అధ్యయనాల్లో ఆసక్తికర అంశాలు వెల్లడి
పెద్దవారిలో అల్జీమర్స్ వంటి వ్యాధులకు నృత్యంతో చెక్
పెద్దవారికి నప్పేవిగా ప్రత్యేక నృత్యాల ఎంపిక
ఆరోగ్య సమస్యలుంటే ముందస్తు వైద్య సలహా అవసరం
చిన్న కుర్రాడిలాగా ఏంటీ ఆ డ్యాన్సులు? అంటూ ఎవరైనా ఆక్షేపించినా వెనకడుగు వేయనక్కర్లేదు. ఎందుకంటే డ్యాన్సులు చేస్తే వృద్ధుల్లో కుర్రతనం ఇనుమడిస్తుందని, వృద్ధాప్య ప్రభావం కనుమరుగవుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వృద్ధాప్యంపై యుద్ధంలో మిగిలిన అన్నిరకాల శారీరక వ్యాయామాల కన్నా డ్యాన్స్ ది బెస్ట్ అని తేల్చడం విశేషం. సిటీలోని ప్రతి డ్యాన్స్ స్టూడియో తమ నేమ్ బోర్డులో ఫిట్‌నెస్ అనే పదాన్ని చేర్చుకుంటున్న నేపథ్యంలో పెద్దవాళ్లు సైతం డ్యాన్సర్లుగా మారేందుకు ఇలాంటి సర్వే ఫలితాలు తోడ్పడనున్నాయి.
వృద్ధాప్యాన్ని జయించడంలో శారీరక శ్రమను మించిన ప్రత్యామ్నాం లేదు. దీనిని ఇప్పుడిప్పుడే ఆధునికులు గుర్తిస్తున్నారు. జిమ్‌లు, యోగాసనాలు.. వగైరా ఎన్నో వ్యాయామ శైలులు.. ఒక్కో వ్యాయామం ద్వారా ఒక్కో రకమైన ప్రయోజనం. అదే క్రమంలో నృత్యం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
స్టడీ ఇదీ.. ఫలితం ఇదీ..
అన్ని వ్యాయామాలూ ఆరోగ్యానికి ఉపయోగపడేవే అయినా నృత్యం వల్ల వృద్ధాప్య సమస్యలకు చాలా మంచిదని ఫ్రంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన నిర్ధారించింది. వయసు పరంగా మీదపడే శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోడంలో ఎండ్యురెన్స్‌ట్రైనింగ్, డ్యాన్సింగ్ రెండింటి మధ్యా వ్యత్యాసాన్ని పరిశీలించినప్పుడు డ్యాన్స్ మరింత లాభదాయకమని తేలిందని పరిశోధనకు సారథ్యం వహించిన జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్‌కు చెందిన డాక్టర్ కేథరిన్ అంటున్నారు. సగటున 68 ఏళ్ల వయసున్న వందలాది మందికి 18 నెలల పాటు నృత్య శిక్షణ, ఎండ్యురెన్స్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీరిలో నృత్యాన్ని ఎంచుకున్నవారి బ్రెయిన్‌లోని హిప్పో క్యాంపస్ ప్రాంతంలో మరింత ఆరోగ్యకరమైన వృద్ధి కనిపించింది. వృద్ధాప్య ప్రభావాన్ని పెంచి తత్సంబంధిత అల్జీమర్స్ తరహా వ్యాధుల్ని దరిచేర్చడంలో కీలకం ఈ ప్రాంతమే. ఈ పరిశోధన ఫలితాలను అనుసరించి బ్రెయిన్‌పై యాంటీ ఏజింగ్ ప్రభావాలను చూపే సరికొత్త ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను జిమ్మిన్ (జామ్మింగ్, జిమ్నాస్టిక్) అనే పేరుతో శబ్దాలను (మెలొడీస్, రిథిమ్) పుట్టించే ఒక కొత్త పద్ధతిని వీరు రూపొందించారు.
నృత్యం ఆరోగ్యకరం..
ప్రతి ఒక్కరూ ఎంత కాలం వీలైతే అంత కాలం స్వతంత్రంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటారు. శారీరక శ్రమ దీనికి ఉపకరిస్తుంది. దీనిలో నృత్యం భాగమైతే శరీరానికి, మైండ్‌కి కొత్త సవాళ్లను, చురుకుదనాన్ని అందించడం అనివార్యం అని నగరానికి చెందిన డ్యాన్స్ మాస్టర్ బాబీ అంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇది మరింత మేలు చేస్తుందనేది తమ వద్ద శిక్షణకు వస్తున్నవారి విషయంలో రుజువైందన్నారు.
ఇవీ తెలుసుకోండి..
శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే సంతోషకారక హార్మోన్లు విడుదల అవుతాయి అని ఆ్రస్టేలియాలోని క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యుయుటి) కూడా నిర్ధారించింది.
👉అంతర్గత ఆరోగ్య సమస్యలున్నవారికి నృత్యాలు సరిపడవు. కాబట్టి నృత్యాన్ని ఎంచుకునే ముందు ఫ్యామిలీ డాక్టర్ అభిప్రాయం తీసుకోవడం అవసరం.
👉 సోలో డ్యాన్సింగ్ సులభమైనది, పెద్దలకు బాగా నప్పుతుంది. అదే విధంగా ఓరియంటల్ డ్యాన్స్, బాలె డ్యాన్స్, ఇండియన్ డ్యాన్స్, ట్యాప్ డ్యాన్స్..
వంటివి చేయవచ్చు.
👉మోకాలు, హిప్, కాలి మడమ నొప్పులు.. వంటివి ఉన్నవారి కోసం సీటెడ్ డ్యాన్స్ కూడా ఉంది.
👉బాల్ రూమ్ డ్యాన్స్‌నే సీనియర్స్ బాగా ఇష్టపడతారు.. ఎందుకంటే ఇవి కపుల్ డ్యాన్స్ క్లాసెస్ కావడంతో పెద్దలకు చాలా ఉపయుక్తం. – ఈ డ్యాన్సుల్లో ఇతరులతో సోషలైజింగ్ ఉంటుంది కాబట్టి, ప్రాధాన్యత కలిగిన వారిమే అనే అభిప్రాయంతో హుషారు వస్తుంది.
👉పెద్దల్లో ట్యాంగో, క్విక్ స్టెప్, వియన్నీస్ వాల్ట్‌జ వంటివి జ్ఞాపకశక్తి వృద్ధి
చెందేందుకు దోహదం చేస్తాయి.
👉 చా– చా– చా, రుంబా, సాంబా, ప్యాసో.. వంటి విదేశీ నృత్యాలు చూడడానికి కాస్త సులభంగా అనిపించినా చేసేందుకు కొంత సంక్లిష్టంగా
ఉంటాయి. అలాగే వీటికి మరింత శారరీక సామర్థ్యం అవసరం కాబట్టి వీటిని ఎంచుకోకపోవడమే ఉత్తమం.
👉లైన్ డ్యాన్సింగ్ పెద్ద వయసులో ఉన్నవారికి అత్యంత ఆదరణ పొందుతోన్న నృత్యశైలి. అమెరికాలో ఇది బాగా పాపులర్. ఈ నృత్యంలో డ్యాన్సర్లు ఒకరితో ఒకరు టచ్ చేయాల్సిన అవసరం
ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment