ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయని భయం
నేచురల్ ప్రొడక్ట్స్ కోసం యూత్ ఆసక్తి
కెమికల్స్ ఫ్రీ ఉత్పత్తుల వైపు మొగ్గు
సౌందర్యంపై యువతలో పెరుగుతున్న అవగాహన..
సహజసిద్ధ సాధనాలపై ఇన్‌స్టాలో ఇన్‌ఫ్లుయెన్సర్ల చిట్కాలు
గుడ్డిగా వాడొద్దని చర్మవ్యాధి నిపుణుల సూచన
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్‌లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.
యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్‌గా దొరుకుతుందేమోనని ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్‌డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
కాస్త జాగ్రత్త మరి..
సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం
మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు.
నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.
అందరికీ అన్నీ సెట్ కావు..
ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి.
– డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్
ఇన్‌స్టాలో వీడియోలు చూసి..
సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment