ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం.. | Kanha Shanti Vanam Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రకృతి సోయగం.. కన్హా శాంతివనం..

Published Tue, Jan 7 2025 7:46 AM | Last Updated on Tue, Jan 7 2025 12:24 PM

Kanha Shanti Vanam Hyderabad

చుట్టూ ప్రకృతి అందాలు, విశాలమైన ఓపెన్‌ ఎయిర్‌ మందిరాలు, క్రీడా ప్రాంగణాలు, ఉచిత మెడిటేషన, వసతి సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం, అంతరించిపోనున్న మొక్క జాతుల నర్సరీ ఇది.. ప్రకృతి సోయగంగా విరాజిల్లుతున్న కన్హా శాంతి వనం.. 1,600 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటైన మందిరాల్లో లక్ష మంది ఒకే చోట, ఒకే సారి మెడిటేషన్‌ చేయడానికి అనువుగా మన హైదరాబాద్‌ కేంద్రంగా ఇది నిర్మితమైంది. నగర జీవనంలో ప్రతి ఒక్కరూ పలు రకాల ఒత్తిళ్లతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. విద్యార్థి నుంచి ఉద్యోగి, వ్యాపారి, గృహిణి, వృద్ధుల వరకూ ఇలా అన్ని వయసుల వారు ఒత్తిడి బాధితులే. దీనిని అధిగమించేందుకు మెడిటేషన్‌ ఓ చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. మానసిక సమస్యలను తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ మెడిటేషన్‌ ప్రాధాన్యతను గర్తించాలి..ఈ నేపథ్యంలో కన్హా శాంతి వనం గురించిన మరిన్ని విశేషాలు.. 

కన్హా శాంతి ఆశ్రమం పర్యావరణం, ఆధ్యాత్మిక ప్రదేశం. సరళమైన జీవనానికి డెస్టినేషన్‌గా నిలుస్తుంది. ఆరోగ్యం, వివిధ అంశాలను ప్రోత్సహించే ఇంటరాక్టివ్‌ ప్రోగ్రామ్స్‌తో పాటు ఆధ్యాతి్మక శిక్షణ అందుబాటులో ఉంటుంది. వృద్ధులకు వెల్‌నెస్‌ సెంటర్, ఆయుర్వేద, నేచురోపతి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రధానంగా మెడిటేషనకేంద్రం నిర్మాణంలోనే ఓ ప్రత్యేకత ఉంది. వాతావరణ పరిస్థితులను సమతుల్యం చేయడానికి మెడిటేషన్‌ ఫ్లోర్‌ కింద నీటిని నిల్వ చేస్తారు. కనీసం మూడు రోజుల నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో వసతి, భోజనం, అన్నీ ఉచితంగా అందజేస్తారు. 

వివిధ దేశాల నుంచి.. 
ఈ మెడిటేషన్‌ ఆశ్రమానికి ప్రపంచంలోని 162 దేశాల్లో శాఖలు ఉన్నాయి. వివిధ కళాశాల విద్యార్థులు ఇక్కడ వర్క్‌షాప్‌ నిర్వహించడం, రీ ట్రీట్‌ ప్రొగ్రాం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పాటు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచి్చన వారు ఇక్కడి మెడిటేషన్‌ తరగతుల్లో భాగస్వాములవుతున్నారు.

ప్రముఖులు సైతం.. 
రెండేళ్ల నుంచి నగరంలో ఈ పేరు అందరి నోటా నానుతోంది.. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలు కన్హా శాంతి వనం సొంతం కావడంతో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు సైతం ఈ వనాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. 

పోస్టల్‌ పిన్‌ కోడ్‌ ఆధారిత సేవలు.. 
హార్ట్‌ఫుల్‌గా మెడిటేషన్‌లో శిక్షణ తీసుకోవాలనుకునే సులువైన పద్ధతిలో శిక్షకులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ వెబ్‌సైట్‌లో తపాలా శాఖ పిన్‌కోడ్‌ నమోదు చేయగానే అక్కడ ఉండే శిక్షకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా కన్హా శాంతి వనంలో వారంలో రెండు బ్యాచ్‌లకు మెడిటేషన్‌ శిక్షణ పొందవచ్చు.

అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌..  
కన్హా శాంతి వనం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌కు అద్దం పడుతోంది. వర్షను నీటిని సైతం ఒడిసి పట్టేలా నిర్మాణాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. ప్రస్తుత కన్హా వనం ప్రాంతం రెండు దశాబ్దాల క్రితం నెర్రెలు వారిన నేలలు కనిపించేవి. నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ నేడు ఈ వనంలో వర్షపు నీరు చుక్క కూడా వృథా కాకుండా చుట్టూ కృత్రిమ చెరువులు నిర్మించారు. వాటినే గార్డెన్, మొక్కలు, రన్నింగ్‌ వాటర్, ఇతర అవసరాలకు వినియోగిస్తారు.  

ఇలా చేరుకోవచ్చు..  
నగరంలోని సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, శంషాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సరీ్వసులు నడిపిస్తోంది. సొంత వాహనాల్లో రావాలనుకునే వాళ్లు హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై తిమ్మాపూర్‌ వద్ద చేగూరు రోడ్డుకు తిరిగితే ఆశ్రమం చేరుకోవచ్చు.  


మొదటి సారి వచ్చాను.. 
నా మిత్రులు శాంతి వనానికి పోదామన్నారు. ఇక్కడి వాతావరణం, మెడిటేషన్‌ కేంద్రం, అన్నీ బాగున్నాయి. వనంలో వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉచిత వాహనం ఏర్పాటు చేశారు. 
– వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, నాగోల్‌


ట్రైనర్‌గా 24 ఏళ్ల నుంచి.. 
కనీసం మూడు రోజులు మెడిటేషన్‌ ట్రై చేయండి. మార్పు మీకే కనిపిస్తుంది. గుండె, మెదడు రెండూ కలసి పనిచేస్తే ఆరోగ్యం. ప్రస్తుతం గుండె మాట మెదడు వినే పరిస్థితి కనిపించడం లేదు. గత 24 ఏళ్లుగా మెడిటేషన్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. బెంగళూరులో కొన్నాళ్లు, ఇక్కడ కొన్నాళ్లు శిక్షణ ఇస్తుంటాను. ఆన్‌లైన్‌లోనూ తరగతులు చెబుతాను.  
– సునీతా ప్రసాద్, మెడిటేషన్‌ ట్రైనర్‌


ఇది సెక్యులర్‌ సిటీ.. 
కన్హా శాంతి వనంలో మెడిటేషన్‌ కోసం వచ్చే వారికి ఎలాంటి రుసుమూ వసూలు చేయడంలేదు. హైదరాబాద్‌ సెక్యులర్‌ సిటీ. సందర్శకుల్లో అన్ని వర్గాలనూ దృష్టిలో ఉంచుకుని ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తున్నాం. కేవలం రూ.10లకు భోజనం లభిస్తుంది. మూడు స్టార్‌ హోటల్స్‌ లోనూ భోజనం చేయవచ్చు. – కరుణాకర్, 
కన్హా శాంతివనం కో–ఆర్డినేటర్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement