఉంచిన గదిలో తల గోడకేసి బాదుకోవడంతో గాయాలయ్యాయి. వెంటనే అతనికి అక్కడికక్కడే తీహార్ జైలు వైద్యులే చికిత్స అందించినట్టు అధికారులు చెప్పారు. ఆ గాయాలు ఏమంత పెద్దవి కావని వారు వెల్లడించారు. అయితే శర్మ తరఫు లాయర్ మాత్రం క్లయింట్ మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నాడని, తన తల్లిని కూడా గుర్తించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వినయ్ శర్మ కుటుంబ సభ్యుల కోరిక మేరకు లాయర్ తీహార్ జైలుకి వెళితే తలకి గాయాలు, కుడి భుజానికి ఫ్రాక్చర్ అయి కట్టుతో కనిపించాడని, అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందంటూ లాయర్ తాను దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన కోర్టు తీహార్ జైలు అధికారులు స్పందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment